రంగన్నతెలివి…డి.కె.చదువులబాబు


 ఒక గ్రామంలో రంగన్న అనేవాడు ఉండేవాడు. వాడికి రేచీకటి. రాత్రి వేళ మసక వెలుతుర్లో కళ్ళు కనిపించవు. ఆవిషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడేవాడు. పొద్దుగ్రుంకితే ఇల్లు దాటేవాడు కాదు.

ఒక రోజు రంగన్న పొరుగూరిలోని తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.

కొంతదూరం వెళ్ళాక అలసటగా అనిపించింది. ఒక చెట్టు నీడన కూర్చున్పాడు. వెంటతెచ్చుకున్న రొట్టె తిన్నాడు.చల్లగాలికి హాయిగా అనిపించింది. కండువా పరుచుకుని అదమరచి నిద్రపోయాడు.నిద్రలేచేవేళకు సాయంత్రం అయింది.వెళ్ళవలసిన ఊరు చాలా దూరముంది.ఎంత వేగంగా నడిచినా చీకటి పడుతుంది.చీకటిపడితే తనకు కళ్ళు కనిపించవు.ఆలోచిస్తూ చాలా వేగంగా నడవసాగాడు.ఊరు దగ్గరగా చేరుకునే సరికి చీకటి పడింది. ఓఅరగంట నడిస్తే ఊరు చేరుకుంటాడు. కానీ రేచీకటితో కళ్ళు కనిపించక ఊరిలోకి ఎలావెళ్ళాలా? అని ఆలోచించాడు.

అతనికి దగ్గరగా ఓగేదె ఊరివైపు వెళ్తూ కనిపించింది.దాని తోక పట్టుకున్నాడు. గేదెతో పాటు నడుస్తూ ఊళ్ళోకి చేరుకున్నాడు. మనుష్యుల అలకిడి, మాటలు వినిపించాయి. ఇంతలో ఓమనిషి "ఎవరయ్యా!నువ్వు? నా గేదె తోక పట్టుకున్నావు."అని అడిగాడు. "నాది సోమాపురం. మాతాతగారింటికి వచ్ఛాను. మాతాతగారి గేదెలా ఉంటే తోలుకుని వస్తున్నా!"అని చెప్పి తోక వదిలేశాడు. ఆమనిషి గేదెతో వెళ్ళిపోయాడు. అంతలో దగ్గరగా కిర్రుచెప్పుల శబ్ధం వినపడింది. ఆశబ్ధం వస్తున్న వైపు తిరిగి "అయ్యా!మాతాతగారు రంగేలిరఘుపతి. ఆయన ఇల్లుచూపిస్తారా!"అని అడిగాడు. "నేనుఅటువైపే వెళ్తున్నా! పదండి" అని ఆ మనిషి ముందుకు నడిచాడు. ఆయన కిర్రుచెప్పుల శబ్ధాన్ని వింటూ ముందుకు నడిచాడు.

"అదిగో ఆ ఇల్లే. వెళ్ళండి." అన్నాడు అతను ఏ ఇల్లో రంగన్నకు కనిపిస్తే కదా!

"మీరు నాకు ఇల్లు చూపించి సాయం చేశారు. ఇంట్లోకి రండి. మీ సహాయాన్ని మంచి మనసును మాతాతగారికి చెప్పాలి"అని ఆమనిషి చెయ్యి పట్టుకున్నాడు రంగన్న. అలా ఆమనిషితో పాటు రంగన్న ఇంటిలోనికి నడిచాడు. అతను రంగేళిరఘుపతిని కలిసి వెళ్ళిపోయాడు.తాతతో కబుర్ల అనంతరం దీపం వెలుగులో భోజనం చేశాడు. రంగన్న భోజనాలయ్యాక తిరిగి కబుర్లు చెప్పుకున్నారు.రంగన్న మంచం చల్లగాలికి ఇంటి వెనుక చెట్ల దగ్గరగా వేశారు. రాత్రివేళ బయటకు వెళ్ళవలసివస్తే సమస్య కదా!అందుకు రంగన్న తనవెంట తెచ్చుకున్న నల్లని తీగను తాను పడుకున్న మంచానికి ఒకకొన కట్టాడు. రెండవ కొనను కొంతదూరంలో ఉన్న చెట్టుకు కట్టాడు.ఆతీగను పట్టుకుని వచ్చి మంచం వద్దకు చేరుకున్పాడు. రాత్రివేళ ఆతీగను పట్టుకుని దానివెంట చెట్లదగ్గరకు వెళ్ళి తిరిగి తీగ సాయంతో మంచం వద్ధకు చేరవచ్చని ఆలోచన.

అందరూ గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు దొంగలు ఇంటి వెనుకలగల పెరటి గోడ దూకారు.ఇంటివైపు రాసాగారు. కొంతదూరం రాగానే రంగన్న కట్టిన తీగ ఆచీకట్లో వాళ్ళ కాళ్ళకి అడ్డుతగిలింది. దొంగలతాకిడికి తీగ కదలికతో మంచం కదిలింది.రంగన్నకు మెలుకువ వచ్చి లేచి కూర్చున్నాడు.

"ఇక్కడ ఏదోతీగ ఉంది" అన్నాడు ఒకదొంగ.


ఆమాట వినగానే దొంగలని గ్రహించి కేకలేశాడు రంగన్న. ఇరుగుపొరుగు, ఇంటిలో వాళ్ళు దీపాలతో పరుగున వచ్చారు.దొంగలను వెంబడించి బంధించారు.

"నిద్రిస్తున్నవాడివి దొంగలు వచ్చినట్లు ఎలా కనుక్కున్నావు?"అని అడిగాడు తాత. జరిగింది చెప్పాడు రంగన్న.

తీగను మంచానికి, చెట్టుకు ఎందుకు కట్టావు?"అని తాత ప్రశ్నించాడు. తన రేచీకటి గురించి చెప్పక తప్పలేదు.

అప్పుడు తాత" జబ్బును దాచేప్రయత్నం మంచిది కాదు. పెద్దలకు ఏ సమస్యయినా చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుంది. రేచీకటి 'ఏ'విటమినులోపం వల్ల వస్తుంది. ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు వంటివి బాగా తినాలి. వైద్యుడిని సంప్రదించాలి"అని చెప్పాడు. రంగన్నను కంటి వైద్యుడి వద్దకు తీసుకెళ్ళాడు తాత.