పరసతుల గోష్ఠి నుండిన: ఎం బిందుమాధవి

 "పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్,
గరిత సుశీలయు యైనను
ఒరు సంగతినున్న నింద పాలగు; సుమతీ! "
మహా భారతంలోభీష్మ పితామహునెరుగనివారుండరు.
తన తండ్రికిచ్చిన మాట కోసం వివాహం చేసుకోకుండా ఆడవారి సాంగత్యం లేకుండా, అత్యంత క్రమశిక్షణ తో జీవితం గడిపిన గొప్ప వ్యక్తి భీష్ముడు. ఒకవేళఇంత గొప్ప వ్యక్తీ.. వేళ కాని వేళ పరాయి ఆడవారితోమాట్లాడుతూ కనిపిస్తే..లోకులుతప్పు పట్టే అవకాశం లేకపోలేదు.
అలాగే గొప్ప శీలము కల ఆడది అని పదిమందికి తెలిసినా ....పరాయి మగవారితో ఉన్నప్పుడు వారిని లోకం నిందించకుండా ఉంటుందా అని సుమతీ శతక కారుడు ఈ పద్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు.
మన గురించి మనమేమి అనుకుంటున్నాము అనేదానికంటే... పది మందికి మన గురించి ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నామనేది ముఖ్యం అని ఈ కధ ద్వారా తెలుసుకుందామా!
********
ప్రభాత్, శ్రీరాం చిన్ననాటి స్నేహితులు.
కాలంలో విడిపోయి మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో తలవని తలంపుగా కలిశారు.
చిన్ననాటి స్నేహితులేమో! చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇరువురూ ఒకరి ఎడ్రెస్ లుమరొకరు తెలుసుకుని ఒకరింటికి ఒకరు వచ్చిపోతూ ఉండటంలో భార్యలు, పిల్లలూ కూడా బాగా చేరువయ్యారు.
శ్రీరాం ఇంజనీరింగ్ చదివి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు.
ప్రభాత్ ఓ ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రభాత్ కి , శ్రీరాం కి కూడా ఇద్దరు పిల్లలు.
కాలం ఎప్పుడూ ఒక రకంగా సాగదు కదా!
ప్రభాత్ కి వెన్నుపూసలో ఏదో సమస్య వచ్చి అది ఆపరేషన్ దాకా వెళ్ళింది. అదేమంత సీరియస్ కాదు. కానీ ప్రభాత్ హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు శ్రీరాం దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నాడు.
ప్రభాత్ భార్య నీలిమ శ్రీరాం తో 'అన్నయ్యగారు అన్నీ మీరే అయి, పనులన్నీ నెత్తినేసుకుని ఆపరేషన్ దిగ్విజయంగా చేయించారు. చాలా థాంక్స్ అండీ' అన్నది.
'మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏమిటమ్మా. అది నా బాధ్యత ' అని ప్రభాత్ ని ఇంటి దగ్గర దింపి తన ఇంటికొచ్చాడు, శ్రీరాం. సాయంత్రం నీలిమ హడావుడిగా ఫోన్ చేసి,
'అన్నయ్యా ఆయన ఏమిటో ఆయాస పడుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నారు. ఏమయిందో తెలియదు. నాకు కంగారుగా ఉన్నది, ఒక్కసారి రాగలరా? ' అని ఏడుస్తూ ఫోన్ చేసింది.
శ్రీరాం వెళ్ళేసరికే ప్రభాత్ కన్ను మూశాడు.
ఆ పదమూడు రోజులు దగ్గరుండి అన్ని విషయాలు చూసిన శ్రీరాం భార్య విజయతో 'చిన్ననాటి స్నేహితుడు చాలా రోజుల తర్వాత కలిశాడు అన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వాడి దారిన వాడు పోయాడు. పాపం ఆ అమ్మాయి ఇంకా చిన్నది. పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తుందో. అయిన వారు ఈ నాలుగు రోజులు ఉన్నారు. ఇక రేపటి నించీ అన్నీ తనే ఒంటరిగా చూసుకోవాలి.' అని దిగులు వ్యక్త పరిచాడు.
విజయ 'అవునండీ అన్నీ బావున్నప్పుడు రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. కాలం ఎదురు తిరిగినప్పుడు, ప్రతి చిన్న విషయం భూతద్దంలో లాగా పెద్దగా కనపడి భయపెడుతుంది. పాపం నీలిమ ఇప్పటివరకు ఉద్యోగం కూడా చెయ్యలేదు. ఇప్పుడు అన్నయ్యగారు చేసిన కంపెనీ వాళ్ళు తనకి ఉద్యోగం ఇస్తారా? ' అని అడిగింది.
శ్రీరాం ఆ రోజు నించీ, సాయంత్రం పూట తన బిజినెస్ పనులు చూసుకుని బయటినించి వస్తూ రోజూ ప్రభాత్ ఇంటికి వెళ్ళి కావలసిన వస్తువులు కొనిపెట్టి, ఇతర అవసరాలు చూసి, పిల్లలతో కాసేపు గడిపి వచ్చేవాడు.
శాపగ్రస్తుల పట్ల లోకం సానుభూతి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా!
క్రమేణా ప్రభాత్ ఇంటి చుట్టుపట్ల ఉన్నవారు శ్రీరాం రాకపోకలని సాధారణంగా తీసుకోలేకపోయారు.
అలాగే శ్రీరాం పరిచయస్తులు, కుటుంబ సభ్యులు కూడా!
అతని కజిన్ పవిత్ర ఓ రోజు అటుగా వెళుతూ శ్రీరాం ఇంటికి వచ్చింది. మాటల్లో 'విజయా మొన్న నేను సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ కి ఏదో పని మీద వెళితే అక్కడ శ్రీరాం అన్నయ్య, అతని ఫ్రెండ్ (మొన్నామధ్య చనిపోయాడే) భార్య నీలిమ కనిపించారు ' అని చెప్పింది.
విజయ 'అవును ప్రభాత్ అన్నయ్య కొడుక్కి స్కూల్ లో స్పోర్ట్స్ డే ఉన్నదిట. ఏదో కొనాలని వెళ్ళాలి అని తను నాతో చెప్పారు. బహుశా దానికే వెళ్ళారేమో ' అని సమాధానం చెప్పి మాట మార్చింది.
తరువాత కొన్నాళ్ళకి విజయ తమ్ముడు సుధాకర్ ....అక్క దగ్గరకి చూసిపోదామని వచ్చాడు. నాలుగు రోజుల క్రితం తన ఫ్రెండ్ ని కలవటానికి వెళితే, అక్కడ బావగారు కలిశారు. నేను కలిశానని బావగారు నీకు చెప్పలేదా అనడిగాడు..
'అయినా అక్కా , నేను చిన్న వాడిని చెబుతున్నాననుకోకు. మనమెంత పవిత్రంగా ఉన్నా లోకం చూస్తూ ఊరుకోదు.
"పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్,
గరిత సుశీలయు యైనను
ఒరు సంగతినున్న నింద పాలగు; సుమతీ! "
అన్నట్లు తాటి చెట్టు కింద పాలు తాగినా ......లోకం కల్లు అనే అంటుంది. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. భీష్ముడైనా, ప్రవరాఖ్యుడైనా లోకానికి వెరవ వలసిందే!
అంతగా ఆవిడకి సహాయం కావలసి వస్తే నిన్నో, పిల్లల్నో వెంట పెట్టుకుని వెళితే అంత అభ్యంతరకరంగా ఉండదు కానీ ఇలా ఒంటరిగా వెళ్ళి చుట్టు పక్కల వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదక్కా' అని ముగించాడు.