ప్రతిభ(కథానిక):--:డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 వేగంగా దూసుకుపోతున్న కారును ఉత్సాహంగా నడుపుతున్నాడు రాము.అతని ఆలోచనలన్నీ ఆరోజు ఇవ్వబోయే ప్రెజెంటేషన్ మీదనే ఉన్నాయి.ఈ ప్రాజెక్టుతో తన కల నెరవేరబోతుందనే ఉత్సాహం అతనిలో మరింత ఎక్కువైంది.కానీ విష్ణుతో పోటీయే కొంత టెన్షన్ కు గురిచేస్తున్నది.తన‌ ప్రాజెక్టు పట్ల ఉన్న నమ్మకం అతడిని‌ సముదాయిస్తుంది.ఈ ఆలోచనల మధ్యనే సమయమే తెలియకుండా ఆఫీసుకు చేరుకున్నాడు.అప్పటికే అతని టీం సభ్యలందరూ వచ్చేసి రాము రాక కోసం చూస్తున్నారు.అతని ప్రవేశం వారిలోని ఆందోళనను ‌తగ్గించింది.తనవారికి తన‌ ప్రెజెంటేషన్ గురించి వివరించి,పెన్ డ్రైవును లాప్ టాప్ బ్యాగు పై కప్ లో ఉంచాడు.అతని పనిని రహస్యంగా గమనిస్తున్న విష్ణు ఎలాగైనా రామును‌ పక్కకు తప్పించి,ఆ ప్రాజెక్టును సొంతం చేసుకోవాలనే దురాలోచనతో కుట్ర పన్నాడు.విదేశీ కంపెనీ ప్రతినిధులు రావడానికి సమయముండడంతో వారంతా రిలాక్స్ కావడానికి‌ కాఫీ సేవించడానికి‌ వెళ్ళారు.మీటింగ్ హాలులో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.కంపెనీ సి.ఇ.ఓ కూడా వచ్చేసి తన ఛాంబర్లో ఉన్నారు.
          విష్ణు రాము ఛాంబర్ లోకి ప్రవేశించి పెన్ డ్రైవును దొంగిలించి,సమాచారమంతా తీసుకొని, ఖాళీ పెన్ డ్రైవును తిరిగి అక్కడే పెట్టాడు.ఇదేమీ తెలియని‌ రాము తన మేధస్సునే నమ్ముకొని ఉన్నాడు.తిరిగి తన టీం సభ్యులతో వెనక్కి వచ్చి,వారి విషెస్ అందుకొని మీటింగ్ హాలులోకి ప్రవేశించాడు.కంపెనీ సి.ఇ.ఓ,విదేశీ ప్రతినిధులు‌ అందరూ రాము ఇవ్వబోయే ప్రెజెంటేషన్ ‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అతని మీద ఎంతో నమ్మకమున్న సి.ఇ.ఓ అతనికి‌ నవ్వుతూ స్వాగతం‌ పలికి,విదేశీ ప్రతినిధులకు పరిచయం చేసాడు.విషెస్ చెప్పి,మొదలుపెట్టమని‌ సైగ చేసాడు.ఎంతో ఉత్సాహంతో లాప్ టాపుకు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి,పెద్ద స్క్రీన్ మీద చూపడానికి ఆన్ చేసాడు.కానీ ఏమీ లేని ఆ పెన్ డ్రైవ్ వెక్కిరించింది.అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.ఆందోళనకు ‌గురైన‌ రాము మరో సారి అంతా చెక్ చేసి చూపే ప్రయత్నం చేసాడు.కానీ అది సఫలం కాలేదు.ఏం జరిగిందో అర్థం కాని అతడు ఎంత ప్రయత్నించినా, దానిలో సమాచారముంటే కదా?అది లేదని,మోసం జరిగిందని ‌గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.మరోవైపు సి.ఇ.ఓ చాలా కంగారు పడుతున్నాడు.ఎన్నో నెలలు శ్రమకోర్చి, విదేశీప్రతినిధులను ఒప్పించి ఏర్పాటు చేసిన సమావేశం వృధా అవుతుందని బాధపడుతున్నాడు.అందరికీ సారీ చెప్పి,తన సమయం ముగియడంతో చాలా బాధతో బయటికి వచ్చాడు.చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని అతడు విలవిలలాడాడు.
  
      తనవంతు అవకాశం కోసం ఎదురుచూస్తున్న విష్ణు ఇదే అదనుగా తాను ‌మీటింగ్ హాలులోకి‌ ప్రవేశించి,దొంగిలించిన రాము ప్రెజెంటేషన్ ను తన ప్రెజెంటేషన్ గా చూపెట్టాడు.అందరూ ఆశ్చర్య పోయి చూసారు.అయితే చివరి అంకం దగ్గర అతడు బోర్లా పడ్డాడు.ప్రాజెక్టు ఎస్టిమేషన్ షీట్ సమర్పించాలి.అది అందులో లేదు.దాన్ని నిర్మించిన వాడికే అది తెలుస్తుంది.దాన్ని విడిగా కాగితాల రూపంలో ప్రతినిధులకు అందిస్తారు.చౌర్యం చేసే తొందరలో దాన్ని మర్చిపోయాడు.ప్రజెంటేషన్ అసంపూర్ణమై ఏమి చేయాలో తెలియక తడబడ్డాడు‌.
      ఇది తెలుసుకున్న రాము ఎస్టిమేషన్ పేపర్లతో మీటింగ్ హాలులోకి అడుగుపెట్టి,అది తన కలల ప్రాజెక్టు అని,దాని గురించి అనర్గళంగా ప్రసంగించి,కాగితాలను వారందరికి అందజేసాడు.విష్ణు సిగ్గుతో తలదించుకొని,అక్కడి నుండి వెళ్ళిపోయాడు.సంతృప్తి చెందిన విదేశీ ప్రతినిధులు అతని మేధస్సుకు మెచ్చుకొని అతిపెద్ద ఆఫర్ ఇచ్చారు.రాము‌ ఆనందానికి అవధులు లేవు. తన కల సాకారమయినందుకు ఆనందబాష్పాలతో సి.ఇ.ఓ.ను ఆలింగనం చేసుకున్నాడు.సి.ఇ.ఓ.అతని‌ భుజాన్ని సున్నితంగా నిమురుతూ ఓదార్చాడు,అభినందించాడు కూడా.
    విషయపరిజ్ఞానం లేకుండా అందలాలెక్కాలనుకోవడం,
దాని కోసం కుట్రలు,కుతంత్రాలు చేసినా ఫలితం ఉండదు.మేధస్సు,జ్ఞానమే విజేతలవుతాయి.