అప్ప భాగ్యం చూసి చెల్లెలు చెయ్య విరగబడిందిట!
‘వనజ’, ‘శైలజ’ ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రావు గారు సెక్రెటేరియట్లో పని చేస్తారు. ఉన్నంతలో పిల్లలిద్దరినీ బాగానే చదివించారు. వయసు వచ్చాక ఇద్దరికీ తన స్తోమతుకి తగ్గట్లు పెళ్ళిళ్ళు చేశారు.
పెద్ద అల్లుడు ‘విజయ్’ పెళ్ళి నాటికి సెక్రెటేరియట్ లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను మంచి చురుకైనవాడు. పగలు ఆఫీస్ లో పని చూసుకుని సాయంత్రాలు కోచింగ్ కు వెళ్ళి’ గ్రూప్ వన్ సర్వీస్’ పరీక్షలు వ్రాసి అందులొ సెలెక్ట్ అయి ‘జాయింట్ కలెక్టర్’ గా పోస్టింగ్ తెచ్చుకున్నాడు.
ఇక చిన్నల్లుడు ‘వేణు’ లెక్చరర్ గా డిగ్రీ కాలేజ్ లో చేస్తున్నాడు. అతను ఉద్యోగం తప్ప వేరే ఆలోచనలేవీ లేకుండా ఉండే వాడు.
పెద్దమ్మాయి ‘వనజ’ కి ఇద్దరు మగ పిల్లలు. వాళ్ళిద్దరినీ మంచి చదువులే చదివించారు. కాబట్టి IAS ఆఫీసర్ల పిల్లలు ‘కోడళ్ళు’గా వచ్చారు.
చిన్నమ్మాయి ‘శైలజ’కి ఒక కూతురు, కొడుకు. కూతురు పెద్దది. తన చదువు అయిపోయాక పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ‘శైలజ’ కి ఒక పట్టాన ఏవీ నచ్చేవి కావు. పెళ్ళి కొడుకులని తన అక్క కొడుకులతో పోల్చుకుని అంతకు ఏ మాత్రం తక్కువ గా ఉన్నా వద్దని వేరేవి చూస్తూ ఉండేది.
సరే మొత్తానికి కూతురు చదువుకి, రూపానికి తగ్గ సంబంధం కుదుర్చుకున్నారు.
పెళ్ళి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని మగపెళ్ళి వారి కంటే ముందే తనే ఆర్భాటం, హంగామా చెయ్యటం మొదలు పట్టింది.
‘శైలజ’ భర్త ఆ లెక్చరర్ ఉద్యోగం తప్ప పెద్దగా ఆస్తిపాస్తులేమీ ఉన్న వాడు కాదు.
అందుకని మనకి తగ్గంతలో చేద్దాము, ఆడంబరాలకి పోవద్దు అన్ని పగ్గాలేసి భార్యని లాగుతూ ఉండే వాడు. హాల్ సెలెక్షన్ లో శైలజ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
‘మా అక్క వాళ్ళ వియ్యాల వారు IAS ఆఫీసర్స్, వాళ్ళ ముందు వెలితిగా ఉంటుంది. ఏదో ఒక హాల్ లోచేస్తే వాళ్ళకి మర్యాదలు సరిగా చెయ్యలేము, వాళ్ళూ ఏ మైనా అనుకుంటారు’ అని బోలెడు అద్దె పోసి ఒక పెద్ద గార్డెన్ సెలెక్ట్ చేసింది. దాని అద్దెకే 4-5 లక్షలు ఖర్చు అయింది. ఇక మిగిలినవన్నీ కూడా అదే స్థాయి లో నడిపించేటప్పటికి ‘వేణు’ అనుకున్న బడ్జెట్ చాలా ఎక్కువ అయి, దాచుకున్న ‘సేవింగ్స్ మొత్తం’ అయిపోయి పిల్ల వాడి పెళ్ళి కొంతకాలం పాటు వాయిదా వెయ్య వలసి వచ్చింది.
“ఇదండీ అప్ప భాగ్యం చూసి చెల్లెలు చెయ్యి విరగ పడితే” జరిగే పరిణామం!
* * *
సామెత కథ : బిందు మాధవి