పాలు ౼ నూనె (పిల్లల కథ): ౼ దార్ల బుజ్జిబాబు

పూర్వం ఇజ్రాయేలు దేశాన్ని సాల్మన్  అనే రాజు పాలించేవాడు. అతడు చాలా జ్ఞానవంతుడు అని ప్రసిద్ధి.  ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడని అంటారు.  అతడి తేలివితేటలు ఆ నోట ఈ నోట కథలుగా చెప్పుకునేవారు. ఈ సంగతి షేబా దేశపు రాణికి తెలిసింది. అతడిని పరీక్షించ దలచింది.  వెంటనే తన పరివారంతో ఇజ్రాయేలు దేశానికి బయలు దేరింది.  రాజుని కలిసింది. 
   "అయ్యా! తమరి తెలివితేటలు గురించి విని వచ్చాను. తమరిని కళ్లారా చూసాను. నా జన్య ధన్యం అయింది. కొంతకాలం మీ వద్ద వుండి మీ పరిపాలనను చూచి మీ  నుండి పాలనా విధానం  నేర్చుకుంటాను. ఉడుతా భక్తిగా కొన్ని కానుకలు తెచ్చాను" అని తాను తీసుకువచ్చిన బంగారం, వెండి  ఇచ్చింది షేబారాణి. 
    వాటిని శ్వీకరించి "అలాగే" అన్నాడు సాల్మన్ రాజు. ఇక వచ్చిన పనిని ప్రారంభించింది.   అందుకు ఓ పరీక్ష పెట్టింది. ఓ రోజు సభా సమయంలో రాజుతో ఇలా అంది. "మహారాజా! ఏదైనా ఒక కాయను  తీసుకు వచ్చి దాని నుండి పాలు, నూనె తీయగలరా?" అని అడిగింది.
      రాజు కొంత సేపు ఆలోచించి అలాగే అని ఒక కొబ్బరికాయను తెప్పించాడు. దాన్ని రెండు చిప్పలుగా చేసాడు. ఓ చిప్పలోని కొబ్బరిని బయటకు తీసాడు.  దాన్ని మెత్తగా రుబ్బించాడు.  వడకట్టాడు.  వడకట్టిన నీళ్లు పాలలా తియ్యగా అయ్యాయి. "ఇవిగో  మహారాణి మీరు కోరిన పాలు" అని ఇచ్చాడు.  ఇంతలో సభా సమయం ముగిసింది. మళ్లీ నెలరోజులకు  సభ ఉంటుంది. 
       "మరి నూనే?" అడిగింది షేబారాణి. రాజు నవ్వుతూ మిగిలిన రెండో  చిప్పను ఆమె చేతికి ఇచ్చి ఈసారి జరిగే సభకు దీన్ని తీసుకు రండి. అప్పుడు నూనెను తీస్తాను" అన్నాడు.
    నెల రోజుల తరువాత తిరిగి సభ మొదలయింది.  రాణి  రెండో చిప్పను  రాజుకు ఇచ్చింది. అది బాగా ఎండిపోయి ఉంది. దాని నుండి  ఎండు కొబ్బరి తీసాడు.  మెత్తగా రుబ్బించాడు. వడకట్టాడు.  నూనె తయారయింది. ఆమె చేతికి ఇచ్చాడు.  
      ఆమె ఆశ్చర్యంతో రాజును మెచ్చుకుంది. ఇలా అనేక పరీక్షలు పెట్టి సాల్మన్ తెలివితేటలు స్వయంగా చూసింది. మరి కొంతకాలం ఉండి  షేబా దేశం వెళ్ళిపోయింది.