నోరు జారితే (కథ) : సరికొండ శ్రీనివాసరాజు


 ఆ అడవిలో ఒక కోతికి నోటి దురుసు ఎక్కువ. చిన్న పొరపాటుకు అనరాని మాటలు అని అవతలి జీవులను బాధ పెడుతుంది. కొన్ని జీవులను అకారణంగా ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంది. కొన్ని చాలా బాధ పడ్డాయి. మరికొన్ని కోపం వచ్చి కొట్టడానికి పోతే కోతి మెరుపు వేగంతో తప్పించుకునేది. ఆ అడవిలో అత్యంత సాధు జంతువైన ఆవు అలా నడుచుకుంటూ పోతుంది. కోతి అకారణంగా ఆవును ఆట పట్టిస్తుంది. ఆవు పట్టించుకోలేదు. కోతి ఆవును అనరాని, వినరాని దారుణమైన మాటలతో దూషించసాగింది. ఆవు ఎంతో సహనంతో ముందుకు వెళ్తుంది. ఒక జింక అది చూసి ఆవుతో "ఓ గోమాతా! ఆ కోతి ఎంతోమందిని తన పరుషమైన మాటలతో దూషిస్తుంది. దానికి ఎవరైనా బుద్ధి చెబితే బాగుంటుంది. నువ్వైనా దాని భరతం పట్టవచ్చు కదా!" అని అంది. "అనవసరంగా దాని నోరు పారేసుకుంటే దానికే నోరు నొప్పి కానీ నాకేమైనా నష్టమా? పట్టించుకోకపోతే అదే నోరు మూసుకుంటుంది." అన్నది ఆవు. జింక వదిలిపెట్టకుండా ఈ విషయం అడవికి రాజైన సింహానికి చెప్పింది. అంతే కాదు. కోతి ఇంతకు ముందు ఏఏ జంతువులను ఎలా తిట్టిందో వివరించింది. సింహం అడవి జీవులను అన్నింటినీ సమావేశపరచింది. ఈ సమావేశ విషయం ముందే జింక ఆవుకు చెప్పింది. 


          ఆ సమావేశంలో జరిగిన విషయాన్ని ఆవును చెప్పమని, సింహం కోరింది. ఆవు కోతిని బాగా పొగిడింది. కోతి చాలా పొంగిపోయింది. ఆవు రెండు ఆటాడే బంతులను తెప్పించింది. కోతితో ఇలా అంది. "ఓ మర్కటరాజమా! నువ్వు ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని అయినా గురి చూసి కొట్టడంలో దిట్ట అని విన్నాను ‌" అని. "అవును." అంది కోతి. "అయితే ఈ బంతిని ఎదురుగా నీకు చాలా సమీపంలో ఉన్న మర్రిచెట్టు తొర్రలోకి కొట్టు." అంది. కోతి గురి చూసి ఆ బంతిని మర్రిచెట్టు తొర్రలోకి కొట్టింది. "అంతా చప్పట్లు కొట్టండి." అన్నది ఆవు. ఈ సారి పెద్ద బంతిని కోతి చేతికి ఇచ్చింది. "ఇప్పుడు నీ సమర్ధతను నిరూపించుకోవాలి‌. ఈ పెద్ద బంతిని ఆ మర్రిచెట్టు తొర్రలోకి పడేస్తే నువ్వు అడవికి రాజువే." అంది ఆవు. కోతి మరింత ఉత్సాహంతో రెట్టించిన వేగంతో బంతిని మర్రిచెట్టు తొర్రలోకి విసిరింది. మర్రిచెట్టు తొర్రకంటే ఆ బంతి పరిమాణం పెద్దది కాబట్టి ఆ బంతి చెట్టుకు తగిలి తిరిగి వెనక్కి వచ్చి కోతి ముక్కుకు తగిలింది. ముక్కు పగిలింది. అడవి జంతువులన్నీ పగలబడి నవ్వాయి. కోతి సిగ్గుతో తల దించుకుంది.

         అప్పుడు ఆవు ఇలా అంది. "నా ప్రియమైన మిత్రులారా! ఎంత తప్పుకు అంతే మాట అంటే అది అతనికి తగులుతుంది. దొంగతనం చేసిన వారిని దొంగ అన్నా, ఏ పనీ చేయలేని వాణ్ణి సోమరి అన్నా, గర్వంతో ప్రవర్తించే వాడిని పొగరుబోతు అన్నా ఖచ్చితంగా అవతలి వాడికి తగులుతుంది. కానీ ఆ తప్పును మించి పెద్ద అనరాని మాటలు అన్నా, ఏ తప్పు చేయని వారిని అకారణంగా దూషించినా అది మనకే తగులుతుంది. ఈ రెండు బంతుల ద్వారా మీకు ఈ విషయం అర్ధం అయింది అనుకుంటా." అని. సింహం ఆవును అభినందించింది. కోతి పొగరు అణగింది. మళ్ళీ ఏ జీవి జోలికీ పోలేదు.