చిరు సాయం (చిట్టి కథ) -- కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.

 లంకలో బంధీగా ఉన్న సీతాదేవి కోసం లంకేశ్వరుడు రావణాసురిడి 
మీద వానరరాజు సుగ్రీవుడి పర్యవేక్షనలో సముద్రం దాటే ప్రయత్నంగా ఒడ్డున చెట్టు కింద శ్రీ రాముడు  విశ్రాంతి తీసుకుంటే తలవైపున సోదరుడు లక్షణుడు ,పాదాల
చెంత హనుమ కొలువు తీరి ఉన్నారు.
         దూరంగా సముద్రజలాల వద్ద వానరసేన ఒక్కొక్క పెద్ద రాయిని
చేతులతో ఎత్తి సుగ్రీవుడి వద్దకు తీసుకు రాగా ' జై శ్రీరామ్ 'అని సుద్ధతో
రాయగా వాటిని సముద్ర జలాల్లో పడవేస్తున్నారు.బండలన్నీ కట్టెల మాదిరి సాగర జలాలమీద తేలుతున్నాయి. కొన్ని వానరాలు అవి చెదిరి
పోకుండా వంతెన మాదిరి తీర్చి ద్దిద్దుతున్నారు.
      ఇదంతా చెట్టు మీదున్న చిట్టి ఉడుత చూసి తను కూడా చేతనైన
సహాయం చెయ్యాలను కుంది. చెట్టు దిగి మెల్లగా సముద్ర జలాల
దగ్గరికెళ్లి నీటిలో మునిగి ఆ తడి శరీరంతో పొడి ఇసుకలో పొర్లి రాళ్ల 
మీద కెళ్లి శరీరం మీదున్న ఇసుకను దులపడం చేస్తోంది. బాట మీద
నడిచేటపుడు శ్రీ రాముడి పాదాలకు బాధ కలగకుండా ఇసుకను వెద
జల్లుతోంది.
        ఉడుత చేస్టలను తదేకంగా గమనిస్తున్న లక్ష్మణుడు ఆ దృశ్యాన్ని
అన్నకు చూపించాడు. శ్రీ రాముడు చిట్టిఉడుత సాయానికి సంతోషించి
దగ్గరకెళ్లి తన చేతిలోకి తీసుకుని మూడు వేళ్లతో దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు. రాముడి మూడు వేళ్ల గుర్తులు దాని వీపు
మీద ముద్ర పడి పోయాయి.నీ సహాయానికి ఆనందంగా ఉంది. నీ
పేరు చిరకాలం నిలిచి ఉంటుందని ఆశీర్వదించాడు. 
              *                          *                           *