సిరిగల వాని కెయ్యెడల చేసిన మేలది నిష్పలం బగున్: --ఎం బిందుమాధవి

 సిరిగల వాని కెయ్యెడల చేసిన మేలది నిష్పలం బగున్ (35)
నెఱి గుఱిగాదు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్
కురిసిన గాక అంబుధుల కుర్వగ నేమి ఫలంబు భాస్కరా!"

ఈ కధ ద్వారా పై పద్యాన్ని మన జీవితాలకి అన్వయించుకుందామా!
********
"పార్ధసార్ధి గారమ్మాయి పెళ్ళి వచ్చే ఆదివారంట. నిన్న వచ్చి కార్డ్ ఇచ్చి వెళ్ళారు" అన్నది వసంత ఆఫీస్ నించి వచ్చిన భర్త జీవన్ తో.
"నిన్న కార్డ్ ఇచ్చారు అని ఇవ్వాళ్ళ చెబుతున్నావు" అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూశాడు. "రాత్రి చిన్నూని ఇవ్వాళ్టి పరీక్ష కోసం చదివిస్తూ మరచిపోయాను. సరిలే ఎప్పుడు చెబితే ఏం కానీ పెళ్ళి ఆదివారం కాబట్టి వెళ్ళి రావచ్చు. పైగా పగలు ముహూర్తం!" అన్నది.
పార్ధసారధి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం లో ఉన్నారు. జీవన్ కొన్నది ఆయన కట్టిన ఫ్లాటే.
అసలే బిల్డర్. కాస్త అతనితో టచ్ లో ఉంటే, రేపు ఫ్లాట్ కి సంబంధించి రిపేర్ల లాంటి ఏ అవసరం వచ్చినా అతని సహాయం తీసుకోవచ్చు అని ఖరీదైన బహుమతి తీసుకుని, "గిఫ్ట్ బై" అని దాని మీద పేరు బాగా కనిపించేలా పెద్ద అక్షరాలతో వ్రాసి తీసుకుని పెళ్ళికి వెళ్ళారు.
పెళ్ళికొచ్చిన ఆహూతులు వందల్లో ఉన్నారు. ఒకరికి ఒకరు తెలియని జనాలే ఎక్కువ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎటూ వారి కుటుంబ సభ్యులే! పెళ్ళి జరుగుతున్నంత సేపు, జీవన్ వసంత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కింద కూర్చుని, సుముహూర్తం అవగానే స్టేజి మీదకెళ్ళి అక్షింతలు వేసి, తెచ్చిన బహుమతి పెళ్ళి కూతురు చేతిలో పెట్టారు.
బహుమతి ఇచ్చి, కన్యాదాతగా ఇంకా పీటల మీదే ఉన్న పార్ధసారధి గారికి నమస్కరించి ఆయన కళ్ళల్లో పడ్డారు.
"హమ్మయ్యా మనం ఇచ్చిన బహుమతి ఆయన చూసుకున్నారులే" అన్నాడు జీవన్. ఏడో క్లాస్ చదువుతున్న చిన్నూ "పెళ్ళి బాగా గ్రాండ్ గా చేస్తున్నారు..బాగా ఉన్నవాళ్ళల్లే ఉన్నారు కదమ్మా! నిజంగా అంత డబ్బు పోసి కొని మనమిచ్చే బహుమతి వారికి ఉపయోగ పడుతుందంటావా" అన్నాడు.
"ఉపయోగించుకుంటారో లేదో మనకనవసరం. ఇవ్వటం వరకే మన పని. మనమిచ్చినట్లు తెలిసేలాగా పేరు కూడా బాగా కనిపించేట్లు వ్రాశాం. నిజంగా ఇవ్వలేదనుకో..మనని ఆయన చూశారు కదా..తరువాత ఏమిచ్చామో అని ఆరాగా వెతికి, మన పేరుతో కనిపించలేదనుకో..వీళ్ళొఠ్ఠి పీనాసులు, భోజనం దండగ అనుకోవచ్చు" అన్నది వసంత.
ఇలా మాట్లాడుకుంటూ భోజనశాలలోకి వెళ్ళారు. 'బుఫే' భోజనాల్లో ప్లేట్ తీసుకుని 'క్యూ' లో నిలబడ్డారు. వీరికి ముందు ఆరుగురు ఉన్నారు. అందులో ఒక పెద్ద వయసు ఆయన బరువుగ ఉన్న ప్లేట్ ఎక్కువ సేపు మొయ్యలేక, వడ్డించుకునే లోగా చెయ్యి వణికి పప్పు ఉన్న పాత్రని టేబుల్ మీద నించి కింద పడేశాడు. మొత్తం నేలపాలయిందని క్యాటరింగ్ మేనేజర్ కంగారుగా వచ్చి...తప్పు అతిధి చేస్తే, తన సిబ్బంది మీద కేకలేసి అదంతా శుభ్రం చేయించి వెళ్ళాడు.
ఫ్రైడ్ రైస్ కావలసినంత మాత్రమే ప్లేట్ లో వడ్డించుకుని, కొంచెం కూర, సాంబార్ వేసుకుని పక్కకి వచ్చి కుర్చీలో కూర్చున్న చిన్నూని "ఏరా అంతే చాలా? మిరపకాయ బజ్జి వేసుకోలేదేం" అనడిగింది వసంత.
కింద పడిపోకుండా ప్లేట్ ని ఒళ్ళో పెట్టుకుని, తింటూ "పోయిన వారం మా స్కూల్ కి ఒక స్వచ్ఛంద సంస్థ వారు వచ్చారని చెప్పాను కదమ్మా! వారు ఇలా మన దగ్గర పెళ్ళిళ్ళల్లో జరిగే వృధా ఖర్చుల గురించి, ధన నష్టాన్ని గురించి..ముఖ్యంగా ఆహారం నేలపాలు చెయ్యటం గురించి చెప్పి..తిండి దొరకక ఎంతో మంది పస్తులుంటున్నారు. ఆహారం కొనుక్కోవటానికి డబ్బు లేక రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఎంతమందో! మీరు భావి పౌరులు! వృధా..అది ఎలాంటిదైనా...అరికట్టటం ఇప్పటి నించే నేర్చుకోకపోతే కొన్నాళ్ళకి సహజ వనరులు అంతరించిపోతాయి. ముఖ్యంగా నీరు, కూరగాయలు, ఆహార ధాన్యాలు!" అని చెప్పారు.
"నేను స్కూల్ కి వెళుతూ..చెత్త కుండీల పక్కన పడేసిన విస్తళ్ళల్లో, ప్యాకెట్స్ లో మిగిలిన ఆహారంకోసం కుక్కలతో పోటీ పడే పిల్లలని ఎన్నో సార్లు చూశాను."
"ఇప్పుడు చూశాం కదా..కొందరు తిన గలిగిన దాని కంటే ఎక్కువ వడ్డించుకుని, ప్లేట్స్ లో వదిలేసి చెత్తలో పడేస్తున్నారు. ఇందాక ఆయన ఏకంగా పప్పు అంతా కింద పడేశాడు. పాపం పెద్దాయన అలా బరువుగా ఉన్న ప్లేట్ మోస్తూ భోజనం ఎలా చెయ్యగలరు? అసలు ఇంత మందిని పిలవటం ఎందుకు? అంతంత భోజనాన్ని వృధా చెయ్యటం ఎందుకు? ముఖ్యమైన వారిని తక్కువ మందిని పిలిచి వారికి కూర్చుని భోజనం చేసే ఏర్పాటు చేస్తే సుఖంగా, వారికి ఎంత కావాలో అంతే వడ్డించుకుని తింటారు కదా! మా తెలుగు టీచర్ భాస్కర శతకంలో ఈ పద్యం మొన్న మాకు నేర్పించారు.
"సిరిగల వాని కెయ్యెడల చేసిన మేలది నిష్పలం బగున్
నెఱి గుఱిగాదు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్"
...................
అని ఈ పెళ్ళి చేసిన అంకుల్, డబ్బు ఇలాంటి భోజనాలకోసం వృధా చెయ్యకుండా ఏ "అక్షయ పాత్ర ఫౌండేషన్" కో, ఏ "రామకృష్ణ మఠం" కో ఇచ్చి ఉంటే బాగా ఉపయోగ పడేది.
మనం కూడా ఆ గిఫ్ట్ కొనటానికి వాడిన డబ్బు ఒక పేద విద్యార్ధి స్కూల్ ఫీజ్ కట్టటానికి ఉపయోగించి ఉంటే బాగుండేది" అన్నాడు.
ఆరిందాలాగా మాట్లాడుతున్న కొడుకుని ..పోయిన పుట్టిన రోజుకి ఐదు వేల రూపాయల బూట్స్ కొనలేదని పేచీ పెట్టిన చిన్నూయేనా వీడు అని విస్మయంగా చూస్తూ ఉండిపోయింది వసంత.