చేతకాదని తెలుసుకున్నాను: -- యామిజాల జగదీశ్


అవును ఈ విషయం తెలుసు. కానీ దిగి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంతకూ ఏం తెలుసుకున్నాను...అమ్మించడం చేతకాదని. సరే విషయానికొస్తాను.
మా పక్క వాటా తను ఇటీవల ఓ హోల్ సేల్ దుకాణం ప్రారంభించారు. నా మీది నమ్మకంతో నన్ను సాపులో వచ్చి కూర్చోమని ఒకటి రెండుప సార్లు చెప్పాడు. చిన్న నవ్వుతో ఊరుకున్నాను. మళ్ళీ అడిగేసరికి మొహమాటపడి వెళ్ళాను. అక్కడ మొదటి రెండు మూడు రోజులు మామూలుగానే సాగింది. ఆ తర్వాతి రోజు ఆయన ఓ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. సరుకులు కొనడానికి వచ్చే వారితో సాదరంగా ఆహ్వానించి వారనుకున్నదానికన్నా ఎక్కువ సరుకులు కొనేట్టు చేయాలన్నారు. ఫలానాది మా దగ్గరే బాగుంటుంది...చుట్టుపక్కల ఎక్కడా ఇంతకన్నా తక్కువ ధరకు దొరకదు...నాణ్యం విషయంలో రాజీ పడబోము...అన్నీ సరాసరి ఫ్యాక్టరీ నుంచి వచ్చనవే అమ్ముతామని ఇలా ప్రతి వస్తువు గురించి విడమరిచి చెప్పాలని అన్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ విని సరేనని బుర్ర ఊపాను.కానీ ఆయన చెప్పింది ఒక్కటీ ఆచరణలో పెట్టలేదు. షాపుకొచ్చే వినియోగదారుడితో మాట్లాడటం చేతకాలేదు. అతనికి వినిపించనంత సన్నని స్వరంలో ఒకటీ అరా మాటలు చెప్పేవాడిని. నాకిక చేతకాదని ఓ గట్టి నిర్ణయానికి వచ్చి మానేస్తానని చెప్పేసాను. అయినా నన్నెలాగైనా ఉండమని ఆయన, ఆయన మిత్రుడు ప్రయత్నించారు. నేను ససేమిరా అన్నాను.
నిజానికి నేను దాదాపు ముప్పై ఏళ్ళకుపైబడి వివిధ పత్రికల్లో ఎడిటోరియల్ విభాగంలో పని చేశాను. వార్తలు రాసేవాడిని. కానీ ఎవరితోనన్నా మాట్లాడవలసి వస్తే తెగ బిడియపడేవాడిని. ఎందుకో తెలీదు. నా మనస్తత్వం మొహమాటానికి అలవాటుపడిపోయింది. అటువంటి నేను  ఓ షాపులో ఆకట్టుకునే రీతిలో మాట్లాడి వినియోగదారుని ఒప్పించి సరుకులు అమ్మించడమనేది అనేది చేతకాలేదు. ఓ వారంలోపే ఈ విషయాన్ని తెలుసుకుని ప్రయోగాలతో జాప్యం చేసి నా వల్ల కాదని తలవంచడం కన్నా తక్షణం చెప్పి ఇవతలకు వచ్చేయాలనిపించి ఉన్న మాట చెప్పేసాను. నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు. కానీ అది సరకులను అమ్మడానికి పనికిరావడం లేదు. కనుక నేను మానెస్తానని చెప్పేసాను. నా జీవితంలో ఇది 23వ ఉద్యోగం. షాపులో పని చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దాదాపు నలబై రెండేళ్ళ క్రితం మద్రాసులో బొమ్మలు అమ్మే దుకాణంలోనూ, కిరాణా దుకాణాంలోనూ ఓ పది నెలలు పని చేశాను. కానీ ఇప్పుడు హోల్ సేల్ దుకాణంలో కేవలం రెండు వారాలు మించి పని చేయలేకపోయాను. ఈ రెండు వారాలలో ఒకటి రెండు అనుభవాలతో నా అంచనా తప్పయినట్లు తెలుసుకున్నాను. ఓ రోజు ఓ ధనవంతుడు వచ్చాడు. అప్పుడు దుకాణంలో నేనొక్కడినే ఉన్నాను. ఆయనతో మొదటే చెప్పేసాను. నాకు హిందీ రాదు. తెలుగులో మాట్లాడమని వినయంగానే చెప్పాను. తాను తెలుగు వాడినే అని తెలుగులో మాట్లాడాడు. అతను బాగానే కొంటాడు అనుకున్నాను. కానీ నేననుకున్నదొకటియ అయినదొకటి. ఆయన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్ నట్స్ ఇలా కొన్నింటి ధరలు అడిగి అన్నీ తగ్గించిస్తే తీసుకుంటానన్నారు. తగ్గించడం కుదరదని, ఫిక్సెడ్ రేట్స్ అని చెప్పాను. మేము మొదటిసారి మీ దుకాణానికి వచ్చామని, మళ్ళీ మళ్ళీ మేము రావాలంటే ధరల విషయంలో పట్టుబట్టక సడలించాలన్నారు. ఈ షాపు నాది కాదని, మా మిత్రుడిదని చెప్పాను. అయినా ఒకటి రెండు జీడిపప్పులు, బాదంపప్పులు రుచి చూస్తానంటూ నోట్లో వేసుకున్నాడు. ఓ అర గంటపైనే ఏవేవో మాట్లాడారు. కాస్సేపు కూర్చున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఇటు పోతూ ఏదో కొత్త షాపులా ఉందేనని వచ్చానండి...ఈసారి తన భార్యతో కలిసొచ్చి కొంటానండి అని ఒక్కటీ కొనక వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే, మరో రోజు చిత్తుగా నలిగిన బట్టలు వేసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. ముడతలు పడ్డ శరీరం... రేగిన జుత్తు.... కనిపించీ కనిపించని తిలకం... రబ్బరు చెప్పులు.... ఓ చేతి వేళ్ళు సరిగ్గా లేవు... ఎడం చేతికి ఓ పాత వైరుబ్యాగు తగిలించుకున్నాడు. చూస్తుంటేతేనే తెలిసిపోయింది అతని తీరు చూసి ఏమీ కొనలేడని మనసులో అనుకున్నాను. ఎండు ఖర్జూరం కావాలని మెల్లగా అడిగాడు. సరిగ్గా వినిపించక ఏంకావాలండి అని అడిగాను. ఎండు ఖర్జూరం అని కాస్త స్వరం పెంచి చెప్పాడు. ఉన్నాయన్నాను. ప్యాకెట్ తీసి చూపించాను. రెండు ప్యాకెట్లు కావాలన్నాడు. తీసిచ్చాను. అలాగే మరో రెండు ప్యాకెట్లేవో కావాలంటే ఇచ్చాను. తీసుకున్నాడు. నాలుగు వందల అరవై రూపాయలవుతాయని చెప్పాను. అప్పటికే అనుమానమేసింది, అతను కొనలేడని అనుకుంటున్న సమయంలోనే సంచీలోంచి ఓ పాత పర్సు బయటకు తీసి అందులోంచి ఓ అయిదు వందల రూపాయల నోటు చాచాడు తీసుకోమని. ఆశ్చర్యమేసింది. టిప్ టాపుగా వచ్చినతనేమో రుచి చూసి అన్నీ బాగున్నాయంటూ అక్కర్లేని కబుర్లన్నీ చెప్పి ఓ తాళం తిప్పుతూ ఏదీ కొనకుండా వెళ్ళిపోయాడు. కానీ ఏం కొంటాడితనుకున్న పెద్దాయనేమో కొనడం. ఆశ్చర్యమేసింది. వేషధారణ చూసి ఓ నిర్ణయానికి రాకూడదని ఇదొక పాఠం. నా లెక్క తప్పిన మాట అటుంచితే, నాలాంటి మొహమాటొస్తుడికి అమ్మకం అనేది అంత సులభమైన విషయం కాదని తెలిసొచ్చింది.