అలిశెట్టి అభిమానిని: - జగదీశ్ యామిజాల

 బి నర్సన్ గారన్నట్టు
పొట్టి కవితల గట్టి కలే కాదు అలిశెట్టి
సమాజంపై ఆయన సంధించిన
మాటల తూటాలన్నీ గన్ షాట్లే
బతకడానికి నేర్పూ ఓర్పూ ఉండాలని
తెలిసినా
ఎప్పుడూ నటించక
లౌక్యం జోలికి పోక
ఆత్మాభిమానానికి వీడక
ఆత్మస్థయిర్యంతోనే రచనలు చేసి
అందరి దృష్టినీ ఆకట్టుకున్న అలిశెట్టి
మాటలేవీ కాలక్షేపానికి రాసినవి కావు
అందరూ ఆలోచించవలసిన ఆణిముత్యాలవి
మాటల వాడుకలో మాంత్రికుడు అలిశెట్టి
నన్నిప్పటికీ ఎప్పటికీ ఔరా అనిపించిన
వేశ్య కవితతో అలిశెట్టి అభిమానిగా మారిన నాకు
ఆయన మాటలన్నీ తేలికవే కావచ్చు కానీ
భావాలన్నీ బరువైనవీ భారమైనవీ
కనుకే
చురకలతో
మాటల జెండాలతో
జనం మెచ్చిన కవిగా అందరి మదిలో నిలిచాడు
ఏడాదులు వేరు కావచ్చు కానీ
అలిశెట్టి జననమూ మరణమూ
జనవరి పన్నెండే
దేశమంతా యువజనోత్సవంగా
జరుపుకునే తేదీనాడే నాకిష్టమైన కవి అలిశెట్టి
స్మరణ సదా స్మరణీయం