అడ్డుగోడలు(కథానిక)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

  "సుశీ! ఏం చేస్తున్నావు?" అంటూ ప్రవేశించాడు ఆనందరావు ఇంట్లోకి.అప్పటికే మంచి పాతపాటలు వింటూ ఆనందడోలికల్లో తేలిపోతున్న సుశీల,భర్త పిలుపు విని ఎదురొచ్చింది.ఆమె చేతిలోని‌ సెల్ ఫోన్ నుండి వస్తున్న పాటలు విన్పిస్తుంటే,ఆనందరావు కూడా నవ్వుతూ గొంతు కలిపాడు.ఆమె అతని‌ చేతిలోని బ్యాగు తీసుకొని,సెల్ ఫోన్ ఆఫ్ చేసి,వంటగదిలోకి వెళ్ళింది.
      ఆనందరావు బాత్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు.వేడివేడి కాఫీతో,అంతకుముందే చేసి ఉంచిన చిరుతిండితో సహా వచ్చి బాల్కనీలో చెట్ల మధ్య,ఊగే బల్ల మీద కూర్చొని ఇద్దరూ తింటున్నారు."ఏమండీ!ఈరోజు మా‌ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది తెలుసా?"అన్నది.దానికిఆనందరావు"అదేంటి సుశీ! రోజూ మాట్లాడుకుంటారు కదా?"అన్నాడు."అబ్బా!అది కాదండీ!ఈరోజు ఒక‌ సంతోష వార్తతో ఫోన్ వచ్చింది "అన్నది సుశీల." ఓహో! అలాగా!ఏమిటది?"అడిగాడు ఆనందరావు."మా చిన్నతమ్ముడికి పెళ్ళి కుదిరింది.రెండు నెలల్లో పెళ్ళి చేద్దామనుకుంటున్నారు"అని చెప్పింది. "ఓ!సూపర్! బావమరిదికి‌ పెళ్ళి అన్నమాట.ఎట్టకేలకు ఒప్పుకొన్నాడన్నమాట" అన్నాడు."అవునండీ 30 ఏళ్ళు దాటిపోయాయి‌ కదా! వాడికి ఎవరూ నచ్చడం లేదు కదా,జాతకాలు కుదరక కొన్ని ఇలా జరిగింది కదా" అన్నది."అవునవును" అన్నాడు ఆనందరావు. "మరి ఇప్పుడు ఏం మాయ జరిగింది" అడిగాడు కాఫీ ఆమె కందించి.తాను తాగుతూ."ఏం లేదండీ!వాడి చిన్నప్పటి ఫ్రెండే వాడికి నచ్చిన అమ్మాయి.ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళుతుంటాడు కదా!వారంతా కలిసి తిరుగుతారు కదా!వాళ్ళే" అన్నది.ఆశ్చర్యంగా ఆమెకేసి చూసి "అదేంటి? వారు వేరే కులానికి చెందినవారు కదా!మీ నాన్న ఒప్పుకొన్నారా?" అన్నాడు."అదే సమస్య అండి!నాన్నగారికి ఇష్టంలేదు.కానీ వాడు చేస్తున్న ఆలస్యం వల్ల వాడికి నచ్చడం వల్ల,తేల్చిచెప్పడం వల్ల ఓకే"అన్నారు."శుభమ్" అన్నాడు ఆనందరావు."మనం వారం ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది"అన్నది సుశీల."అలాగే" అన్నాడు ఆనందరావు.
      సుశీల‌ వాళ్ళ నాన్నగారు వంశీకి చూడని సంబంధాలు లేవు.అన్నింటికీ ఎన్నో వంకలు పెడ్తూ కాలం గడిపేసేవాడు.ఈరోజు అసలు విషయం బయటపెట్టి,తల్లిదండ్రులను ఒప్పించాడు.అయితే అది చేయడానికి కొంత శ్రమ పడాల్సి వచ్చింది. మంచిహోదాలో ఉన్న నాన్నగారు ఏమంటారోనని బాధపడ్డాడు. ఎలాగైతేనేం ధైర్యం చేసి తాను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు.తెలిసిన అమ్మాయే.ఇంటికి వస్తూ,పోతూ ఉండేదే.అయినా మూడురోజులు గంభీరమైన వాతావరణం.అమ్మానాన్నలకు మధ్య చర్చలు.పెద్దన్నయ్యకు‌ వాళ్ళ కులంలోనే పెద్దింటి సంబంధం కుదిరి,గ్రాండ్ గా పెళ్ళివేడుకలు జరిగాయి.ఇప్పుడెలా?అనే సందేహం.కానీ అమ్మానాన్నలతో కూర్చొని‌ అన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడాడు వంశీ.వాళ్ళు కూడా కొడుకు శ్రేయస్సుకోరి,అతడి కోరికను‌ మన్నించారు.కానీ సమాజం ఏమంటుంది?బంధువర్గం ఏమంటుందోనని తర్జన భర్జన.కానీ చివరికి కొడుకు నిర్ణయాన్ని అతని సంతోషాన్నే బలపరచాడు సుశీల నాన్నగారు.
      అబ్బాయి,అమ్మాయి ఇద్దరూ పెద్ద,పెద్ద కంపెనీల్లో  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.మంచి సంపాదన.ఈ పాటికే స్థిరత్వం ఉంది.అన్నింటికీ మంచి కుటుంబం.మంచిగుణగణాలున్నాయి.తాను కొద్ది నెలల్లో రిటైర్ కాబోతున్నాడు‌.ఇవ్వన్నీ దృష్టిలో ఉంచుకొని ఓకే చేసారు.నేటికాలంలో గుణం,మంచి కుటుంబం ప్రధానం కానీ కులమేమిటి?అనుకున్నారు.ఆ సందిగ్ధం నుండి బయటికెళ్ళి నిశ్చయం చేసారు.పెద్దవాడికి చేసినట్లే ఏ మాత్రం తగ్గకుండా ఘనంగా వివాహం చేసారు.సుశీల,ఆనందరావులతో సహా కుటుంబమంతా సంతోషాలతో,వేడుకలతో చాలా బాగా వివాహం జరిగింది.
      సమాజంలో కులం కంటే గుణమే ప్రధానమని తెలుసుకోవాలి.చదువుకున్న సమాజం విచక్షణగా ప్రవర్తించాలి.మంచిమనసు,అర్థం చేసుకొనే అవగాహన,సొంతకాళ్ళ మీద నిలబడే తత్వం, ఆత్మగౌరవం ఉంటే చాలు.మారుతున్న కాలంలో‌ కుల,మతాల పట్టింపులు సమాజంలో పెద్ద అడ్డుగోడలను నిర్మిస్తాయి.కాలానుగుణంగా మంచే ప్రధానంగా నిర్ణయాలు మార్చుకోవలసి ఉంటుంది ‌అప్పుడే సమాజం సంతోషదాయకంగా మారి,అభివృద్ధి చెందుతుంది.