సోషల్ మీడియా : -తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత నెటిజన్ల మీద కొన్ని విమర్శలు ఉన్నాయి !అవి ఎందరి మీదనో కొందరి విమర్శలు ! ఉదాహరణకు ఒక విమర్శ గురించి ఈ రోజు చెప్పుకుందాం!
ఆ విమర్శ ఇదీ,
'పక్కన మనుషులతో మాట్లాడరు కానీ,,ఫోన్లో తల దూరుస్తారు' అని- ఇవాళ ఫోన్ అంటే , సెల్ ఫోన్ కద!? అంటే సోషల్ మీడియా కద!? పేస్ బుక్- వాట్సాప్- టెలీగ్రామ్ ఇంకా చాలా సాధనాలు ఉన్నాయి అందులో!
ఆ విమర్శ సరైన విర్షేనా? 
(దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని , నిన్న రాత్రి 
పేస్ బుక్ మిత్రుడు ఒకరు ,అదే పేస్ బుక్ మెసెంజర్ సర్వీస్ ద్వారా అడిగారు కూడా! )
పైకి చూస్తే, సరైన విమర్శ లాగే అనిపిస్తుంది! నిజమేనా అని?! ఆ విమర్శలో నిష్ఠూరం కూడా ఉంది- ఒకప్పుడు మనుషులు నలుగురు కలిస్తే , చక్కగా కబుర్లు చెప్పుకునే వారు, ఒకప్పుడు అంటే? ఈ సోషల్ మీడియా అందుబాటులోకి రాక ముందు అన్నమాట, వారి ఉద్దేశ్యం ప్రకారం! ఈ సెల్ ఫోన్లు లేక ముందు మనుషులు కలిస్తే పరస్పరం మాట్లాడుకునే వారు- లేదా వెళ్లి మాట్లాడుకునేవారు లేదా ఉత్తరాలు రాసుకునేవారు!వారైనా అందరా అంటే ? కాదు,ఎవరో పరస్పరం ఇష్టం అయిన వారు అవసరం అయిన వారు మాత్రమే , అలా వ్యవహరించే వారు! చుట్టూ ఎందరు ఉన్నా,అవసరమైన వారితో ఇష్టం అయిన వారితో మాత్రమే మాట్లాడుకునే వారు! సెల్ ఫోన్లు లేని కాలంలో కూడా అందరూ కనపడ్డ ప్రతీ వారితో పెద్దగా ఏమీ మాట్లాడే వారు కాదు,పూర్వం గ్రామాలలో కూడా నిత్యం కనబడే వారిలో కూడా చాలా మంది అనేక రోజుల పాటు ఏమీ మాట్లాడుకునే వారు కాదు- అవసరం ఉండాలి దేనికైనా! అవసరం అనేది ఏమీ తప్పు కాదు ! పరస్పరం అవసరాల మీదనే ఈ ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారపడి సాగుతోంది!
ఒకప్పుడు- రేడియో వచ్చిన కొత్తలో కూడా ఇలాగే అనేవారు 'పొద్దస్తమానం ఆ రేడియోకి చెవులు అప్పగించడం ఏమిటీ ?' అని!
తరువాత వార్తాపత్రికలు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఇలాగే అనే వారు ' పేపర్లో తల దూరుస్తారు'అని!
తరువాత మీ అందరికీ తెలిసిన విషయమే 'టీవీలకు అతుక్కుపోతారు' అని!
ఇప్పుడు 'సోషల్ మీడియా' వంతు వచ్చింది!
పాత కమ్యూనికేషన్ సాధనలకు తోడుగా ,ఎప్పటికప్పుడు అందుబాటులోకి సరికొత్త సాధనాలు వస్తూనే ఉంటాయి! జనం వాటిని వాడుతూ ఉంటారు!
ఇప్పటికీ రేడియో వినేవారు దినపత్రిక చదివేవారు టెలివిజన్ చూసేవారు అలాగే సోషల్ మీడియా వాడేవారు ఉన్నారు- నేనూ వారిలో ఉన్నాను! నాలాగే వాటన్నిటినీ ప్రతీ రోజూ ఉపయోగించే వారు మీలో కూడా చాలా మంది ఉన్నారు!
మన గ్రామం అని కనిపించిన ప్రతీ వారితో మాట్లాడలేం!
మా వంశం అనో - మా కుటుంబం అనో - మా బంధువులు అనో - మా కులం మతం ప్రాంతం వర్గం జెండర్ అనో కనపడిన ప్రతీ వారితోనల్లా మాట్లాడలేం- అవసరం ఉండాలి! ఏదో ఒక అవసరం ఉండాలి- అభిప్రాయాలు ఆలోచనలు దృక్పథాలు అభిరుచులు ఎన్నో విషయాలు ఉన్నాయి మనుషులు మాట్లాడుకోవాలి అంటే! కేవలం ఎదురుగా ఉన్నారు కదాని ఎవరితో పడితే వారితో ఎడాపెడా ఏమి మాట్లాడలేం!పూర్వం కూడా అలా ఏమీ మాట్లాడుకోలేదు- మాట్లాడుకునే వారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు!
ఈ సోషల్ మీడియా ద్వారా ఏక కాలంలో, ఓ కెనడా మిత్రుడితో - ఓ పక్క రాష్ట్ర మిత్రుడితో - గ్రామంలో ఉన్న మిత్రుడితో మాట్లాడ గలుగుతున్నాం! అది మామూలు విషయం కాదు ! దీన్ని ' సోషల్ మీడియా మహత్మ్యం' అనాలి- ఈ మహత్మ్యం క్రమంగా సాకారం కావడానికి ,మనకు అందుబాటులోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల ఎందరెందరో కృషి ఉంది- శాస్త్రవేత్తల టెక్నిషియన్ల కార్మికుల పెట్టుబడిదారుల దేశదేశాల ప్రభుత్వాల వల్ల మనకీ సౌకర్యాలు కలుగుతున్నాయి!
మనుషులకు కమ్యూనికేషన్ అవకాశాలు పెరుగుతున్నాకొద్దీ,మానవ సంబంధాలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతున్నాయి! శుభ పరిణామం కద!
దేశాలు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత, మనుషులు స్వేచ్ఛా కోసం ప్రయత్నాలు చేస్తారు! ఇది కూడా శుభ పరిణామమే కద!
ఇంతకూ- ఈ సోషల్ మీడియా లేకపోతే నేను ఇలా మీతో ఏక కాలంలో వందల వేల మంది మిత్రులతో మాట్లాడ గలిగేవాన్నా? వారూ నాతో మాట్లాడ గలిగే వారా?
ఇందులో మా పక్క ఇంటివారు లేకపోతే నేను ఏం చెయ్యగలను? అవసరం ఉండాలి!