సామెత కథ : బిందు మాధవి


 ఆశ లావు పీక సన్నం!


కార్తిక్‌కి ఎనిమిదేళ్ళు ఉంటాయి. వాళ్ళమ్మ వాడిని పగలు స్కూల్ అయ్యాక, సాయంత్రాలు వారంలో రెండు రోజులు ‘కరాటే’, రెండు రోజులు ‘పియానో’, ఒక రోజు ‘సంగీతం’ క్లాస్, ఒక రోజు ఏవో ఒక ‘క్రాఫ్ట్’ నేర్చుకునే ఏర్పాటు చేసింది.

వారాంతంలో ఒక రోజు పొద్దున్న ‘స్విమ్మింగ్’, ఒక రోజు ‘శ్లోక’ క్లాస్ ఉంటాయి.

పొద్దున్నే 7.30 కల్లా స్కూల్ బస్ వస్తుంది. పాపం జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఈ దిన చర్య అంతా నడవ వలసిందే. వాడికి స్కూల్ నించి వచ్చి కాసేపు గ్రౌండ్ లో ఆడుకునే అవకాశం లేదు.

ఎందుచేత అంటే కార్తిక్ వాళ్ళ అమ్మ ‘పావని’, నాన్న ‘రాజు’ ఉద్యోగాలకి వెళతారు.

పెద్దల అజమాయిషీ లేకుండా పిల్లల్ని ఒంటరిగా ప్లే గ్రౌండ్ కి పంపించగలిగే రోజులు కావు కదా మరి! కాబట్టి ఆట అనేది వాళ్ళ రోజు వారీ కార్యక్రమాల్లో భాగం కాదన్నమాట.

స్కూల్ నించి వచ్చి గబగబా తయారయి పైన చెప్పిన క్లాసులకి వెళతాడు.

వాళ్ళ అమ్ముమ్మ పిల్లల్ని చూసి వెళదామని ఊరునించి వచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ‘కార్తిక్’ దిన చర్య గురించిన ప్రస్తావన వచ్చింది. కార్తిక్ తల్లి ‘పావని’ తన తల్లితో, ‘అమ్మా మధ్యాహ్నం 3.30 కి స్కూల్ నించి వస్తాడు, కాస్త పెరుగన్నం పెట్టు, నేను ఆఫీస్ నించి వచ్చి వాడిని కరాటే క్లాస్ కి తీసుకెళ్తాను’ అనిచెప్పింది.

పావని తల్లి ‘పద్మ’ ,మనవడు స్కూల్ నించి రావటం కోసం ఎదురుచూస్తున్నది. 3.30 కి స్కూల్ బస్ వచ్చి వాడిని ఇంటి దగ్గర దింపి వెళ్ళింది. వాడు వస్తూనే మొహం వేళ్ళాడేసుకు వచ్చాడు. లోపలికి తీసుకొచ్చి పెరుగు అన్నం పెట్టి చెయ్యి కడుక్కు వచ్చేటప్పటికి వాడు నిద్రలోకి జారిపోయాడు.

సాయంత్రం ‘పావని’ ఆఫీస్ నించి వచ్చి కాస్త ఫ్రెష్ అయి ‘కార్తీక్ త్వరగా తెములు, కరాటే క్లాస్ కి వెళదామని’ కేకేసింది. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు.

‘ఇప్పుడు నిద్రేమిటి, మళ్ళీ రాత్రికి పడుకోవు’ అని గట్టిగా పిల్చింది. ఇదంతా చూస్తున్న పావని తల్లి పద్మ, ‘వాడు స్కూల్ నించి వచ్చేటప్పుడే బాగా అలిసిపోయి ఉన్నాడు, కాస్సేపు పడుకోనీ’ అంది.

‘అయినా వాడికి ఇంకా బొడ్డూడలేదు, ఇన్ని రకాల వ్యాపకాలా? ఓ ఆట లేదు, విశ్రాంతి లేదు, అలా వాడిని చెండుకు తినేస్తున్నారు, ఇప్పుడే వాడు అంతర్జాతీయ పోటీలకి ఏమైనా వెళ్ళాలా’ అని అరిచింది.

"ఆశ లావు పీక సన్నం" అంటే ఇదే, ‘పిల్లలకి బుద్ధి వికసించి, వారికి ఏది ఇష్టమో గుర్తించటానికి టైం పడుతుంది, అసలు అంత టైం ఈ కాలపు పిల్లలకి ఇస్తున్నారా’ అని అడిగింది.

‘మీ వీలు కోసం వారిని ‘గడియారం లో ముల్లు’ లాగా తయారు చేస్తున్నారు’ అన్నది. ‘మీరు చిన్నప్పుడు కింద సెల్లార్ లో మిగిలిన పిల్లలతో కలిసి ఒళ్ళు అలిసిపోయే వరకు ఆడుకుని, అప్పుడు వచ్చి స్నానాలు చేసి హోం వర్కులు చేసుకునే వారు’, అని వాళ్ళ చిన్న తనం గుర్తు చేసింది.

ఈ కాలం లో పిల్లలని మరీ మరబొమ్మల లాగా తయారు చేస్తున్నారు అని కేకలేసింది.

‘ఏదో వేసవి సెలవుల్లో ఆ రెండు నెలలు ఈ కరాటేలు, సంగీతాలు నేర్పించవచ్చు. అసలు ఏ విద్య అయినా వాళ్ళకి సాధన చేసే టైం ఎక్కడ ఉన్నది, ఒకదాని వెనక ఒకటి తరుముతుంటే’ అన్నది పద్మ .

అసలు ఆటలు అనేవి లేక పోతే పిల్లల్లో గెలుపు ఓటములు అనేవి తెలియవు. తను ఓడిపోయినప్పుడు ఎలా కృషి చేసి మళ్ళీ గెలుపు సాధించాలి, గెలిచిన వాడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉండదు’ అని చెప్పింది. ‘ఈ కారణాల వల్లే చిన్న చిన్న ఓటములు కూడా భరించలేక ఆత్మహత్యలు చేసుకునేటంత సున్నితంగా నేటి పిల్లలు తయారవుతున్నారు’ అని చెప్పింది.

‘పిల్లలకి ‘వక్తృత్వ పోటీలు’- ‘బుద్ధి వికసనానికి’, ‘పరుగెత్తి ఆడే ఆటలు’- ‘శరీర దారుఢ్యానికి’ ఉపయోగ పడతాయి. అలా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారేమో, మీ కాంప్లెక్స్ లో ఉన్న తల్లులందరూ కలిసి వాకబు చేసి కనుక్కుని ఆ ప్రయత్నం మొదలుపెడితే పిల్లలకి ఉపయోగపడుతుంది’ అని సలహా ఇచ్చింది పద్మ.

‘మీ పరిచయస్తుల్లో చదువులు అయిపోయి ఇంకా ఉద్యోగాలు దొరక్క ఉన్న యువకులెవరైనా ఉంటే వారి సహాయం తీసుకుని, పిల్లలని ఇళ్ళ దగ్గరే ఆడించే ప్రయత్నం చెయ్యండి’ అని చెప్పింది పద్మ.

ఈ సుదీర్ఘమైన ఉపన్యాసం విన్న పావని, తల్లితో

‘అమ్మా మాకేమో ఉద్యోగాలు చెయ్యక తప్పదు, ఇప్పుడు వస్తున్న టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ లవల్ల పిల్లలు - పెద్దలు ఇళ్ళల్లో లేనప్పుడు వీడియోగేమ్స్‌కి అలవాటు పడుతున్నారు, అవి మరీ ప్రమాదం, వాటిని తప్పించటానికి ఇలా సాయంత్రపు వ్యాపకాలు పెట్టక తప్పట్లేదు’ అని చెప్పింది.

‘అయినా నువ్వు చెప్పింది కూడా మిగిలిన వాళ్ళతో చెప్పి అందరం కలిసి ఆలోచిస్తాము’ అని చెప్పింది పావని.