ప్రయాణం.: వసుధ రాణి

 చిన్నతనంలో అందరు పిల్లల లాగానే నాకు కూడా ఏదైనా ఊరికి వెళ్లటం అంటే మహా సరదాగా ఉండేది.కారణాలు చాలా సింపుల్ ఒకటి మనం కొత్త వింతలు విశేషాలు చూడవచ్చు,నేస్తాలకు చిలవలు పలవలుగా వాటిని చెప్పవచ్చు.రెండవ కారణం వెళ్లిన కొత్త చోట ఎవరైనా దొరికితే మన ఊరి గొప్పలు చెప్పొచ్చు.
పెద్దయ్యే కొద్దీ క్రమంగా ప్రయాణాలు నా ఆలోచనలని, జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేవిగా అయ్యాయి.రైలుతో పాటు వచ్చే చందమామ,వెనక్కి పరుగెత్తే చెట్ల నుంచి కాస్త విడివడి పైరు పచ్చలని,రంగులు మార్చే అనంత ఆకాశాన్ని ,కొండలని,లోయలని,నీటి చెరువులలో గూకే పొద్దులని చూడటం నేర్చుకున్నాను.
క్రమంగా ప్రయాణాల్లో  కాన్వాసు పెరిగి నల్లరేగడి, ఎర్రమట్టి, ఇసుక,రాతి నేలలు,రకరకాల పశు,పక్షి సంపదలు  కంటి ముందు అలా ఆవిష్కృతం అయ్యేవి.
తిరిగిన నగరాల కన్నా నడిచిన అడవి బాటలు మరువలేనివి.అడవిలో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే.అడవి దారుల పట్ల టీనేజ్ లో ఏర్పడిన మోహం అలా పెరిగి పెద్దది అవుతూనే ఉంది.మనుషులంటే ఇష్టం పెరిగిన తరువాత భూమి మీద ప్రేమ పెరిగింది.చిన్న ఊరు దానిని ఆనుకునే ఓ చెరువు, ఆ పక్కగా ఓ కొండ ప్రయాణం ఆపేసి అక్కడే నిలబడి పోయేలా.ఇలాంటి చిన్ని చిన్ని అందమైన పల్లెలు ఎన్నో కదా.
చీకటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా కనపడే దీపాలు ఊరు ఉనికిని,మనిషి ఉనికిని తెలిపే చుక్కానుల్లా ఉంటాయి. తెలియని ఆ ఊరిని, ఆ మనుషులను ఆ దీపాల ఆధారంగా ఊహించుకోవటం గొప్ప అనుభూతి.చిమ్మచీకటిలో మనకి తెలియని చోట ఓ ఊరు కొందరు మనుషులు ఉన్నారన్న భావన కేవలం ఈ భూమి మీదనే సాధ్యం అనుకుంటా.
నది పక్కన ప్రయాణం ఎంత అద్భుతం కదా. నది ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుతో స్నేహం. నదికావల ఇళ్ళు, ఊళ్ళు "ఒక్కసారి వచ్చి పోకూడదా" అనే అమ్మమ్మ గారింటి ఆప్యాయమైన పిలుపుల్లా ఉంటాయి.
హిమాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొండలని చుట్టిన నదులను దాటటానికి వేసిన చిన్ని వంతెనలను,కొండలపై మెట్లు మెట్లుగా పేర్చిన పొలాలను, రోజు వారీ పనులకు ఎక్కడి నుంచి ఎక్కడికో అల్లంత దూరాలను నడిచి,కొండలు ఎక్కిదిగే శ్రమ జీవులను చూడటం ఆశ్చర్యాన్ని , కొండప్రాంతాల వారి శ్రమతో కూడిన జీవితం పట్ల అవగాహనని కలిగించింది.ఆ కొండ మలుపుల ప్రయాణం మర్చిపోలేనిది.
జీవితమనే పెద్ద ప్రయాణంలో ఈ చిన్న చిన్న ప్రయాణాలు మనల్ని దేనికి సంసిద్ధం చేస్తాయో తెలిసిపోయేలాంటి చిన్నపాటి ఎరుక కలిగించిన ప్రయాణాలు కూడా చాలానే ఉన్నాయి.
మనిషి తనలోకి తాను  ప్రయాణించటానికి ముందు ఈ ప్రయాణాలు ఆ మార్గాన్ని సుగమం చేస్తాయనటంలో సందేహం లేదు.
"సో భగవాన్ మేక్ మై ట్రిప్."