సమవుజ్జీలు: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,;;ధర్మపురి. మొబైల్:9908554535.


 శీనయ్య ,శంకరయ్య లు పెళ్లి సంబంధం కోసమని బయలుదేరి రాత్రిపూట ఒక పూటకూళ్ల  ఇంట్లో తలదాచుకున్నారు .తెల్లవారకముందే చీకట్లో లేచిన శీనయ్య ,శంకరయ్య ఒకరినొకరు ఢీ కొన్నారు. అంతేకాకుండా శీనయ్య ,శంకరయ్య కాలును గట్టిగా తొక్కాడు .వెంటనే శంకరయ్య చేతిలోని ఆముదం శీనయ్య పై ఒలికిపడింది . కొద్దిసేపు ఇద్దరూ వాదులాడుకున్నారు.

           అప్పుడే వీళ్ళ గొడవకు మేలుకొని వచ్చిన పూటకూళ్ళ ముసలమ్మ ఇద్దరి మధ్య గొడవను సద్దుమణిగేటట్లు చేసింది .అంతేగాకుండా మీరిద్దరూ ఏమి పనిమీద బయలుదేరారని అడిగింది. అప్పుడు శీనయ్య "ఎండపల్లి గ్రామంలోని శంకరయ్య కొడుకు మా అమ్మాయికి తగిన వరుడని మా బంధువు ఒకరు చెప్పారు. అందువల్ల ఎండపల్లికి  బయలుదేరాను" అని చెప్పాడు .అది విన్న శంకరయ్య తానే ఎండపల్లి శంకరయ్యననీ, మీరు బయలుదేరింది మా ఇంటికేనని  చెప్పాడు.

           శంకరయ్యను కూడా పూటకూళ్ళమ్మ ప్రశ్నించగా "మూటపెల్లి గ్రామానికి చెందిన శీనయ్య కూతురు చాలా యోగ్యురాలని ,నా కుమారునికి తగిన సంబంధం అనీ, మా ఊరి శాస్త్రులు గారు చెప్పారు. అందుకే మూటపెల్లి బయలు దేరాను" అని చెప్పాడు శంకరయ్య.

మూటపెల్లి శీనయ్యను నేనేనని చెప్పాడు శీనయ్య . శంకరయ్య ఎంతో సంతోషించి "మన ఇద్దరికీ వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లు అయింది .లేకపోతే మీ ఇంటికి నేను మా ఇంటికి మీరు బయలుదేరి ,ఇలా మన ఇద్దరం అనుకోకుండా ఇక్కడ కలుసుకోవడం దైవఘటన కాదా"! అని అన్నాడు.

             శీనయ్య వెంటనే "శంకరయ్యా! నన్ను క్షమించు. నాకు రేచీకటి .అందుకే నాకు కనిపించక నిన్ను ఢీకొనుటయే గాక నీ కాలు తొక్కాను"   అని వేడుకున్నాడు .అది విన్న శంకరయ్య "అయ్యో శీనయ్యా! నీవే నన్ను క్షమించు. నాకు రేచీకటి రోగం . అందువలన ఆముదం ఒలికి  నీ పైన పడింది" అని అన్నాడు .అప్పుడు పూటకూళ్ళది  "ఇంతసేపు పోట్లాడుకున్నారు.  ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అందుకే  వియ్యానికైనా ,కయ్యానికైనా సమఉజ్జీలుగా ఉండాలన్నారు పెద్దలు .మీరు సమానస్కందులు. కయ్యం అయిపోయింది .ఇక వియ్యం అందుకొండి "అని అన్నది. ఇద్దరూ  ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.