అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను--ఎం బిందుమాధవి

 "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను

సజ్జనుండు పల్కు చల్లగాను

కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా

విశ్వదాభిరామ వినుర వేమ"


ప్రణవి శనివారం మధ్యహ్నం ఆఫీస్ నించి వచ్చి ఫాల్స్, మ్యాచింగ్ బ్లౌజులు తెచ్చుకోవలసిన చీరలు వార్డ్ రోబ్ లోంచి తీస్తుంటే, కాంతి వచ్చి ఆ పక్కనే కూర్చుని కబుర్లు మొదలెట్టింది.


'అమ్మా ఈ రోజు ఉదయం అసెంబ్లీలో ప్రిన్సిపల్ ఒక అనౌన్స్ మెంట్ చేశారు.'


'9th, 10th క్లాసుల నించి 10 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి నేషనల్ ఒలింపియాడ్ కి పంపిస్తామన్నారు.'


'ఎవరిని సెలెక్ట్ చేశారో రేపు లిస్ట్ తయారు చేసి క్లాస్ హెడ్ కి తెలియ చేస్తామన్నారు. అన్నయ్య ఆ లిస్ట్ లో ఉంటే బాగుండమ్మా' అన్నది.


' అమ్మా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, పొద్దున్న ఈ అనౌన్స్మెంట్ చేసేటప్పుడే, ప్రిన్సిపాల్ గారు పోయిన నెలలో మా స్కూల్ నించి "interschool sports competetion" కి వెళ్ళిన బ్యాచ్ ఓడిపోయారనీ, కానీ ఈ సారి బాగా శ్రద్ధగా తయారయి వెళ్ళి స్కూల్ కి కప్ తేవాలి' అని చెప్పారు, అన్నది.


కొడుకు ప్రశాంత్ ఆటలయి గ్రౌండ్ నించి ఇంటికి రాగానే ప్రణవి, కాంతి చెప్పిన విషయం గురించి అడిగింది. ప్రశాంత్ తల్లితో 'అవునమ్మా పోయిన నెలలో స్పోర్ట్స్ కాంపిటీషన్ కి వెళ్ళిన వాళ్ళు అందరూ మంచి ప్లేయర్సే . కానీ, చివరి నిముషంలో ఆ 'కశ్యప్' గాడు మిగిలిన వారితో ఏదో చిన్న విషయానికి గొడవ పడి మొత్తం రసాభాస చేశాడు'.

'ఆటల్లో ఎంతో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, ప్రశాంతత అవసరం కదమ్మా.'


'కశ్యప్ స్వతహాగా చురుకైన వాడు, క్లాస్ లో మార్క్స్ కూడా బాగానే వస్తాయి, ఆటలు కూడా బాగానే ఆడతాడు కాబట్టి టీచర్లు వీడు స్కూల్లో చిన్న చిన్న గొడవలు పడినా inter school competitions లో సెలెక్ట్ చేశారు.'


'తీరా అక్కడికెళ్ళి కూడా అందరితో కలిసి మెలిసి ఒక టీం స్పిరిట్ లేకుండా, తన ఆధిక్యం చూపించుకోవాలని ప్రయత్నం చేసి చివర్లో గొడవపడ్డాడుట. దానితో పాపం, మిగిలిన ప్లేయర్స్ అంతా డిస్టర్బ్డ్ గా ఉండి ఓడిపోయారు.'


'అందరిలో పిల్చి చెబితే వాడు నొచ్చుకుంటాడని ప్రిన్సిపాల్ గారు తన రూం కి పిల్చి మందలించారుట,' అని చెప్పాడు.


ఈ విషయం చెబుతూనే, 'అమ్మా వచ్చేనెలలో మా స్కూల్ నించి మమ్మల్ని పదిమందిని ఎన్నిక చేసి 'నేషనల్ ఒలింపియాడ్ ' కి పంపిస్తున్నారని' చెప్పాడు. 'దాని కోసం మాకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారని 'చెప్పాడు.


అప్పటి వరకు జరిగిన సంభాషణంతా మనసులో పెట్టుకుని ప్రణవి కొడుకుతో, 'నాన్నా ప్రశాంత్ ఒక విషయం గుర్తు పెట్టుకో. నలుగురిని ఆకట్టుకోవటానికి గల గలా మాట్లాడుతూ హడావుడి చెయ్యటం కాదు ముఖ్యం, సందర్భం వచ్చినప్పుడు మన మీద అవతలి వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి కృషి చెయ్యటం ప్రధానం. మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఎంత బాగా ప్రెజెంట్ చేశాము అనే దాన్ని బట్టే మన తుది విజయం నిర్ణయించబడుతుంది.'


మీమీద ఎంతో నమ్మకం పెట్టుకుని, స్కూల్ కి 'ట్రాఫీ' లు 'కప్పు ' లు తెస్తారని మిమ్మల్ని సెలెక్ట్ చేసి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తున్నారంటే మీరు కూడా ఎంతో బాధ్యతగా ఉండి మీ లక్ష్యాన్ని మర్చిపోకుండా కష్టపడి మీ సత్తా చూపించండి.


ఆడంబరాలు, హడావుళ్ళు కాదు చెయ్యాల్సింది, తుది విజయం ద్వారా ఫలితం చూపించటం ముఖ్యం అంటూ


"అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను

సజ్జనుండు పల్కు చల్లగాను

...............

అని కొడుకు భుజం తట్టి ముందుగా శుభాకాంక్షలు తెలియచేసింది.