ఔ మల్ల: -- బాలవర్ధిరాజు మల్లారం

నా సిన్నప్పుడు
అరొక్క కాయగూరలు
తీరొక్క పండ్లు,పలాలు
పాలు,పెరుగు, సల్ల,
ఎన్న, నెయ్యి 
గిట్ల 
ఏ కాలంలో ఏదుంటే గది
బగ్గ తినే టోల్లం!
ఇంటికి  ఎవరన్న సుట్టాలచ్చినప్పుడో 
ఏదన్నా పండుగచ్చినప్పుడో
కూర దెచ్చుకొనో, కోడిని కోసుకొనో
తినేటోల్లం.గంతే!
గా కూర గుడ బుదారమో, ఐతారమో
ఎములాడ నుంచి ఓ తురుక పిలగాడు
మా మల్లారం అచ్చి
కూర  తెచ్చి అమ్మేటోడు.
అయితే..
దసుర పండుక్కు గాని,
సెట్లల్లకు పోయినప్పుడు గాని
ఒక మ్యాక పిల్లనో, గొర్రె పిల్లనో
పొత్తుల కొనుక్కొని,
ఎంత మంది పొత్తుంటే గన్ని పాల్లు ఏసి 
సరి సమానంగా  పంచుకునేటోల్లం!
నిన్న మొన్నటి దాకా
కాయగూరలు,ఆకు కూరలు
పప్పులనే ఎక్కువ తినేటోల్లం.
గప్పుడు రోగాలు తక్కువనే ఉండేటివి.
గా ఎన్నటనే పానాలు మంచి గుండేటివి,
మనుషులు గుడ బలంగా ఉండెటోల్లు
కానీ..
కౌసు బగ్గ తినుడు
ఎక్కువ సేసినప్పటి నుంచి,
పొలాలల్ల,  సేన్లల్లనే  కాదుల్లా
కాయ గూరలకు, ఆకు కూరలకు గుడ 
బగ్గ మందులు కొట్టుడు మొదలయి నప్పటి నుంచేనుల్లా
గీ అడ్డ మైన రోగాలు మోపైనయ్!
ముప్పై ఏండ్లకే తెల్లెంటికెలు,
బట్ట తల అచ్చి అయిసొల్లు గుడ
ముసలోల్ల  లెక్క కొడుతున్నరు 
ఔ మల్ల!