చెంబు చేతబట్టి దెబ్బలు వేయుచూగారెలన్ని వొత్తి కాల్చుకుంటు
చెయ్యి చుట్టుతిప్పు చిత్రాల సకినాలు
కాగు నింపినాము కష్టపడుతు
పూసబిళ్ళ తీసి బుచ్చి చెగోడిలు
వాయివాయికేసి వరుసపేర్చి
మాట ముచ్చటాడి మాటిమటికి తింటూ
పరుగులెన్నొ పెట్టు పర్వమిదియె
చుక్కలన్ని కలిపి సుందరముగ నిల్చి
రథముముగ్గు వేయ రణము జేయు
అలుపు సొలుపు లేని యందాల మగువలు
యింటినందు నిల్చి యింతులైరి
గంగిరెద్దులాట గల్లిలన్ని తిరగు
గాలిపటము వేట కదులుకుంటు
యడుగులేసి పట్టి నలరించు బాలలు
బోగిమంట శుభము బొందినారు
అంబరాన నిలుచు హరిదాసు కీర్తన
కోడిపందెమాట కోట్లరాసి
సంబురాలు పంచు సంక్రాంతి పండుగ
పల్లెలందు తెలుగు పసిడి వెలుగు
మకరకాంతి నొంద మహినందు స్వాములు
శబరి జేరినారు జాతరగను
గగన దివ్వెజూసి గణముగా అయ్యప్ప
మాల విడిచుచుండు మాన్యులంత
సంక్రాంతి తోరణాలు: --ఉండ్రాళ్ళ రాజేశం