ఉపాధ్యాయపర్వం-44: -- రామ్మోహన్ రావు తుమ్మూరి


 మొత్తానికి తొమ్మిదో తరగతి గట్టెక్కింది.పదో తరగతి పెద్ద కష్టం లేకుండానే పర్మిషన్ వచ్చింది.అయితే వాళ్ల బోర్డ్ పరీక్షల వరకు నేనక్కడ లేను.బదీలుల జరిగితే కాగజ్ నగర్ సంజీవయ్య కాలనీ ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ గా అప్ గ్రేడయితే దానికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను.పాపం ఊరి వాళ్లందరూ నేను పోవద్దని అక్కడే ఉండాలని అడిగారు.ముఖ్యంగా వాసుదేవు గారు 

ఒకటికి రెండు సార్లు అడిగారు,కానీ నాకు కాగజ్ నగర్ స్థానికంగా ఉండే అవకాశం మళ్లీ రాకపోవచ్చు, ఏమను కోకండి అని చెప్పాను.నా స్వార్థం నేను చూసుకోవలసి వచ్చింది.నాకు చాలా బాగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.అయితే ఆ విశేషాలకంటే ముందు అక్కడి మరికొన్ని విశేషాలు పంచుకోవాల్సి ఉంది.అవన్నీ అయిన తరువాత వీడ్కోలు సమావేశం సంగతులు వివరిస్తాను.

       రాస్పల్లిని ఆనుకొని ఓ రెండు కిలోమీటర్ల దూరంలో గొర్రెగూడ ఉంది.మొత్తం ఎస్.సి.కాలనీ.అక్కడ చిరుతల రామాయణం వేసే బృందం ఒకటుందని తెలిసింది.ఎలాగైనా వాళ్లతో ఓ ప్రదర్శన ఇప్పించాలన్న కోరిక కలిగింది నాకు.దానికి కారణం నా జీవితం మీద చిన్నతనంలో బాగా ప్రభావం కలిగించిన ప్రక్రియ చిరుతల రామాయణం కనుక.ఇప్పటికీ ఆ చిరుతల రామాయణంలోని కొన్ని జానపద కృతులు మా అన్న దమ్ముల అందరి నోట్లో ఆడుతుంటాయి.చిరుతల రామాయణం యక్షగానం లాంటిదే . తెలంగాణాలో జానపదులను అలరించే 

దృశ్య రూపకం అది.

‘రామచంద్రుడనురా!రాజీవ నేత్రుడను 

శ్యామల వర్ణుడ’అంటూ రాముని పాత్ర తన పరిచయం తనే చేసుకుంటుంది.

అట్లాగే ‘విశ్వామిత్రుడ విమల చరిత్రుడ’

అని విశ్వామిత్రుడు,’లంకాధీశుడ’ అంటూ రావణుణు, మారీచ సుబాహు లాము మరియన్నాదమ్ములాము’ అంటూ పాత్రలు తమ పరిచయం చేసుకోవడం అదీ చిరుతల వాద్యానికి అనుగుణంగా చిన్న పదవిన్యాసాలతో 

కొన సాగుతుంది.

‘ఉంగరామా ముద్దుటుంగారమా రామా’ అంటూ అక్షరాలకు దీర్ఘాలిచ్చి 

పాత్రల సంభాషణంతా పాట రూపంగానే ఉంటుంది.వచనం ఉండదు.అన్నీ కీర్తనలే.వర్ణన చేయాల్సి వచ్చినా పాటరూపంగానే . ఉదాహరణకు ‘లంకను వర్ణించడానికి 

లంకపురివరంబూ మేలైన పట్టంబు’

ఏదో పాత్రచేత పాడించటం జరుగుతుంది.నేను మూడు నాలుగేళ్ల వాడిగా ఉన్నప్పట్నించే  మా ఊళ్లో అంటే ఎలగందుల్లో చూసిన స్మృతులు అవి ఎక్కడెక్కడ ప్రదర్శించారు అన్నీ స్మృతిలో నవనవంగా ఉన్నాయి.నా చిన్నతనంలో నాకవి కంఠస్థం గా ఉండేవి.నా బుజ్జి బుజ్జి చేతులు తిప్పుకుంటూ,అడుగులు 

(స్టెప్స్) వేస్తూ ఉంటే మురిసిపోయిన శబరి రూపిణి పక్కింటి గోపాలకృష్ణ బాయిని మరచిపోలేదు. నాలో లయజ్ఞానం గేయధాటి అలవడటానికి మూలం చిరుతల రామాయణం కనుక

ఆ ప్రక్రియ మీద మక్కువ కొద్దీ మా స్కూల్ కమిటీ వారిని సంప్రదించి  ప్రదర్శన ఏర్పాటు చేయించాను బడి సమయం లోనే.ఊరంతా అక్కడికి చేరటం ఒక మరచిపోలేని విషయం.వాళ్ల కళను ఆదరించినందుకు ఆ బృంద సభ్యుల కన్నుల్లో వెన్నెలలు కాయటం నాకు బాగా గుర్తు.నా సంతోషం నాకు తోచినదేదో వారి చేతిలో ఉంచాను.

   ఇక మరో విషయం రోజూ బస్సు లేదా జీపు దిగి బడికి వెళ్లేదారిలో నా రాకకోసం తోవలో ఉన్న పిల్లలు కాపు కాచి నేను కనిపించగానే నన్ను వెంబడించే వారు.అలా ఓసారి పెరళ్ల ఎనుగు (కంచె) ల కున్న సొరకాయలను చూసి ‘అరే ఇవి ఎందుకు తెంపటం లేదురా ‘అని అడిగాను.సార్ అవి చేదుయి ‘అన్నారు పిల్లలు.అవి చూడగానే నాలోని కళాకారుడు నన్ను కదిలించాడు.చెప్పాను.ఒరేయ్ ఈసారి అవన్నీ ఎండిన తరువాత నాకు తెచ్చివ్వండి అని.ఎందుకు సార్ అన్నారు వాళ్లు.తరువాత చెబుతాను అని చెప్పాను.ఎండాకాలం సెలవులకు ముందు అవన్నీ రకరకాల ఆకారాలవి సేకరించి కాగజ్ నగర్ తెచ్చుకున్నాను.ఆ సమ్మర్ వాటితో రకరకాల బాతులు పక్షులు చేసి నా లోని కళా తృష్ణకు ఊరట కలిగించాను.అందులో ఒకటి రెండు స్కూలుకు సెలవుల తరువాత తీసుకు వెళ్లి పిల్లలకు చూపించాను.

     ఇక మరచి పోలేని మరో విషయం

విషయం మరొకటి ఉంది.అది నన్ను బాగా కదిలించిన విషయం.(సశేషం)