చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవటం: --ఎం బిందుమాధవి

 “చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవటం”

రంగాచారి గారు చలి జ్వరం తో మూడు రోజుల నించీ మూసిన కన్నెరగకుండా పడుకుని ఉన్నారు.
ఆ ఊరి గుడికి అర్చకుడు ఆయనే, ఊళ్ళో వచ్చే చిన్న చితకా రోగాలకి వైద్యుడూ ఆయనే!
పూర్వం పల్లెటూళ్ళల్లో గుళ్ళో పూజారులే ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు.
ఊరి పెద్ద.......పూర్ణయ్య శాస్త్రి గారి కొడుకు కుటుంబం పట్నం నించి వేసవి సెలవలకి వచ్చారు.
దొడ్లల్లో, తోటల్లో ఆడి ఆడి..... వారి మనవడు పదేళ్ళ వంశీ కి వడ దెబ్బ కొట్టి, నీళ్ళ విరోచనాలు, జ్వరం!
రంగాచారిగారి కోసం కబురెళ్ళింది.
మూడు రోజులనించి జ్వరంతో మంచానికి అతుక్కుని ఉన్నరని భార్య మంగతాయారు జవాబు!
ఇప్పుడు దారేది? ముందు టెంపరేచర్ తగ్గితే ఆనక పట్నం తీసుకెళ్ళచ్చు అని వంశీ తాతగారు, పూర్ణయ్య శాస్త్రి గారి ఆలోచన.
విషయం విన్న రంగాచారి గారు,
'ఊళ్ళో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మనల్నే నమ్ముకుని.......ఈ రోజుల్లో కూడా మన మందు వేసుకుని మనల్ని ఆదరిస్తున్నప్పుడు, ఊరిపెద్ద ఇంట్లో కష్టం వస్తే నేను లేవలేదని చెప్పంపటం మంచిదికాదే తాయారూ' అని
కొడుకు నారాయణని పిల్చి 'అలమారులో తాటాకు బుట్టలో ఉన్న మాత్రలు నాలుగు తీసుకెళ్ళి తేనెలో అరగతీసి రోజుకి మూడు సార్లు నాలిక్కి రాయమను. సగ్గుబియ్యం జావ కాచి 3-4 సార్లు పల్చటి మజ్జిగతో తాగించమను. నీళ్ళతొట్టెలో బొడ్డు మునిగే దాకా కూర్చోపెట్టమను.' అని చెప్పి పూర్ణయ్య శాస్త్రి గారింటికి పంపారు.
సాయంత్రం మళ్ళీ నారాయణని వారింటికి పంపించి ఇప్పుడు పిల్లాడికి ఎలా ఉన్నదో కనుక్కు రమ్మన్నారు.
వాకిట్లో నారాయణని చూడగానే పూర్ణయ్య శాస్త్రి గారి భార్య సీతామాలక్ష్మి గారు 'మీ నాన్నగారి హస్తవాసి మంచిది నాయనా! పిల్లవాడికి జ్వరం కొంచెం తగ్గు ముఖం పట్టింది. రేపటికి లేచి మళ్ళీ ఆడుకుంటాడులే! మీ నాన్నకి చెప్పు ' అని 'మా వాడు వస్తూ పట్నం నించి తెచ్చాడు' అని ఓ అరడజను మామిడి పళ్ళు, రెండు బిస్కట్ ప్యాకెట్లు చేతిలో పెట్టింది.
నారాయణకి 16-17 సం ల వయసు ఉంటుంది.
తండ్రంటే ఊళ్ళో వారికున్న గౌరవం, నమ్మకం కళ్ళారా చూసిన నారాయణ తను కూడా ఎలాగైనా అలా పేరు తెచ్చుకోవాలని మనసులో అనుకున్నాడు.
కానీ, నారాయణ తండ్రి నించి ఆయుర్వేద వైద్యం..... అనుకున్నంతగా వంటపట్టించుకోలేకపోయాడు. తండ్రి చెప్పిన మందులు పొట్లాలు కట్టి ఇవ్వటం, కషాయాలు తయారు చేసేటప్పుడు పక్కన ఉండి సీసాల్లో పొయ్యటం మాత్రం చేస్తూ ఉండేవాడు.
రంగాచారికి పెద్దతనం వచ్చి సాయంత్రాలు గుడికెళ్ళలేక ..... దీపం పెట్టటం, ఎవరైనా గుడికొస్తే స్వామి వారికి హారతిచ్చి- వచ్చిన వారికి స్వామిపాదుకలు తలమీద పెట్టటం, తీర్ధమివ్వటం వంటివి చెయ్యమని, నారాయణని గుడికి పంపేవాడు.
అంతకు మించి అష్టోత్తరం చదవటం కానీ, చిన్న చిన్న పూజలు-అర్చనలు చెయ్యటం కానీ నారాయణకి చేతనయ్యేది కాదు.
రంగాచారి గారి పట్ల ఉన్న గౌరవంతో, వచ్చిన భక్తులు నారాయణ ఇచ్చిన హారతి పళ్ళెంలో ఐదో పదో వేసేవారు.
ఇలా అటు అర్చకత్వం, ఇటు ఆయుర్వేద వైద్యం తండ్రి చాటున ఉండి, ఆయన చెప్పినట్లు చేసేవాడు.
కొన్నాళ్ళకి రంగాచారి గారు కాలం చేశారు.
ఆప్పటికే కొంత నలుగుడు పడి ఉన్నాడు కాబట్టి, నారాయణ క్రమంగా....తండ్రి అంత సమర్ధత లేకపోయినా.... ఊరి వారి చిన్న చిన్న అనారోగ్యాలకి తండ్రి లాగే వైద్యం చేసి పబ్బం గడిపేవాడు.
"అవసరం అన్నీ నేర్పుతుంది" అన్నట్టు పుణ్యాహ వచనం చేయించటం, అష్టోత్తరాలు, సహస్ర నామాలు నేర్చుకుని.... భక్తుల చేత సంకల్పం చెప్పించి రోజువారీ అభిషేకాలు -అర్చనలు చేయించటం నేర్చుకున్నాడు.
చాలా కాలం తర్వాత పూర్ణయ్య శాస్త్రి గారి మనవడు వంశీ అమెరికా నించి వచ్చాడు.
చిన్నప్పటి సంఘటనలు నెమరేసుకుంటూ, 'తాతయ్యా ....రంగాచారి గారు బాగున్నారా? వాళ్ళబ్బాయి నారాయణ ఇప్పుడెక్కడున్నాడు? ' అని అడిగాడు.
'ఏదో "చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నాడు".
'పాపం అర్చకత్వం కానీ, ఆయుర్వేదం కానీ పెద్దగా వంటపట్టలేదు.'
'ఈ ప్రయోజకత్వంతో పట్నాలు వెళ్ళి బతకలేడు కాబట్టి, ఏదో ఇక్కడే నెట్టుకొస్తున్నాడు,' అని ముగించారు.