రాణిగారి గది 1.: -వసుధారాణి.

 ఓ శుభోదయాన జీవితంలో బొత్తిగా సాహసం కొరవడింది అనిపించింది.ఏమిచెయ్యాలబ్బా అనుకుంటూ బడికి తయారయిపోయి, చద్దన్నంలో గడ్డపెరుగు కలుపుకుని ఆవకాయముక్క నంజుకునే వేళ బుర్రలో ఓ చమక్కు మెరుపు మెరిసింది.
అంతే హుషారుగా మన బ్రేకులు పీకేసిన బ్లూ ఎవాన్ ఎస్ ఎల్ ఆర్ సైకిల్ తీసి(బెంజ్ కారు తీసినా కూడా ఇంత బిల్డప్ ఉండదు) బడికెళ్లి పోయాను.సిద్దార్ధ విద్యాలయంలో లంచ్ బ్రేక్ రెండు గంటలు ఉండేది.మునిసిపల్ హై స్కూల్లో ఒక గంట మాత్రమే.మధ్యాన్నం మొదటి పీరియడ్ సంగీతం ఇంకేముంది మొత్తం మనకి రెండుగంటలు దొరికినట్లు.
నా సాహసానికి ఇద్దరు సావాసం దొరికారు.అదే మన పొట్టి అనూరాధ,నేను దూకుదాం అంటే కళ్ళుమూసుకుని ఎక్కడైనా దూకేసే సీత.అనూరాధ ఒక సైకిలు, సీతని నా సైకిలు ఎక్కించుకుని.ఆ మిట్ట మధ్యాన్నం వేళ మా ఊరిలో ఉన్న రాజుగారి కోటకి వెళ్ళాం.
కోట ప్రాంతం బాగా సెంటరులో ఉండటం వలన కొంత అమ్మకాలు జరిగాయి తరవాత చాలా హాస్పటళ్లు,ఇప్పుడైతే ఒక షాపింగ్, కాంప్లెక్సు ,కల్యాణ మండపం వచ్చాయికానీ .అప్పుడు అలాలేదు.
చుట్టూ ప్రహరీ ఒక ముఖద్వారం ఉన్న దాదాపు 50 ఎకరాల ఏరియాలో కోట కొలువై ఉండేది.
ఒక భవనం లో ఓరియంటల్ కాలేజ్ ఉండేది.కొంత ప్రాంతంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త బిల్డింగ్ ఒకటి కట్టుకున్నారు.వాళ్ళ వాల్లా, కాలేజ్ వల్ల కొంచెం జన సంచారం ఉండేది అంతే. అక్కడక్కడా పెద్ద పెద్ద పాత భవనాలు గచ్చుతో కట్టినవి మాసిపోయి,పిచ్చితీగలు, చిల్ల చెట్లు పెరిగి చూడటానికి భయం గోలుపుతూ ఉండేవి.
ఊళ్ళోవాళ్లంతా  దయ్యాలని,రాత్రి వేళ గజ్జెల చప్పుళ్ళని రకరకాల కబుర్లు చెప్పుకునే వాళ్ళు.
రాణిగారి భవనం అంటే అందరికీ మరింత హడల్.అదీ విషయం. మా సాహసం అక్కడే ఉంది. రాణిగారి భవనం అంటేనే భయపడే దగ్గరికి వీలైతే భవనం లోకి వెళ్లి రావటం అన్నమాట.
సైకిళ్ళు ఒకపక్కన పెట్టి రాణిగారి భవనం దగ్గరికి వెళ్ళాం.ప్రజలు భయపడరంటే భయపడరూ మరి ఆ భవనం నిజంగానే మిగిలిన వాటికంటే కొంచెం చూడటానికే భయం గొలిపేలా ఉంది.గోడలన్నీ నల్లగా కాలి చల్లారినట్లు ఉన్నాయి.కిటికీలకు పెట్టిన గచ్చు మెష్ లాంటి దాని డిజైన్లు ఎంత బాగున్నాయో, తీగెలు పాకీ ,చెట్ల కొమ్మలు లోపలికి చొచ్చుకు పోయి,గవబ్బిలాల వాసనతో మాంచి హారర్ సినిమా సెట్టింగ్ లా ఉంది.
అనూరాధ నాలాంటిదే భయం తక్కువ, సీతకి మాత్రం భయం వేసినట్లుంది .అబ్బా వస్తా(వసుధా కి వచ్చిన తిప్పలు )బిల్డింగ్ చూసాంగా ఇంక వెళ్ళిపోదాంలే అంది. నాకూ ,అనూరాధకి అసలు ఆ హారర్ లుక్ తెగ నచ్చేసింది.మనం వచ్చింది లోపలికి వెళ్ళి చూడటానికిఅని ,లోపలికి వెళ్లాల్సిందే అని చెప్పాము ఇద్దరం ఒక్కసారే.
        (సశేషం)
ఇంతలో మా కాకి పక్కయింటికి ఎగిరి పోయింది మిగిలింది రేపు.