జాజికాయ(Nutmeg)-2. ఔషధోపయోగాలు..: - పి . కమలాకర్ రావు .

 జాజికాయ పొడి కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఉబ్బసం రానివ్వదు. తలనొప్పిని జ్వరాన్ని కూడా రానివ్వదు. కొద్దిగా జాజికాయ పొడిని నీటిలో వేసి యాలకుల పొడిని లవంగాల పొడిని కూడా కలిపి మరిగించి కషాయంగా చేసి పెద్ద వారైతే కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలి. ఇది చిన్న పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా కూడా ఇవ్వవచ్చు. కానీ చాలా తక్కువ మోతాదులో అంటే  పెద్దవారికి వాడిన మోతాదులో పావు వంతు మాత్రమే చిన్న పిల్లలకు వాడాలి. చిన్న పిల్లలకు ఉప్పుకు బదులుగా తేనె వేసి ఇవ్వాలి. జాజికాయపొడి ఎక్కువైతే చిన్న పిల్లలకు నిద్రమత్తు వస్తుంది. మితంగా వాడాలి.
జాజికాయను సాన పై రాసి  గంధం తీసి ముఖం మీద నల్ల మచ్చల పై రాశి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం చర్మంపైన ఉన్న మృతకణాలు పోయి నున్నగా తయారవుతుంది. ఇలా కొన్నాళ్ళు వాడితే నల్ల మచ్చలు అన్నీ పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.