ఔ మల్ల: -- బాలవర్ధిరాజు మల్లారం


 నలభై అయిదేండ్ల కిందట 

మా ఊల్లే గీ 'కిస్ మిస్'పండుగ లేదుల్లా!

మొదాల్ మొదాల్  మా ఊల్లె 

గీ యేసు మతం బట్టింది

కురుమొల్ల జాప లింగయ్యనే.

గా లింగయ్య కు సదువు రాదు

అయిన గని పొద్దంతా గొర్ల గాసుడో,

ఎవుసం పనో జేసుకుంట

రాత్రి బల్లె కొద్దిగ సదువుకున్నడు

ఒగ్గు కత నేర్సు కొని 

ఇంకొక కురుమాయనతో కలిసి

ఒగ్గు కత జెప్పుడు మొదలు వెట్టిండు

అట్లట్ల సెప్పుకుంట సెప్పు కుంట

హైదురబాద్ రేడియల గుడ 

ఒగ్గు కత సెప్పిండు

గట్లాంటోడు ఎవలు జెప్పిండ్రో  ఏమో గనీ

గీ యేసు మతం పట్టిండు

మెల్లంగ మెల్లంగ

బైబులు సదువుడు మొదల్ వెట్టిండు

బతుకు దెరువు కోసురం

మస్కట్ గుడ పోయచ్చిండు 

ఆచ్చినంక బైబులును బగ్గ సదివి,

నేర్సుకొని

బైబులు సెప్పుడు మొదల్ వెట్టి

ఒక్కొక్కొల్లను జమ జేసి

సంగం ఏర్పాటు జేసిండు.

నడుమ  ఊల్లె కొద్ది మంది తొని 

దెబ్బల్ గుడతిన్నడు.

అయిన గని తాను

పట్టిన పట్టు ఇడువకుంట

యేసును నమ్ముకున్నడు .

కొద్ది మందితోని సంగం పెట్టిండు. 

మొదట్ల తిట్టుడు, కొట్టుడు జేసిన గని

గిప్పుడు  మా ఊల్లె  యేసు మతపోల్లను

ఎవ్వల్లు గుడ ఏమంటలేరు

అందరు కలిసి మెలిసి ఉంటున్నరు.

గీ దినం కిస్ మిస్ పండుగు మా ఊల్లె 

జరుగుతున్నదంటే  మూల కార్నము

గా జాప లింగయ్యనే.

అయ్యో ..సెప్పడం మర్సిన

గిప్పుడు  గా జాప లింగయ్య ను

మోషే అంటున్నరుల్లా.

గిప్పుడు మా మల్లారం ల 

సెర్సి గుడ ఉందుల్లా!

మా మల్లరం ల

మూడు మతాలున్నా

ఏ కొలుపులు, కొట్లాటలు లేకుంట

అందరం కలిసి మెలిసి బతుకుతున్నం

మనుషులే ముందు:

అటెన్కనే కులమైనా, మతమైనా

ఔ మల్ల!