ఉపాయం ( బాలల కథ) : రావిపల్లి వాసుదేవరావు
అనగనగా ఒక అడవిలో ఒక సింహం వుండేది .అది అడవిలో అన్ని జంతువులను భయపెట్టి నచ్చినట్టుగా చంపి తినేది . దాంతో జంతువులన్నీ భయపడిపోయాయి . సింహము ఎటువైపునుంచి వచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమని బతుకుతున్నాయి. ఇలా చేయడం తప్పనీ సింహానికున్న ఒకేఒక మిత్రుడు ఎలుగుబంటి నచ్చచెప్పింది . అయినా సింహము వినలేదు .ఇంతలో ఒకరోజు ప్రక్కనుండే వేరే అడవికి చెందిన జింక ఈ అడవికి వచ్చింది . ఇక్కడ సింహము ఆగడాలను అరాచకాలను తెలుసుకుంది . జంతువులన్నింటితో సమావేశం అయ్యింది . ఇక్కడ పరిస్థితి నాకు అర్ధమయ్యింది .ఇలా భయంతో ఎంతకాలం బ్రతుకుతారు . ఎవరికైనా కనీసం స్వేచ్ఛగా జీవించే అవకాశం వుండాలి కదా .అప్పుడే మన జీవితానికి

అర్ధం వుంటుంది . అని జింక చెపుతూ ఇంకా ఇలా అన్నది . మా అడవిలో ఆ స్వేచ్ఛ వుంది . మా నాయకుడైన సింహము జంతువులను వేటాడి తిన్నప్పటికీ ఒక పద్ధతిని పాటిస్తాడు . ఇతర జీవులను గౌరవిస్తాడు . ఇష్టం వచ్చినట్టు చంపితినటం అనేది ఉండదు . మీరంతా ఒప్పుకుంటే నేనొక ఉపాయం చెపుతాను . మీరు మీ అడవిని వదలి కొన్నిరోజులు మా అడవికి వచ్చెయ్యండి .ఈ విషయమై నేను మా నాయకుడికి మిగతా జంతువులకు చెప్పి ఒప్పిస్తాను .అలాగైతే మీ సింహము కొద్దిరోజులలోనే తప్పుతెలుసుకొని బుద్ధితెచ్చుకుంటాడు . అని జింక నచ్చచెప్పింది జింక చెప్పినట్టుగానే జంతువులన్ని పక్క అడవికి వెళ్లిపోయాయి . అక్కడి జంతువులన్ని వీటి పరిస్థితి అర్ధంచేసుకున్నాయి .ఆనందముగా స్వాగతం పలికాయి . అన్ని జంతువులు కలసిమెలసి స్వేచ్ఛగాఉండసాగాయి . ఇక్కడ సింహానికి తినడానికి జంతువులు లేక ఆకలితో అలమటించింది .పిచ్చిగా అరిచింది . .మీరు క్రూరంగా ప్రవర్తించటం వల్లనే జంతువులన్నీ పక్కఅడవికి వెళ్లిపోయాయి అని ఎలుగుబంటి చెప్పింది . ఇకనైనా మీప్రవర్తన మార్చుకోకపోతే మరణమే మీకు దిక్కు అని హితబోధ చేసింది . సింహానికి తాను చేసిన తప్పేమిటో తెలిసింది. తన ప్రవర్తన మార్చుకుంటానంది . ఎలుగుబంటి ని పక్కఅడవికి రాయబారం పంపింది . ఎలుగుబంటి జంతువులన్నింటితో మాట్లాడి సింహము తనప్రవర్తనను మార్చుకున్నదని చెప్పింది .ఇకనుంచి మీరు భయపడవలసిన అవసరము లేదని చెప్పింది . మీరు స్వేచ్ఛగా మనఅడవికి రావొచ్చని భరోసా ఇచ్చింది . ఎలుగుబంటి మాటలలోని నిజాయతీని జంతువులన్నీ నమ్మాయి . తిరిగి తమ అడవిలోకి వెళ్లాలని నిర్ణయించాయి .జింక చెప్పిన ఉపాయం ఫలించినందుకు జింకకు కృతజ్ఞతలు తెలిపి తమ అడవికి వెళ్లిపోయాయి . సింహము జంతువులన్నింటితో సమావేశం ఏర్పాటుచేసింది . నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను .ఇకనుంచి నా ప్రవర్తనను మార్చుకుంటాను . మీరెక్కడికీ వెళ్ళవద్దని బ్రతిమలాడింది . అప్పటినుంచి జంతువులన్నీ స్వేచ్ఛగా అడవిలోన జీవించసాగాయి .