నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు: ఎం. బిందు మాధవి

 "నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చదువ పద్య మరయ చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ వినురవేమ"

విలువైన జాతి నీలం ఒక్కటి ఉంటే చాలు, తళ తళ మని మెరుస్తూ ఏ విలువ లేని రాళ్ళు ఎన్ని (తట్ట నిండా) ఉన్నా వృధాయే.
అలాగే చాలా పద్యాలు నేర్చుకునే కంటే మనిషి నడవడిని తీర్చిదిద్దే ఒక్క మంచి పద్యం నేర్చుకుంటే చాలు అని అర్ధం.
వేమన తేలికైన పదాలతో ఈ విషయాన్ని ఇలా వివరించాడు.
ఇప్పుడు దైనందిన జీవితంలో ఈ పద్యాన్ని ఎలా అన్వయించుకోవచ్చో ఈ కధ ద్వారా తెలుసుకుందాము.
*******
నీలిమ ఆఫీస్ నించి వస్తుంటే దారిలో 'జయ ఇంటర్నేషనల్ ' హోటల్లో 'గార్డెన్ వరేలి' డిస్కౌంట్ సేల్ పెట్టాడని చూసి వచ్చి పక్కింటావిడకి చెప్పి గబ గబా తయారై ఆవిడతో సహా వెళ్ళి మూడు డ్రెస్సులు, నాలుగు చీరలు కొనుక్కొచ్చింది.
రెండు రోజుల్లో ఆ చీరలకి ఫాల్స్ కుట్టించి, బ్లౌజులు రెడీ చేసుకుని ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అనుకుంటూ ఉండగా, సుల్తాన్ బజార్ లో మరో కాటన్ సిల్క్ ఎగ్జిబిషన్ పెట్టాడని ఆ రోజు పేపర్ లో చూసి భర్తతో
'ఏమండీ, మొన్న మనం వెళ్ళిన పెళ్ళిలో పెళ్ళి కూతురు పిన్ని కట్టుకున్న బాటిల్ గ్రీన్ చీర లాంటిది ఎప్పటినించో కొనుక్కోవాలనుకుంటున్నాని చెప్పాను గుర్తుందా? ఈ రోజు పేపర్ లో సుల్తాన్ బజార్ లో పెట్టిన ఎగ్జిబిషన్ గురించివేశాడు. అక్కడికెళ్ళి నేననుకుంటున్న గ్రీన్ చీర దొరుకుతుందేమో చూసొద్దాం వస్తారా?' అని అడిగింది.
'నాకు పని ఉంది, నువ్వెళ్ళు' అని భర్తతో అనిపించుకుని ఎలాగో శనివారం దాకా ఓపిక పట్టి ఆఫీస్ కొలీగ్ తో కలిసి వెళ్ళింది. తను కోరుకున్న బాటిల్ గ్రీన్ చీర దొరకలేదని, ఎలాగూ అంత దూరంవచ్చాను కదా అని ఓ పచ్చ చీర తెచ్చుకుంది.
ఇంతలో నీలిమ ఆడపడుచు కొడుకు పెళ్ళి ఆహ్వానం వచ్చింది.
ఇక ఒకటే హడావుడి - ఎదురు సన్నాహానికి ఈ రంగు చీర కట్టుకుంటే బాగుంటుంది. సూత్రధారణ సమయానికి ఆ చీర కట్టుకుంటే విడియోలో బాగా పడుతుంది, రిసెప్షన్ కి ఈ చీర గ్రాండ్ గా ఉంటుంది అని, ఇలా 5-6 చీరలు కావాలని పెట్టె సర్దటం మొదలు పెట్టింది.
తీరా తనదగ్గరున్న వాటిలో బాగా మనసుకి నచ్చి తను అనుకున్న సందర్భానికి డాబుగా కనిపించే చీరలు 5-6 లేవని షాపింగ్ వెళదాం రమ్మని భర్తని పోరటం మొదలు పెట్టింది.
భర్త రాఘవ - 'ఏంటోయి మొన్న గార్డెన్ సేల్ కి వెళ్ళి బోలెడు డబ్బు పోసి నాలుగు చీరలు తెచ్చావు. సుల్తాన్ బజార్ లొ ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఒకటో రెండో తెచ్చావు. ఎవరిదో పెళ్ళి పిలుపు రాగానే మళ్ళీ చీరల షాపింగ్ అని బయలుదేరుతున్నావు. '
ఎన్ని చీరలు కొంటావు? అప్పుడే పెళ్ళిళ్ళకి, సీమంతాలకి సరిపోయేట్లు ఒకటో రెండో ఖరీదైనవి కొనుక్కుంటే అన్ని సందర్భాలకి ఉపయోగపడతాయి కదా! ఇలా ప్రతి సారీ అక్కరలేనివి, ఉపయోగపడనివి కొని ఇల్లు నింపటం ఎందుకు? అంటూ ఉండగా
పక్కింట్లో నించి శీను
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
...................
అని వాళ్ళ తాతగారికి పద్యం అప్పచెప్పటం వినిపించింది.