తిలా పాపం తలా పిడికెడు-ఎం బిందుమాధవి

 "తిలా పాపం తలా పిడికెడు"

శైలజ సిటీల్లోనే పుట్టి పెరిగింది.
పల్లెటూరి వాతావరణం, అక్కడి జీవన విధానం గురించి పెద్దగా తెలియదు.
పెళ్ళైన కొత్తలో భర్తతో కలిసి అతని గ్రామానికి వెళ్ళింది.
శైలజ భర్త చరణ్ తన ఊరు, చిన్ననాటి స్నేహితులు, అక్కడి మర్యాదలు భార్యకి చూపించాలని ఉత్సాహంగా తీసుకెళ్ళాడు.
చరణ్ స్నేహితులు ఇంకా కొంత మంది ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఒకతను అక్కడే గ్రామీణ బ్యాంక్ లో పని చేస్తాడు. ఇంకొక అతను అక్కడికి పక్క ఊళ్ళో స్కూల్ టీచర్ గా
పని చేస్తాడు. ఒకరిద్దరు 'టెంత్' క్లాస్ తో చదువు ఆపేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.
చరణ్ నేరుగా తన చిన్ననాటి స్నేహితుని ఇంటికే వెళ్ళాడు.
చరణ్ భార్యతో సహా వచ్చాడని తెలిసి అందరూ చూడటానికి వచ్చారు.
ఇంటికొచ్చిన అతిధులకి, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి, ఆ పై తాగటానికి మంచినీళ్ళిచ్చాడు చరణ్ స్నేహితుడు.
చాలా దూరం ప్రయాణం చేసినందువలన... కార్ లోనే వచ్చినా....చరణ్ శైలజలు అలిసిపోయారు. కొబ్బరి చెట్ల నీడన కుర్చీల్లో కూర్చున్న వీళ్ళకి ఆ పల్లెటూరి వాతావరణం, ఆహ్లాదంగా ఉన్నది. ఓ గ్లాసెడు నీళ్ళు తాగేటప్పటికి ప్రాణం కుదుట పడి, ప్రయాణ బడలిక తగ్గినట్లనిపించింది.
ఇంతలో సాయంత్రం పంపులొచ్చే వేళ అయింది. అక్కడి ఆడవాళ్ళు బిందెలతో నీళ్ళు మోసుకొచ్చి ఇంట్లో పెట్టటం చూసింది, శైలజ.
అవి వానాకాలం రోజులు. కొత్త నీరు వచ్చే సమయం. కాలవల్లో, చెరువుల్లో కొత్త నీరు వస్తూ ఉంటుంది. అందువల్ల నీటి రంగు కొంత మారి బురద నీటి లాగా కనిపిస్తుంది. ఆ విషయం కార్లో వస్తూ శైలజ గమనించింది.
అక్కడ నీళ్ళు గ్రామ పంచాయితీ వారు ఫిల్టర్ చేసి, ఊరంతటికీ ఒక క్రమ పద్ధతిలో ఉదయం - సాయంత్రం సరఫరా చేస్తారని మాటల మధ్యలో విన్నది.
సిటీలో నవీన వాటర్ ఫిల్టర్స్ చూసిన శైలజ, 'ఇక్కడ తాగే నీళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తారని' అడిగింది. 'మంచి నీళ్ళ కాలవ నించి పైపులు వేసి నీరు డబుల్ ఫిల్టర్ చేసి ఒక ట్యాంక్ లోకి మళ్ళించి, అక్కడి నించి ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి పంప్ చేసి, అక్కడి నించి ఇళ్ళకి డైరెక్ట్ గా సరఫరా చేస్తారని' చెప్పారు.
"ఆ మాత్రానికే నీళ్ళు తాగేటంత శుభ్రమౌతాయా"అని శైలజ అమాయకంగా అడిగింది. "అదొక్కటే కాదు మేము నీటి బిందెలో పటిక వేస్తాము"అని చెప్పింది ఆ ఇల్లాలు.
"నీళ్ళు ఫిల్టర్ చెయ్యటం ఇంత సులువా" అని ఆశ్చర్య పోయింది. "ఈ పద్ధతిలో చుక్క నీరు కూడా వృధాగా పోదు కదా! అదే మేము అక్కడ సిటీలో"కెంట్ " అని, "ion exchange" అని, "ఎక్వా గార్డ్" అని అనేక రకాల ఎక్విప్ మెంట్ లు పెట్టి, ఒక లీటర్ నీరు ఫిల్టర్ అవాలంటే మూడు లీటర్ల నీరు వృధా అయ్యే పద్ధతిలో ఫిల్టర్ చేసుకుంటాము".
నీటి వృధా గురించి శైలజ అడిగితే, అలా కాక నీరు ఫిల్టర్ చేసే విధానమేదీ ఇంకా కనుక్కోలేదు అని ఆ సంస్థల సేల్స్ ఉద్యోగి చెప్పాడు.
ఫిల్టర్ కాగా మిగిలిన నీరంతా డ్రైనీజీ తూములోకి పోవటం చూస్తుంటే ప్రాణం ఉసూరుమంటుంది.
అలా వృధా అయ్యే నీరు వేరే ఒక పెద్ద పాత్రలోకి గానీ, ఒక చిన్న ట్యాంక్ లాంటి దానిలోకి గానీ పట్టుకుని ఇంటి అవసరాలకి వాడుకునే విధానం అన్ని ఇళ్ళల్లోను (ఇప్పటి ఫ్లాట్ కల్చర్ లో) కుదరదు కనుక ఆ నీరు అలా తూముల్లో పోతుండటం చూసి శైలజ ఎప్పుడు బాధ పడుతూ ఉంటుంది.
కానీ సిటీలో అందరి ఇళ్ళల్లోనూ ఇలాంటి విధానమే పాటిస్తూ ఉండటం వల్ల, ఎంత నీరు వృధా అవుతున్నదో మన అంచనాకి అందదు.
అదే మాట భర్త తో అంటే, నీ ఒక్క దానికేనా ఈ బాధ, అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది, నువ్వొక్కదానివి సమాజాన్ని మార్చేయగలవా అంటూ తేలిగ్గా కొట్టి పడేశాడు. అలాగని ఫిల్టర్ చెయ్యని నీళ్ళు తాగితే వచ్చే రోగాల గురించి టీవీల్లో రకరకాలుగా చూపిస్తున్నారు కదా అని కూడా ముక్తాయిస్తాడు.
ఇది ఇలా ఉంటే, శైలజ వస్తూ దారిలో పంట చేల మధ్యలో చిన్న - పెద్ద నీళ్ళ మడుగులు, వాటిలో మందులు చల్లుతున్న మనుషులని చూసింది. అది ఏమిటి అని అడిగింది.
అవి చేపలు - రొయ్యల చెరువులని, వ్యవసాయానికి మంచి ప్రత్యామ్నాయమని, మంచి లాభసాటి ఆదాయ మార్గమని ఆ ఊరి వారు చెప్పారు. అలా చేపల చెరువులుగా ఉన్న పొలాలు, తరువాతి సంవత్సరాల్లో మళ్ళీ మామూలు పంటలు వెయ్యచ్చా అని అడిగింది. ఆ ఊరి వారిలో కాస్త సామాజిక స్పృహ కలిగిన ఒక యువకుడు, శైలజ కి సమాధానం చెబుతూ - అలా కుదరదండీ, ఒక సారి చేపలు-రొయ్యల కోసం పొలాన్ని తవ్వితే అవి ఎప్పటికీ వ్యవసాయానికి ఉపయోగపడవండీ అంటూ, అంతే కాదండీ ఈ చెరువుల వల్ల పర్యావరణం కలుషితమవటంతో పాటు, భూగర్భ జలాలు కూడా పాడైపోతాయండి అని చెప్పాడు.
ఇదంతా విని శైలజ- "బస్తీల్లో పారిశ్రామిక వేత్తలు కలుషిత వ్యర్ధాలు చుట్టు పక్కల చెరువుల్లోకి నీటి కుంటల్లో కి వదులుతూ అక్కడి జల వనరులని ఒక పక్క సర్వ నాశనం చేస్తుంటే, ఇక్కడ పల్లెటూళ్ళో చేపలు - రొయ్యల చెరువుల పేరు చెప్పి ఉన్న వ్యవసాయ భూములని, పర్యావరణాన్ని, భూగర్భ జలవనరులని శాశ్వతంగా మరో పక్క పాడు చేస్తున్నారన్నమాట" అనుకున్నది.
ఇదే ఆలోచిస్తూ పడుకున్న శైలజకి కలత నిద్రలో "వర్షాలు పడక జలవనరులు అడుగంటి పోతున్నాయని జన విఙ్ఞాన వేదికల వాళ్ళు ఘోషిస్తున్నట్టు, ఓ పక్క పరిశ్రమల కాలుష్యం, మరో పక్క వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా అధిక సంపాదన కోసం భూమిని, భూజలాలని నాశనం చేస్తూ ప్రజలు అనుసరిస్తున్న చేపల పరిశ్రమ - అన్ని సమస్యలు కలగా పులగంగా ఒకదాని మీద ఒకటి overlap అవుతూ కనిపించింది.
ఆ తరువాత ప్రకృతిమాత ఏడుస్తూ ఈ విలయం గురించి జనాలని హెచ్చరిస్తున్నట్లు, పట్టించుకోని జనం మీద కోపంతో భూకంపం రూపంలో విరుచుకు పడుతున్నట్లు అనిపించి ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది.
సరిగ్గా శైలజకి మెలకువ వచ్చేటప్పటికి "అంట్లు సరిగా వదలటం లేదు, గిన్నెలకి పట్టించిన సబీనా ఎక్కడిదక్కడె ఉన్నది, పంప్ తిప్పి, నీటి ధారలో సరిగ్గా కడుగు" అని పక్కింటి రజని పనిమనిషి మీద గట్టిగా అరవటం వినిపించింది.
హతవిధీ ఈ జనం మారరు, వీళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది? వీళ్ళింతే "తిలా పాపం గలా పిడికెడు" గా ప్రాణాధారమైన జలవనరులని ఎవరి వంతు వాళ్ళు నాశనం చేస్తున్నారు కదా అని నిట్టూర్చింది.