ASDF;LKJ.:- వసుధారాణి.

 ASDF; LKJ  ఈ అక్షరాలు టైప్ రైటింగ్ లో మొదటి పాఠం.ఇప్పుడు ఇది ఎందుకు తల్లీ అనకండి. చిన్నప్పుడు కొన్నిపన్లు చాలా విచిత్రంగా చిన్న చిన్న  కారణాల కోసం చేస్తుండే దాన్ని.
అలాటి పనే టైప్ నేర్చుకోవాలి అనుకోవటం.నాకు ఇష్టమైన ఫ్రెండ్ ఒకమ్మాయితో కబుర్లు చెప్పుకోవడం కోసం.ఆ పిల్ల టైప్ ఇనిస్ట్యూట్లో చేరితే నేనూ చేరాను.ఎండాకాలం సెలవల్లో టైమ్ చాలా మందంగా నడుస్తుంటుంది.మనలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండే టైంలో ఖాళీగా ఇంట్లో కూర్చోలేము.రోజూ టైమ్ ప్రకారం బయటికి వెళ్ళటానికి మోటివేషన్ కావాలి కదా.అందుకే ఈ టైపు ఎంచుకున్నాం.పాపం మాఫ్రెండ్ సిన్సియర్ గా నేర్చుకునేది.
అసలు ఆటైప్ ఇనిస్టిట్యూట్కి వెళ్లే స్టైల్ నాకు నచ్చేది.సైకిల్ హ్యాండిల్కి, బ్రేకుల వైర్ల మధ్య రోల్ చేసిన రెండు A2 షీట్స్ పెట్టుకుని విలాసంగా చదువు గురించిన టెంక్షన్ ఏమీ లేకుండా వెళ్ళేదాన్ని.పల్నాడ్ బస్స్టాండ్ దగ్గర ఉండే భారత్ టైప్ ఇనిస్టిట్యూట్. దాని యజమాని కం నేర్పేఆయన మా బంధువే .పాపం వాళ్ళ అమ్మకి చాలా లేటు వయసులో పుట్టారట ఆయన చిన్నగా సన్నగా పొట్టిగా ఆర్భకంగా ఉండే వారు.
మొదటి పాఠం  ASDF;LKJ ఒక్కటి మాత్రం ఆయన చూపారు టైప్ మిషను మీద ఓ రెండు రోజులు అది మాత్రమే ప్రాక్టీస్ చేసాను .ఓకేదాన్ని అక్షరాలు దిద్దినట్లుగా కొట్టుకుంటూ కూర్చోవడం ఏమిటి అనిపించింది.అంతే ఆ తరవాత నించి రోజు వెళ్ళటం మా ఫ్రెండ్ టైపు చేసుకున్నంతసేపు లోకాభిరామాయణం పక్క పిల్లలతో,సర్ తో మాట్లాడుకోవడం.మా ఫ్రెండ్ ప్రాక్టీస్ అయిపోయాక కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి రావటం.సైకిల్ ఎక్కి వస్తే త్వరగా ఇల్లు చేరతామని 1 1/2.కిలోమీటరు దూరం అతినెమ్మదిగా నడిచేవాళ్ళం.
మా నడకలో  కామెడీకి ఒక ఉదాహరణ.
పల్నాడు బస్టాండ్లో మొదలైన మా నడక వెనుక కొన్ని రోజులు ఒక రిక్షా ,దానిలో మైక్ పెట్టుకుని బళ్లారి వారి సుగంధ బళ్లారి లేహ్యం అమ్మేవాడు ఒకడు ఆ లేహ్యం గొప్పతనం వివరిస్తూ వస్తుండే వాడు.అలాగే జాలిమ్ లోషన్ కొన్నిరోజులు . వాడి ఎనౌన్స్ మెంటు ఇలా ఉండేది.
శక్తికి, పుష్టికి,సౌఖ్యానికి వాడండి బాబూ సుగంధ బళ్లారి లేహ్యం.అని
అలాగే మీకు గజ్జి ,తామర ఉన్నా, పొడలు ఉన్నా సిగ్గు పడద్దు బాబు ఒక్క డబ్బా జాలీమ్ లోషన్ కొనండి మీ సమస్యలకి పరిష్కారం. మా బండి వద్ద దొరుకుతుంది.రండి బాబు రండి కొనండి ..ఇలా ఉండేవి వాడి ప్రకటనలు.
వీడు పాపం మన వెనక వచ్చినందుకు అన్నా బళ్లారి లేహ్యం కాక పోయినా జాలిమ్ లోషన్ అన్నా కొనుక్కోవాలే ..అనుకుని నవ్వుకునే వాళ్ళం.ఇల్లు దగ్గరికి వచ్చేసినా మాకబుర్లు వగ తెగక పోతే మళ్ళీ వెనక్కి కొంచెం నడిచి ముందుకు వచ్చే వాళ్ళం.
ఈ విధంగా మూడు నెలలు మన టైప్ క్లాస్ కాలక్షేపం నడిచింది.పాఠం మాత్రం ఒక్క మొదటి పాఠమే. మా ఫ్రెండ్ మాత్రం లోయర్,హయ్యర్ కూడా పాస్ అయ్యి. షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంది.