ప్రతి మనిషిలోనూ ఒక గొప్ప తనం దాగి ఉంటుంది. దానిని బయటకు తీసి తన ప్రతిభను వెలుగులోకి తెచ్చినప్పుడే అతడు విజేతగా నిలుస్తారు. అందుకు కావలసింది ఆత్మవిశ్వాసం ఒక్కటే సరైన మార్గం.
ప్రతి మనిషికీ తమపై తమకు నమ్మకం ఉండటం చాలా అవసరం. దీనినే ఆత్మ విశ్వాసం అని అంటారు. దీనికి ఆంగ్లంలో Self Confidence అని అర్థం. "నేను చేయగలను" అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చెయ్యగలరు. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపొతే ఏ రంగంలోనైనా సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. అనుకున్న పనిని అనుకున్నట్టు సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది.
ఎంత బాగా ఆత్మవిశ్వాసం ఉంటే అంత బాగా మనం జీవితంలో పైకి రావచ్చు.ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనే మన మాటల్లో ధ్వనిస్తుంది. దీనివల్ల మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అవతలి వారికి తెలుస్తుంది. ఏ విధమైన తప్పుడు ఆలోచనలకి మన మనసులో చోటు ఉండకూడదు. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది.
ఒక మంచి సంకల్పంతో ఎందరో మంది మహానుభావులు చరిత్ర పుటల్లోకి ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే.
మన ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి
• చూడగానే ఆకట్టుసునే విధంగా మన వస్త్రధారణ ఉండాలి.
• కాస్త తొందరగా నడవాలి.
• ఇతరులను గౌరవించాలి.
• మంచి ఉపన్యాసాలు వినాలి.
• ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు వారికి కొన్ని మంచి మాటలు చెప్పాలి.
• ఎప్పుడూ ముందు వరసలోనే కూర్చోవాలి.
• వేదికపై ఎక్కి మాట్లాడగలగాలి.
• మన పని మీదే ఎక్కువ సమయం కేటాయించాలి.
నేటి కాలంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లను వివిధ సంస్థల వారు నెలకొల్పి ఎన్నో సూచనలు ఇచ్చినప్పటికీ ఒక మనిషి లో దాగున్న తన సొంత ఆత్మవిశ్వాసం వెలుగులోకి రాకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ప్రతిఫలం ఉండదు. ఒక వ్యక్తి తనంతట తానుగా తనలో దాగివున్న శక్తిసామర్థ్యాలను బయట పెట్టినప్పుడే తన ప్రతిభ వెలుగులోకి వస్తుంది అని మరోసారి గుర్తు చేసుకుంటూ...
మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన తోటి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసం నింపగలదు. మనవాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనడమే మనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక. విజయం సాధించిన వారికి, సాధించని వారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని మనమంతా తెలుసుకోవాలి.
ఆత్మ విశ్వాసమే నీ బలం: -చిటికెన కిరణ్ కుమార్ Cell..9490841284,