అమ్మ (బాలల నీతి కథ)డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 94410 32212:


 విశాల్ కు బద్దకమెక్కువ. అమ్మకు ఇంటిపనులలో అస్సలు సహాయం చేసేవాడు కాదు. ఏదైనా పని చెబితే వినేవాడు కాదు. ఒకరోజు బడిలో టీచరు పాఠం చెబుతూ “ఇంట్లో అమ్మ ఒకతే కష్టపడి పని చేస్తుంది. మనం కూడా అమ్మకు సహాయం చేయాలి" అని చెప్పాడు. ఆ మాటలు విన్న విశాల్ వెంటనే పైకి లేచి "ఏం కష్టంలే సార్! అన్నం చేయడం, బట్టలు ఉతకడం కూడా ఒక పెద్దపనా!" అంటూ హేళనగా అన్నాడు. దానికి టీచరు నవ్వుతూ “నీవు మీ అమ్మను వారం రోజులు బాగా గమనించు. ఆమె ఏమేం పనులు చేస్తుందో బాగా గుర్తుపెట్టుకో” అన్నాడు. విశాల్ సరేనని అమ్మ పనులను గమనించసాగాడు. ఆ

వారం రోజుల తర్వాత విశాల్ టీచర్ కు అమ్మచేసే పనులన్నీ చెప్పాడు. పొద్దున్నే ఐదు గంటలకు నిద్రలేస్తుంది. నీళ్ళుపడ్తుంది. ఇళ్ళంతా కసువు ఊడుస్తుంది. బయట కల్లాపి జల్లి ముగ్గులేస్తుంది. అంట్లన్నీ తోముతుంది. అందరిని నిద్ర లేపుతుంది. పరుపులు సర్దుతుంది. టిఫిన్ తయారు చేస్తుంది. నీళ్ళు కాగబెల్టుంది. పిల్లలకు స్నానాలు చేయిస్తుంది. బట్టలు ఉతుకుతుంది. ఇస్త్రీ చేస్తుంది. వంట చేస్తుంది. వారానికోసారి ఇల్లు సర్దుతుంది. బండలు తుడుస్తుంది. మమ్ములను దగ్గరుండి చదివిస్తుంది. సంతకు పోయి సరుకులు తెస్తుంది. చినిగిన బట్టలు కుడుతుంది. ఇలా తాను గమనించినవన్నీ చెప్పాడు.

టీచర్ అన్నీ విని “అది సరే! మీ అమ్మ చేసే పనులన్నీ గమనించావు గదా! అందులో నీవు కొన్నైనా చేయగలవేమో ప్రయత్నించు” అన్నాడు. అప్పుడు విశాల్ ఓ! కొన్నేమిటి? అన్నీ చేస్తా” అన్నాడు.

విశాల్ ఇంటికి పోయి బట్టలుతుకుదామని ప్రయత్నించాడు. రెండు జతలు ఉతికే సరికి చేతులు నొప్పి పెట్టాయి. మరుసటి రోజు ఇళ్ళు తుడవడం మొదలు పెట్టాడు. ఒక గది తుడవగానే చెమటలు పట్టాయి. ఏ పనీ పూర్తిగా చేయలేక పోయాడు. తాను ఒక్కపని కూడా చేయలేక పోతుంటే అన్ని పనులు చేస్తున్న అమ్మ ఎంత కష్టపడుతుందో విశాలకు అర్థమైంది. అప్పటినుండి తన పనులు తానే చేసుకోసాగాడు. అమ్మకు చేతనైన పనుల్లో సహాయం చేయసాగాడు.