ధనాపేక్ష (పిల్లల కథ) - దార్ల బుజ్జిబాబు

ఒక ఊరిలో  ఇద్దరు మిత్రులు వుండేవారు. వారు కలిసిమెలిసి వుండేవారు. వారికి ధనాపేక్ష ఎక్కువ.  బాగా డబ్బు సంపాదించి ధనవంతులుగా మారాలని, మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని  వారి వాంఛ.  ఒకరోజు  ఆ పరిసర ప్రాంతాల్లో ఆశ్రమం నిర్మించుకుని వుండే  ఓ సాధువు వచ్చాడు. గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు.  అన్ని అనర్ధాలకు కారణం ధనాపేక్ష.  ధనవంతుడు భూలోకంలోనూ, స్వర్గ లోకంలోనూ సుఖంగా వుండలేడు. ఆకలికి హద్దు ఉంటుంది కానీ ధన సంపాదనకు హద్దు ఉండదు. ఇంకా ఇంకా సంపాదించాలనే తపన ఉంటుంది. డబ్బుకు బానిసను చేస్తుంది. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రెండు చేతులతో ఆర్జిస్తూనే ఉంటాడు. ఈ మైకంలో ప్రాణ మిత్రులను చంపటానికి కూడా వెనుదీయడు. కాబట్టి విజ్ఞుడనేవాడు సంపాదనను ఇష్టపడడు.  ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాడు. అజ్ఞాని మాత్రమే ధనాపేక్ష కలిగి ఉంటాడు. అజ్ఞానం వీడి జ్ఞానంలోకి  రావాలనుకుంటే ధనాపేక్ష   వదిలేయాలి. జ్ఞానవంతుడు మాత్రమే కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. ధనవంతుడు పొందలేడు" అన్నాడు.
        సాధువు మాటలు వారికి రుచించలేదు. "సన్యాసికేమి తెలుసు సంపద విలువ? సంపాదించడం చేతగాని వాడే ఇలాంటి నీతులు చెబుతుంటారు. ధనవంతుడికి ఉన్న విలువ సమాజంలో మరెవరికి ఉండదు. డబ్బును చూసే విలువ ఇస్తారు. ధనం లేకపోతే అయినోళ్లు కూడా  దూరం అవుతారు" అనుకుని ధన సంపాదన వైపే  మొగ్గు చూపారు.  సంపాదన కోసం  వేరే ప్రాంతం వెళ్లారు.  బాగా సంపాదించి తిరిగి వస్తున్నారు.  మార్గ మధ్యలో వారికి రెండు వజ్రాలు తళ తళ మెరుస్తూ కనిపించాయి. వాటిని చెరొకటి తీసుకుని ప్రయాణం సాగించారు. కొంత దూరం వెళ్లాక ఇద్దరిలోను   రెండు వజ్రాలను  ఒక్కడే కాజేయాలనే దుర్భుద్ధి పుట్టింది. ఒకడికి తెలియకుండా మరొకడిని చంపాలని   పధకం వేసుకున్నారు.  ఒకరికి తెలియకుండా ఒకరు  ఓరకంట కనిపెడుతూ నిద్ర నటిస్తున్నారు.  అర్ధరాత్రి  సమయంలో ఒకరినొకరు చంపుకోవడానికి కత్తులు దూసుకున్నారు. ఎవరు చనిపోలేదుగాని ఇద్దరికి గాయాలయ్యాయి. చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. చలనం కోల్పోయారు.   తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. 
       కొన్నాళ్లకు ఆరోగ్య వంతులై  తెలివిలోకి వచ్చారు.  సాధువు ఆశ్రమంలో వున్నారు.  ఒకరినొకరు చూసుకున్నారు. వజ్రాలు నీదగ్గర ఉన్నాయంటే, నీ దగ్గర ఉన్నాయంటు మళ్ళీ కొట్టుకోసాగారు.  అప్పుడు సాధువు వారి దగ్గరకు వచ్చాడు.  "మీ దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి" అంటూ వారిలో  ఒకడికి ఇచ్చాడు. వాటి కోసం  మళ్ళి తన్నుకోసాగారు. "నాయన లారా! అవి నిజమైన  వజ్రాలు కావు. నకిలివి. మీరొస్తున్న మార్గంలో నేనే వీటిని పడేశాను. ఆ తరువాత మిమ్ములను కాపాడి ఆశ్రమానికి చేర్చి చికిత్స చేయించింది నేనే. ధనాపేక్ష ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో?  ప్రాణ మిత్రులను కూడా చంపిస్తుందో?   తెలియజేయడం కోసమే నేను ఈ వజ్రాల పరీక్ష పెట్టాను" అన్నాడు.  ఆ తరువాత వారికి జ్ఞానబోధ చేసాడు. వారు మారారు. ధనాపేక్షను వీడారు. సాధువుకు  శిష్యులుగా చేరారు. పుస్తకాలు చదువుతూ ఎంతో విలువైన జ్ఞానం సంపాయించారు.  జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించారు.  గొప్ప సమాజ సేవకులుగా, సంస్కర్తలుగా పేరు పొందారు.