టీవీ సీరియళ్లకు జేజేలు :-- తడక మళ్ళ మురళీధర్

 కేవలం తెలుగు సీరియళ్లను ప్రసారం చేసే భ్రమ టీవీ ఛానల్ అధినేత కుబుసం స్వామి బంజారాహిల్స్ లో ఉండే "తందాన" బిల్డింగు  మూడో అంతస్తులో తన ఆఫీసు రూములో క్రౌన్ చైర్ లో కూర్చోగా  సొల్లు ఆశారాం, చిడతల  రాంభజన్ అతని  ఎదురుగా ఉన్న రెండు కుర్చీల్లో ఆశీనులయ్యారు. ఆశారాం  ప్రొడ్యూసర్- కం -డైరెక్టర్ అని అతని శిష్యుడు  రాంభజన్ లిరిక్స్  రాస్తుంటాడని వారే అనుకుంటారు.
      "ఏం చెప్పదలచుకున్నారు  ఆశారాం గారూ"  అడిగాడు కుబుసం స్వామి.
       "అయ్యా తమరి టీవీ ఛానల్ లో మా మెగా సీరియల్ ప్రసారం చేస్తే మీకు మేము రుణపడి ఉంటామండి.   "ఫట్" బట్టల సబ్బుల కంపెనీ వారు, "గాన్" హెయిర్ డై కంపెనీ వారు స్పాన్సరు చేయటానికి సిద్ధంగా ఉన్నారండి. నా శిష్యుడు రాంభజన్ కథ,  లిరిక్స్ రెండు  అద్భుతంగా రాశాడండి.  మీరు ఒప్పు కుంటారనే ఉద్దేశంతో పైలట్ ఎపిసోడ్స్ తో వచ్చాము" అన్నాడు ఆశారాం ఎంతో ఆశతో.
      "వావ్, కొంత భాగం  షూటింగ్  కూడా  చేశారన్నమాట. మరి నటీ నటులు పేరున్నవారేనా" అడిగాడు కుబుసం స్వామి.
        "కొత్త వారికి అవకాశం కల్పించాలని, బెంగళూరు నుండి ప్రధాన  నటీనటులను ఎంపిక చేశామండి.  డబ్బింగ్ మాత్రం ఇక్కడి వారితో చెప్పించాం.  బాగా సింక్ అయిందండి.  ఇప్పటి దాకా చాలా రిచ్ గా తీశాం. ముందు ముందు కూడా కాంప్రమైజ్ కాకుండా  రిచ్ నెస్ ఉండే విధంగా కంటిన్యూ చేస్తామండి.  అంతెందుకు ఇంట్లో  పని మనిషి, కారు డ్రైవరు కూడా రిచ్ గా ఉంటేనే కదండీ మీక్కూడా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది.   నా ఆలోచనా విధానమేమంటే పని మనిషి, డ్రైవరు కూడా మనుషులే కదా మరి వారిని  పేద వారిగా
చిత్రీకరిస్తే వీక్షకులు ఒప్పుకోరు" హుషారుగా చెప్పాడు ఆశారాం.
      "షూటింగ్ ఇన్ డోర్ లో ఉంటుందా లేక ఔట్ డోర్ లో ఉంటుందా" .
      "రోడ్ నంబర్ 13 లో నాకు తెలిసిన  బిజినెస్ మాన్ కు "కలవరం" అనే  గెస్ట్ హౌస్ ఉందండి,  అందులో షూటింగ్  చేశాం,  విలన్లు చేజ్ చేసే సన్నివేశాలు మాత్రం "పప్పూ" స్టూడియోలో తీశామండి.  గొప్పలు చెప్పు కోవటం కాదు కానీ ఎటువంటి పొరపాటు దొర్లకుండా మా యూనిట్ స్టాఫ్ అంతా కలసి కట్టుగా పని చేశారు.  మూస ధోరణి కాకుండా వెరైటీగా ఉంటుందని  ప్రతి  ఎపిసోడ్ కు ఒక్కో కొత్త ట్యూన్ ఇచ్చా మండయ్యా.   తెలుగు టీవీ సీరియళ్లలో దీనితో  ఒక కొత్త శకం మొదలవుతుందనుకోవచ్చు."
     కళ్ళు మూసుకొని క్రౌన్ చైర్ లో వెనక్కు వాలి కూర్చున్న  కుబుసం స్వామి ఆగమన్నట్టు అరచెయ్యి  చూపటంతో ఆశారాం తన వాక్ ప్రవాహాన్ని ఆపాడు.   రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత కుబుసం స్వామి  కళ్ళు తెరిచి ముందుకు వంగి " మీరు ఇప్పటి దాకా షూటింగ్ చేసిన ఎపిసోడ్స్ కథను నాకు బ్రీఫ్ చేయండి" అన్నాడు.
       టేబుల్ మీద ఉన్న గ్లాసులోని మంచి నీళ్ళు తాగి  ఆశారాం కథ బ్రీఫ్ చేయటం మొదలు పెట్టాడు. కుబుసం స్వామి  పేపర్ వెయిట్ ను టేబుల్ మీద గుండ్రంగా తిప్పుతూ వినసాగాడు.
       " హీరో దివాకర్ హీరోయిన్ రతి కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితులు. దివాకర్ ది పేద కుటుంబం,  రతి   తల్లి బోల్డు కంపెనీలకు "అధిసతి".  దివాకర్, రతి  ప్రేమించు కుంటారు. రతి  తల్లికి వీరి ప్రేమ నచ్చదు. అయినా సరే ఆమె అభీష్టానికి  వ్యతిరేకంగా వారిద్దరు పెళ్లి చేసుకుంటారు.  దివాకర్ కి  సంపాదన ఉండదు.    ఒక కూతురు, ఒక కొడుకు  ఏడాది తేడాతో రెండు సంవత్సరాల్లోపే జన్మిస్తారు. రతి తల్లి వారిద్దరిని విడదీయటానికి ఎన్నో విఫల ప్రయత్నాలు చేయటమే కాకుండా దివాకర్ ని  కిరాయి రౌడీలతో చంపించే ప్రయత్నం కూడా చేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఊర్లో ఉండే దివాకర్ తల్లి చేసుకోలేని వయస్సులో కొడుకు, కోడలు పంచన చేరి చీటికి మాటికి రతిని సూటి పోటి మాటలతో వేధిస్తుంది.  ఇలా ఉండగా  తనతో పాటు హైస్కూల్లో చదువుకున్న సుందరి 'భలేబజార్' సూపర్ మార్కెట్ లో దివాకర్ ని కలుస్తుంది.  వీరు ఫ్లాష్ బ్యాక్  లో కొన్నాళ్ల పాటు ప్రేమించుకుంటారు.   సుందరి కాలేజి చదువు కోసం వేరే ఊరు వెళ్ళటంతో వారి ప్రేమకు బ్రేక్ పడుతుంది.  ఈ లోగా సుందరి, దుఖేష్ ల వివాహం వారి ప్రమేయం లేకుండానే పెద్దవాళ్ళు జరిపిస్తారు.  ఇద్దరూ ఇష్టం లేని  పెళ్ళితో గడుపుతుంటారు.   వర్తమానాని కొస్తే, దివాకర్,  సుందరిలో  పాత ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది.     సుందరిని ఒక సారి ఇంటికి తీసుకు వచ్చి అందరికీ పరిచయం చేస్తాడు దివాకర్.  వీరిద్దరూ పాత ప్రేమికులనే విషయం వాళ్ళు గ్రహిస్తారు.  సహజంగానే రతికి  సుందరి అంటే నచ్చదు.   దీనితో దివాకర్, రతి మధ్య అగాధ మేర్పడుతుంది. అయితే వారి పాత ప్రేమను అర్థం చేసుకున్న  దివాకర్ తల్లికి, కూతురుకు  సుందరి అంటే విపరీతమైన ఇష్టమేర్పడి ఆవిడను వారి ఇంట్లోనే ఉండేట్లు బలవంతం చేస్తారు.  దివాకర్ కొడుకు మాత్రం ఈ బంధాన్ని అసహ్యించు కుంటాడు. రతి, సుందరి  ఎత్తుకు పైఎత్తులు వేస్తూఉంటారు.  చాలా రోజుల పాటు సుందరి ఇంటికి రాక పోయే సరికి దుఖేశ్  ఆమెను వెతుక్కుంటూ రిక్షా వాడు ఇచ్చిన సమాచారం మేరకు దివాకర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ రతిని  చూసి దిగ్భ్రాంతికి లోనవుతాడు.  ఆవిడ ఎవరో కాదు చిన్నప్పుడు తన ఇంటి ప్రక్కనే ఉండే మేన మామ ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేది.   సుందరి తమ ఇంట్లోనే ఉంటున్న  విషయం రతి దుఖేష్ కు చెప్తుంది. ఇంతలో సుందరి,  దివాకర్, అతని కూతురు ముగ్గురు కలసి  బైకుపై అక్కడకు వస్తారు.   తన భార్యను అక్రమంగా ఉంచుకున్నాడని దుఖేశ్ దివాకర్ ని దూషిస్తాడు. దుఖేష్ ను చూసిన సుందరి  భయంతో ఆటో ఎక్కి పారి పోతుంది.  దుఖేష్  కూడా మరో ఆటోలో సుందరిని వెంబడిస్తాడు.  ఈ లోపు రతి రౌడీ రత్తయ్యకు ఫోన్ చేసి సుందరిని ఎలాగైనా పట్టుక రావాలని డబ్బు ఆశ పెడుతుంది.  రౌడీకి ఫోను చేయటం రతి కూతురుకు ఇష్టముండదు.  తల్లితో వాదనకు దిగుతుంది.  హైస్కూల్లో ప్రేమ పుట్టిందని ఇప్పుడు ఒకరినొకరు ఇష్ట పడితే తప్పేమిటని తల్లిని ప్రశ్నిస్తుంది.  సిటీ సెంటర్ లో రత్తయ్య  మరో నలుగురు రౌడీలు కత్తులతో ఆటోని అటకాయించి సుందరిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు.  సరిగ్గా అదే సమయంలో రతి కూతురు అక్కడికి చేరుకొని రత్తయ్యను, రౌడీలను అడ్డగించి సుందరిని తన తండ్రి దగ్గరకు చేరుస్తుంది.  దుఖేష్, రతి ఇద్దరు ఒకటై సుందరిని ఎలా అంతం చేయాలని ప్లాన్లు వేస్తుంటారు. రతి తన తల్లి సహాయం కోరుతుంది.  ఒక మనిషిని చంపాలను కోవటం ఎంత దుర్మార్గమో తెలుసుకో అంటూ రతికి  నీతులు బోధిస్తాడు దివాకర్.  ఎంతకూ వినిపించు కోక పోయేసరికి  సుందరి ప్రోద్బలంతో దివాకర్ రతిని  ఇంటి నుండి వెళ్ల గొడతాడు."
      "ఇప్పటిదాకా షూటింగ్ చేసిన పైలట్ ఎపిసోడ్స్ కథ ఇది.  మీరు ఎస్ అంటే ఈ సీరియల్ ను వెయ్యి ఎపిసోడ్స్ దాకా తీసుక పోవచ్చు" అన్నాడు ఆశారాం.
       "ఆశారాం గారూ, నాకు బాగా నచ్చింది ఈ కథ. ఇందులో   సెంటిమెంటు ఉందంటారా" ప్రశ్నించాడు కుబుసం స్వామి.
      "సెంటిమెంటు లేక పోవడ మేమిటి . దివాకర్ కూతురు, సుందరి మధ్య తల్లీ కూతురు లాంటి ప్రేమ,  దివాకర్ తల్లి, సుందరి మధ్య అత్తా కోడళ్ళ అనుబంధం, దుఖేష్, రతి  ఫ్లాష్ బ్యాక్ లో    చిన్నప్పటి పరిచయాలు,  ప్రేమ సంభాషణ  వీటన్నిటిని మా రాంభజన్ చక్కగా పండించాడు.  అసలు స్త్రీ పాత్రల్లో సెంటిమెంటు, పగ, ప్రతీకారాలు సర్వ సాధారణం .  ఇందులో తనని ఇష్టపడని దివాకర్ కొడుక్కి విషం కలిపిన పాలిచ్చి సుందరి చంపాలను కోవటం,  రత్తయ్య, ఇతర రౌడీలు  సుందరిని కత్తులతో పొడిచే ప్రయత్నం, రతిని ఇంటి నుండి వెళ్ల గొట్టడం ఇవన్నీ మహిళలకు కన్నీరు తెప్పించటమే కాకుండా ప్రేక్షకులను ఈ కథ ఎన్నో మలుపులతో కన్ఫ్యూజ్ చేస్తుంది."అన్నాడు ఆశారాం. 
     "ఆశారాం గారూ, నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాను.  మా ప్రొడక్షన్ స్టాఫ్ తో చర్చించి రెండు రోజుల్లో  నిర్ణయం తీసుకుంటాను.  నూటికి నూరుశాతం ఓకె అయినట్టే అనుకోండి" అంటూ లేచాడు కుబుసం స్వామి.
     తెలుగు వారికి మరో సంచలన ధారావాహిక  సీరియల్ త్వరలోనే అందజేయబోతున్నామనే  సంతోషంతో కుబుసం స్వామి ఆఫీసు నుండి  బైటకు నడిచారు  సొల్లు ఆశారాం, చిడతల రాంభజన్.
( ఇన్స్పిరేషన్ : ప్రస్తుత టీవీ సీరియళ్లు )