బొమ్మల కొలువు: --ఎం బిందుమాధవి

 అమ్మా వాళ్ళు కూడా ఇక్కడే ఉండటంతో, సంక్రాంతి వేడుక చూపించటానికి పిల్లలని తీసుకుని శిల్పారామం వెళ్ళిన పద్మకి తన చిన్నతనంలో అమ్ముమ్మగారి ఊళ్ళో ప్రతి సంవత్సరం గడిపిన సంక్రాంతి పండుగ కళ్ళకి కట్టినట్లు గుర్తొచ్చి తెలియకుండానే ఆ స్మృతుల్లోకి వెళ్ళిపోయింది. 
"అమ్మా తాతయ్యెప్పుడొస్తాడమ్మా" పదోసారి అడుగుతున్నది పద్మ. 
"వస్తాడు లేవే! చంపేస్తున్నావు. అలా వాకిట్లోకెళ్ళి ఆడుకో ఫో" అన్నది వసుమతి. 
"రోజూ అట్లాగే చెబుతున్నావ్. మాకు సెలవులిచ్చి అప్పుడే రెండు రోజులయింది. మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసుంటారు. ఈ సారి శైలజ కొత్త ముగ్గులు నేర్పిస్తానన్నది. కొంచెం ముదుగా వస్తే అమ్ముమ్మ క్రోషా నేర్పిస్తానన్నది" అని పద్మ ఒకటే నస. 
******
రాఘవయ్య గారి రెండో కూతురు వసుమతి. వాళ్ళ కుటుంబం విజయవాడలో ఉంటారు. భర్త అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. తెనాలికి దగ్గరలో ఉండే పల్లెలో ఉంటారు రాఘవయ్య గారు. 
ప్రతి సంక్రాంతి పండుగకి పిల్లలకి సెలవులివ్వగానే, జనవరి ఒకటి రెండు తారీకుల్లో,  ఆయన వచ్చి మనవలని తన పల్లెకి తీసుకెళతారు. వసుమతి, భర్త పండుగ రోజు వచ్చి  కనుమ వరకు ఉండి, ముక్కనుమ నాడు బయలుదేరి పిల్లలతో మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతారు. 
ఈ సారి ఇంట్లో చిన్న మరమ్మతు పనులుండి ఆయన వెళ్ళి పిల్లలని తీసుకురావటం ఆలశ్యమయింది. 
*******
తలుపు చప్పుడవ్వగానే ఒక్క గంతులో దూకి తలుపు తీసింది పద్మ. తాతయ్యని చూసి మొహం చాటంత అయింది. సర్ది పెట్టుకున్న బ్యాగ్ తీసుకుని, చెప్పులేసుకుని "పద తాతయ్యా" అన్నది. 
"నీ కంగారు బంగారం గాను. తాతయ్యని లోపలికి రానిస్తావా లేదా?  రా..నాన్నా కాళ్ళు కడుక్కో" అని మంచి నీళ్ళిచ్చింది. 
"పాపం తాతయ్య ఇప్పుడే కదా వచ్చారు. ఎప్పుడు బయలుదేరారో, ప్రయాణంలో అలిసిపోయి ఉంటారు. కాళ్ళు కడుక్కుని భోజనం చేసి కాసేపు పడుకోనివ్వు. రేపు పొద్దున్నే బయలుదేరచ్చు" అని పద్మని సమాధానపరిచింది వసుమతి. 
తాతయ్య అన్నం తింటున్నంతసేపు, స్కూల్ విషయాలు, అమ్మ సంక్రాంతికి తనకి కుట్టించిన పట్టు పరికిణీ, అది తనకి ఎంత నచ్చిందో, వసపిట్ట లాగా వాగుతూనే ఉంది. తాతయ్యతో కలిసి సాయంత్రం పార్క్ కి వెళ్ళొచ్చి, రేపటి ప్రయాణం గురించి కలలుకంటూ నిద్రపోయింది. 
*****
"అమ్ముమ్మా ఈ సంవత్సరం బొమ్మల కొలువుకి కొత్త బొమ్మలు కొన్నావా? అమ్మ కొండపల్లి వెళ్ళి కృష్ణుడి బొమ్మలు కొని తెచ్చింది. విరిగిపోకుండా బట్టల్లో చుట్టి నా పెట్టెలో పెట్టి పంపించింది" అన్నది ఊరికి రాగానే ఉత్సాహంగా. 
"ఆ:( వాకిట్లోకి అమ్మొస్తే పెళ్ళివారి సెట్, గుహుడు పడవ మీద సీతా రాములని గంగని దాటించే బొమ్మ కొన్నాను. ఇవ్వాళ్ళ ఇంకా ఐదో తారీకే కదా! రాత్రి పడుకునేటప్పుడు నవ ధాన్యాలు మట్టి మూకుడులో పోసిపెట్టు. పండుగ నాటికి మొక్కలు బాగా పెరుగుతాయి. బొమ్మల కొలువులో పంట పొలం, జంతువులన్నీ పెట్టి జూ, నువ్వు తెచ్చిన కృష్ణుడి బొమ్మలతో బృందావనం పెడదాము. పెందలాడే పడుకో. పొద్దున్నే ముగ్గేసేటప్పుడు లేపుతా. సూర్యోదయానికి ముందే లేవాలి. మనం లేచి సూర్యుడి కోసం ఎదురు చూడాలి కానీ ఆయనొచ్చి మనని లేపకూడదు. తెలిసిందా" అని వంట చేసే పనిలో పడింది అమ్ముమ్మ. 
******
అమ్ముమ్మ మాటల ప్రభావం...చలిలో ఐదింటికల్లా లేచి కూర్చుంది పద్మ. పళ్ళు తోమేసుకుని ముగ్గు డబ్బాతో అమ్ముమ్మ కోసం రెడీగా కూర్చుంది. అమ్ముమ్మ చేతినిండా ముగ్గు తీసుకుని, వేళ్ళ సందు నించి ముగ్గు వదులుతూ రెండు రెండు గీతలు ఒకసారి గియ్యటం చూస్తున్న పద్మకి ముగ్గులు వెయ్యటంలో అమ్ముమ్మ నేర్పరితనం ఎప్పుడూ ఆశ్చర్యమే! 
అమ్ముమ్మగారిల్లు మెయిన్ రోడ్డు నించి ఓ వంద గజాల దూరంలో లోపలికి ఉంటుంది. ఆ దారి పొడుగునా ప్రతి పది అడుగులకీ  అడ్డంగా వేళ్ళ సందు నించి గీసే గీతలతో అమ్ముమ్మ ఒక సరిహద్దు బార్డర్ లాగా వేసుకుంటూ ఇంటి ముందుకి వచ్చేసరికి పెద్ద చుక్కల ముగ్గు వేసేది. "నేనెప్పుడు అమ్ముమ్మ లాగా వేస్తానో" అనుకుంది పద్మ. 
"అట్లా చూస్తూ కూర్చుంటావేమే, త్వరగా గొబ్బెమ్మలు చెయ్యి. ముగ్గు వెయ్యగానే దాని మీద గొబ్బెమ్మలు పెట్టెయ్యాలి. నిన్న పాలేరు చేత ఆవు పేడ తెప్పించి పెట్టాను. 
ఊ:( తెములు" అన్నది. 
బంతి, గుమ్మడి, చేమంతి, మందార, బిళ్ళ గన్నేరు, గరుడ వర్ధనం పువ్వులు...పసుపు, కుంకుమ, బియ్యప్పిండి పళ్ళెం నిండా సిద్ధం చేసుకుని గొబ్బెమ్మలు చేసే పనిలో పడింది పద్మ. 
అమ్ముమ్మ ముగ్గేసి రాగానే, అందంగా ముగ్గు నిండా గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో గొబ్బెమ్మ మీద సాంబ్రాణి కడ్డి వెలిగించి పెట్టింది. అలా గొబ్బెమ్మలు పెట్టిందో.. లేదో, ఇలా నెత్తి మీద శుభ్రంగా తోమిన రాగి పాత్ర తో, కాళ్ళకి గజ్జెలు, చేతిలో చిడతలతో పాట పాడుకుంటూ హరిదాసు వచ్చేశాడు. "అయ్యో జాగ్రత్త..గొబ్బెమ్మలు తొక్కుతావు తాతా" అంటున్న పద్మతో "ఎప్పుడొచ్చావమ్మా? అమ్మా, నాన్నా కులాసాయేనా" అన్నాడు. 
పద్మ డబ్బాతో బియ్యం తెచ్చి రాగి పాత్రలో పోసి, దోస కాయ, అరటి కాయ, గుమ్మడి ముక్క వేసిన కవరు చేతికిచ్చింది. 
ఇంతలో గంగిరెద్దుల వాడు వచ్చి కాసేపు ఆడించి, పద్మకి ఎద్దు చేత దణ్ణం పెట్టించి,  పద్మ ఇచ్చిన పాత దుప్పటి, తాతయ్య ఇచ్చిన కొత్త పంచె, రెండు జతల బట్టలు తీసుకుని ఆశీర్వదించి వెళ్ళాడు. 
*****
"మధ్యాహ్న భోజనాలయ్యాక చావిట్లో వేసి ఉన్న ముగ్గులు నల్లగా పాతబడ్డట్టు ఉన్నాయి. తెల్ల రంగు తీసుకుని వాటి మీద ఒకసారి మళ్ళీ దిద్దమ్మా. బొమ్మల కొలువు నాటికి కొత్తగా ఉంటాయి" అన్నది అమ్ముమ్మ. 
"ఈ వేళ సందె గొబ్బెమ్మలు పెడదాం అమ్ముమ్మా! నా ఫ్రెండ్స్ కి నిన్నే రమ్మని చెప్పాను. పాలేరు చేత మధ్యాహ్నానికి ఆవు పేడ తెప్పించు అమ్ముమ్మా! మా ఫ్రెండ్స్ కి పెట్టటానికి అటుకులు పాలల్లో నానెయ్యనా, పెరుగులో వెయ్యనా" అనడిగింది. 
సాయంత్రం గొబ్బెమ్మలు చేసేసి, శుభ్రంగా స్నానం చేసి నిరుడు పండుగకి అమ్ముమ్మ కొన్న పట్టు పరికిణీ కట్టుకుని, కుచ్చులతో జడ వేయించుకుని తలలో చేమంతి పువ్వులు పెట్టుకుంది. అమ్ముమ్మ పాంజేబులు కాళ్ళకి, నడుముకి వడ్డాణం, చెవులకి జుంకీలు పెట్టుకుని మెడలో అమ్ముమ్మ కాసులపేరు వేసుకున్నది. 
సాయంత్రం పేరంటం లో, గొబ్బెమ్మల చుట్టు తిరుగుతూ చేతులు చరుస్తూ పిల్లలంతా  
"ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే 
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే
కొట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు"
"గొబ్బీయల్లో సఖియా వినవే, 
చిన్ని కృష్ణుని సోదరి వినవే"  
అని పాటలు పాడటంలో  తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. తరువాత ప్రసాదం తిని ఇళ్ళకి వెడుతూ, మా ఇంట్లో రేపు సందె గొబ్బెమ్మలు పెడుతున్నా రమ్మని శైలజ చెప్పాక సందు చివర విడిపోయారు. 
******
బొమ్మల కొలువు కోసం ఇల్లు బూజులు దులపటం, మెట్లుగా పెట్టటానికి చెక్క బల్లలు  తుడిచి సిద్ధం చేసుకోవటంతో  ఆ వారం రోజులు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇంటికి తోరణాలు కట్టి, ఇతర అలంకరణ పూర్తి చేశాక అమ్ముమ్మ, అమ్మ, తను కలిసి బొమ్మల కొలువు పెట్టం పూర్తి చేసి హారతిచ్చారు. 
మూత మీద అందంగా, ఠీవిగా నిలబడ్డ నెమలి బొమ్మతో ఉన్న.. అమ్ముమ్మ పెళ్ళినాటి కుంకుమ భరిణ తీసుకుని పద్మ పేరంటం పిలవటానికి వెళ్ళింది. "రేపు భోగి, ఎల్లుండి పెద్ద పండుగ..రెండు రోజులు వచ్చి తాంబూలం తీసుకెళ్ళండి" అని ఊరంతా పిలిచి ఇంటికి చేరేసరికి సాయంత్రం ఐదయింది. 
"ఎక్కడికెళితే అక్కడేనా! ఇంతసేపు తిరిగి ఎలా అలిసిపోయావో చూడు! కాసిని పాలు తాగి శనగలు నానబొయ్యి" అన్నది అమ్ముమ్మ. 
"కాత్యాయని వాళ్ళింట్లో జంతికలు తిన్నానమ్ముమ్మా! నిర్మల వాళ్ళ మామ్మ పాయసం ఇచ్చింది, తాగాను. ఫరవాలేదులే అమ్ముమ్మా, శనగలు నానబోశాక పాలు తాగుతా" అనిచెప్పి కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లోకెళ్ళింది. 
మరునాడు ఒకరి ఇళ్ళకి ఇంకొకరు పేరంటానికి వెళ్ళి..ఎవరి బొమ్మల కొలువులో ఏ ఏ విశేషాలు ఉన్నాయో, వచ్చే సంవత్సరంకొత్తగా ఏ బొమ్మలు కొనాలో స్నేహితురాళ్ళతో మాట్లాడుకుని ఆ ఏటి సంక్రాంతి పండుగ కళకళ్ళాడుతూ జరుపుకున్న పద్మ, "అప్పుడే పండుగ అయిపోయిందా అమ్ముమ్మా? మళ్ళీ ఏడాది వరకు ఆగాలి" అన్నది. 
కనుమ నాడు మినుము తినాలని అమ్ముమ్మ గారెలు, అరిశలు చేసింది. 
పది రోజులు పిల్లలతో సందడిగా గడిపిన అమ్ముమ్మ, తాతయ్య, ఊరెళ్ళటం ఇష్టం లేక బిక్క మొహం వేసిన మనవరాలితో  "పద్మా ఉగాదికి మీకు పరీక్షలుంటాయి కదా, మేమే అక్కడికి వస్తాములే" అని చెప్పారు. 
అమ్మా నాన్నలతో గడిపిన సంక్రాంతి పండుగ జ్ఞాపకాలతో ఆనందంగా వసుమతి కూతురు పద్మ,  భర్త నరేష్ తో కలిసి బస్సెక్కింది. 
* * * * 
"అమ్మా గంగిరెద్దు చూడు నాకు దణ్ణం పెడుతున్నది అని సుష్మ భుజం మీద తట్టేసరికి ఇహంలోకి వచ్చిన పద్మ, తలతిప్పి చూసి...'పాపం పల్లెల్లో బ్రతుకు గడవక ఇలా బస్తీలకొచ్చి కృత్రిమ వాతావరణంలో తమ విద్యని ప్రదర్శిస్తూ, ఆ పశువులని ఆధునిక ప్రదర్శన వస్తువులని చేస్తున్నారు."
ఆ ఎద్దు బక్క చిక్కి, పైన వేసిన బట్టల బరువుని మొయ్యలేక మొయ్యలేక మోస్తున్నట్టుంది.
ఓ పక్కన అందంగా అమర్చిన "ఎడ్ల బండి", మరోపక్క రాతి మీద కూర్చుని చీకటి చాటుగా బీడి కాల్చుకుంటున్న హరిదాసు వేషం లో ఉన్న వ్యక్తి! 
ఏటి కొప్పాక కొయ్య బొమ్మల షాపులు, భాగవతం..రామాయణ ఘట్టాలతో తయారు చేసిన కాగితపు గుజ్జు కొండపల్లి బొమ్మలు, మరో పక్క వెదురు బొంగుతో చేసిన నెమలి బొమ్మలు, వేణువులు, మంగళగిరి చేనేత షాపులు, గాలిపటాలు-మాంజాలు అమ్మే షాపులు, మరోపక్క వేదిక మీద కూచిపూడి నృత్యం చేస్తున్న కళాకారిణి...శిల్పారామం అంతా చూడటానికి వచ్చిన దర్శనీయులతో కోలాహలంగా ఉన్నది. 
ఆ దృశ్యాన్ని తమ కెమేరాల్లో బంధించాలని ఆరాటపడుతున్న విదేశీయులు! 
అనేక అవసరాలకి అందరూ బస్తీల దారి పట్టి, పల్లెలు ఖాళీ అయ్యాయి. అక్కడ కళ్ళాపి జల్లిన ముంగిళ్ళల్లో తెల్లటి పిండితో వేసే ముగ్గులు, కాలి గజ్జెలు ఘల్లు ఘల్లుమంటూ తత్వాలు పాడుకుంటూ వచ్చే హరిదాసులు, సహజమైన వాతావరణంలో పుట్టి బలమైన ఆహారం తిని పుష్టిగా పెరిగిన గంగిరెద్దులూ, బుడబుక్కల వాళ్ళూ...అన్నీ ఇలా బతుకు తెరువుకోసం కృత్రిమమైన బస్తీ వాతావరణంలో ఒక చట్రంలో కుక్కెయ్యబడినట్లు అనిపించి పద్మ మనసు బరువెక్కింది. 
ఈ పది రోజులు వారంతా టీవీల వారికి, సినిమాలవారికి వ్యాపారానికి ముడి సరుకన్నమాట. మన సాంస్కృతిక ప్రతినిధులుగా ప్రదర్శన వస్తువులన్నమాట! 
తరువాత వారి గురించి పట్టించుకునేవారెవరు అనే ప్రశ్న మనసులో తొలుస్తుంటే, మధురంగా గడిపిన తన చిన్నతనం అలాగే స్తంభించి పోయి ఉంటే ఎంతా బాగుండేదో అనిపించింది పద్మకి!