"క్షత్రబంధు..!": --సుజాత.పి.వి.ఎల్.


 పూర్వము క్షత్రబంధు అనే రాజు ఉండేవాడు. అతడు ఒక రోజు రాజ్యపర్యటన చేయసాగాడు. ఊరి చివర ఒక కడజాతి వాడు పోతున్న సమయంలో పక్కనే ఉన్న బ్రాహ్మణుడి పొలములో నుండి ధాన్యపు గింజలు ఎగిరి పడుతున్నాయి. కడజాతి వాడు నేర్పుగా ఆ గింజలు మీద పడకుండా వెళ్ళసాగాడు. రాజు ఆ కడజాతి వాడిని పిలిచి నీవు ఎందుకు ఆ ధాన్యపు గింజలు మీద పడకుండా వెళుతున్నావు అని అడిగాడు. కడజాతి వాడు అయ్యా పూర్వజన్మలో నేను బ్రాహ్మణ కుమారుడను. బ్రహ్మచర్య వ్రతమును నిష్టతో ఆచరిస్తున్నాను. ఒక రోజు భిక్షాటన చేసి భిక్ష తెచ్చి ఒక నది ఒడ్డున కూర్చుని ఆ భిక్ష తినసాగాను. ఆ పక్కనే ఒక బ్రాహ్మణుడి పొలము ఉంది. గాలి బలంగా వీచడం వలన ఆ పొలంలో నుండి వచ్చిన ధూళి నేను తినబోయే అన్నము మీద దట్టంగా పడింది. ఆ విషయము తెలియని నేను ఆన్నము భుజించాను. ఆ కారణంగా నేను ఈ జన్మలో కడజాతి వాడిగా పుట్టాను. నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము కారణంగా నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు ఒక బ్రాహ్మణుడు కనిపించి రేపు క్షత్రబంధు అనే రాజుతో చేయబోయే సంవాదంతో నీకు కలిగిన కష్టం తొలగిపోతుంది అని చెప్పాడు. ఆ స్వప్న ఫలితంగా మీరు నాకు కనిపించారు అని చెప్పాడు. తరువాత ఆ కడజాతి వాడు మరణించి ఉత్తమ గతులు పొందాడు అని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.