భాస్కర శతకము - పద్యం (౧౦౦- 100)

  ఉత్పలమాల: 
 *సారవివేకవర్తనల | సన్నతికెక్కిన వారిలోపలం*
*జేరినయంత మూఢులకుఁ | జేపడ దానడ; యెట్టలన్నఁ గా*
*సారములోన హంసముల | సంగతి నుండెడి కొంగపిట్ట కే*
*తీరునగల్గ నేర్చును ద | దీయగతుల్ దలపోయ భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
చెరువులో వున్న హంసల గుంపులో కొంగలు చేరితే, కొంగలకు, హంస నడకలోని హొయలు గాని, హంస లక్షణాలు గాని రావు కదా.  అలాగే, మంచి ఆలోచనా పరిజ్ఞానం కలిగిన వారితో కలసి మెలసి స్నేహం చేస్తూ తిరిగినంత మాత్రమున మూఢునికి యుక్తా యుక్త పరిజ్ఞానం రాదు .....అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఎవరైనా తమ జన్మ సిద్ధ లక్షణాల ప్రకారమే నడుచుకుంటూ జీవితం గడుపుతారు.  అయితే, ప్రయత్నం, సాధన, దైవానుగ్రహంతో కొంతవరకు, పుట్టుకతో తమకు వచ్చిన లక్షణాలను మార్చుకోవచ్చు. కానీ, ఒక మూఢుడు తెలిగలవాడిగా మారడం, కొంగ హంస లక్షణాలను పొందటం అసాధ్యం* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss