చదువు-సంస్కారం(కథానిక):--డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 కదిలే రైలులోకి హడావుడిగా ఎక్కాడు చంద్రమౌళి. అప్పటికే నిండుగర్భిణిగా ఉన్న కంపార్ట్మెంట్ ను చూసి ఖంగుతిన్నాడు.ఇక నిలువు కొలువే దిక్కని నిర్థారించుకొని ఒక వైపుకు జరిగి నిలబడ్డాడు. ఇంతలో కళ్ళులేని ఒక ముసలాయన పాడుతుంటే,అతని కూతురు తోడుగా తీసుకొని వస్తుంది.అతడు శ్రావ్యంగా పాడుతున్నాడు.ఆ అమ్మాయి చేయిచాచి అడుగుతుంది.ఒక్కొక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.ఒక సీటు దగ్గర కూర్చున్న నిరంజన్ వారిని చూసి అసహ్యించుకుంటున్న దృశ్యం చంద్రమౌళి కళ్ళలో పడ్డది‌.అతను బాగా చదువుకున్నవాడిగానే కనబడుతున్నాడు.మంచివేషధారణతో,దర్పం ఉట్టిపడుతుండగా,కాలుమీద కాలేసుకొని కూర్చొని‌ ఉన్నాడు.వాళ్ళు తనను ఎక్కడ తాకుతారోనని ముడుచుకు పోతున్నాడు.చూస్తున్న చంద్రమౌళికి చాలా ఆశ్చర్యమేసింది.ఆ అమ్మాయి అతని ముందు చేయి చాచగానే కోపంగా పొమ్మన్నాడు.ఆ అమ్మాయి నొచ్చుకొని,తన తండ్రిని తీసుకొని ఇంకో వైపు సీట్ల దగ్గరికి కదిలింది.దాన్ని చూసిన చంద్రమౌళి "ఎందుకంత కోపం" అతనికి అనుకున్నాడు.చూడడానికి డబ్బున్నవాడిగానే కనబడ్డాడు.కానీ అలా ప్రవర్తించడంలో అతని గుణం తెలుస్తుందనుకున్నాడు.ఆ అమ్మాయి పక్క సీట్లలోని ఒక సామాన్య వేషధారణలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్ళి యాచించింది.అతడు వెంటనే తన జేబులోంచి యాభై రూపాయలు తీసి ఇచ్చాడు.ఆ అమ్మాయి ఎంతో కృతజ్ఞతా భావంతో అతనికి నమస్కరించింది‌.అతడు ఆమె వైపు ఎంతో దయతో చూసి బాధపడ్డాడు.దీన్ని చూస్తున్న చంద్రమౌళి 'చదువున్నా,డబ్బున్నా మనసులో సంస్కారగుణం లేకపోతే ఏమీ జరుగదు కదా' అనుకున్నాడు.చదువుతో సంస్కారం అబ్బుతుందా?లేదా పెరిగిన వాతావరణం,కుటుంబం నుంచి అబ్బుతుందా?అనే ప్రశ్నలు అతని మనసును తొలిచివేసాయి.
            ఇంతలో ఒక పల్లెటూరి స్త్రీ తన మూటాముల్లెతో ఆ కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించింది. నిరంజన్ కూర్చున్న సీటు ప్రక్కగా ఉన్న స్థలంలో కూర్చోవడానికి ప్రయత్నించింది.వెంటనే అతను   కసురుకుంటూ,ఆ స్థలాన్ని‌ తన శరీరంతో ఆక్రమించి,నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అతని ప్రవర్తనను గమనిస్తున్న చంద్రమౌళికి పట్టరానికోపం వచ్చింది. అయినా తమాయించుకొని అతని దగ్గరికి వెళ్ళి ఆమెకు కూర్చోవడానికి చోటివ్వమని అడిగాడు.దానికి నిరంజన్ చాలా నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం అతనికి కోపాన్ని తిరిగి తెప్పించింది. వెంటనే టి.సి.ని పిలిచి,అతన్ని మందలించాడు.ఆమెకు చోటు ఇప్పించి కూర్చోపెట్టాడు.అది పాసింజర్ అని,అందరూ కూర్చోవడానికి అవకాశం ఉంటుందని తెలిసీ నిరంజన్ అట్లా ప్రవర్తించడం అతని సంస్కారలోపం అనుకున్నాడు.చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరమనకుంటూ తన స్టేషన్ రాగానే దిగిపోయాడు.