గుడ్మార్నింగ్ (131 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'మామూలుగా' ఉండటం గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? కానీ, తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన విషయం!
'మామూలు' గా అంటే? సాధారణంగా అని! సాధారణంగా అంటే? నిదానంగా అని ! కాస్తా నెమ్మదిగా అని!
'మానసికంగా ' మామూలుగా ఉండటం గురించి!
ఉద్వేగాలకు రాగద్వేషాలకు లోను కాకుండా ఉండటం గురించి! ఉద్వేగాలు అంటే ఎమోషన్స్ కద!?వాటిని దీర్ఘకాలంలో శరీరం భరించలేదు- శిధిలమౌతుంది!
తల్లిదండ్రులు కన్నబిడ్డలు తోబుట్టువులు స్నేహితులు వగైరా దగ్గర సంబంధాల వారు మరణించిన సందర్భాలలో- చదువుల్లో ఏవో ఫస్ట్ క్లాస్ లు వస్తేనో లేదా ఫెయిల్ అయితేనో , చిన్నా పెద్దా ఉద్యోగాలు దొరికితేనో,లేదా ఉన్నవి పోతేనో,విపరీతంగా వ్యాపార లాభాలు వచ్చినందుకో, నష్టాలు వచ్చినందుకో ,పెళ్లిళ్లకు పుట్టిన రోజులకు కలయికలకు వీడ్కోల్లకు ఇలా ఓ మనిషి జీవితంలో ఎదురయ్యే ఎన్నో విషయాలకు కలవరపడతారు- పొయ్యి మీద ఎసరు లాగా కలెపెలలాడతారు -పొంగిపొరలి పోతారు!
సంతోషం దుఃఖం కోపం శాంతం ద్వేషం భయం ఈర్ష్య వంటి , ఏడో తొమ్మిదో మౌలిక భావాలు మనిషిలో ఉంటాయని చెప్తుంటారు కద!? వాటిని 'ఇన్స్టింక్స్' అంటారు కద' మానవ సహజాతాలు' అని కద తెలుగులో!
అంటే మనిషి పుటుకతో పాటు మనిషిలో ఉండేవి అవన్నీ అని కద!?
అవే అనేక షేడ్స్ తో అనేక సందర్భాలలో వ్యక్తం అవుతాయి కద!? 
'మానవ సహజాతాలు' నిజమే కానీ, అవి అన్ని సమాజాలలో ఒకే విధంగా లేవు మరి? ఎందుకు??
'మనిషి ఉద్వేగాల పుట్ట' అని ఎవరో ఎప్పుడో రాయగా చదివిన జ్ఞాపకం ఉంది నాకు! ఔనా అనుకున్నాను!
మనిషి తత్వం మాటల్లో బయట పడుతుంది!
ఇంటా బయటా, ఎడ్ల నాగలి కాలపు గ్రామీణ సమాజంలో
పారిశ్రామిక ప్రాంతంలో ,పట్టణాలలో పరికించి చూసాను.
అదే విధంగా ట్రైబల్ పీపుల్ని కూడా గమనించాను.
ట్రైబల్ పీపుల్ అంటే తెలుగు సినిమాలు తెలియని పీపుల్ అని స్పష్టంగా చెప్తున్నాను!
అటువంటి వారిలో విపరీతమైన ఎమోషన్స్ కనపడలేదు!
వారు మామూలు ముఖాలతో ఉంటారు! వారి ముఖాలలో ఏ ప్రత్యేక భావాలు కనపడవు!వారి జీవితాలు ఎంత సరళంగా ఉంటాయో,వారి మొహాల్లో కూడా అదే సరళత్వం కనిపిస్తుంది!
మళ్లీ పాత గ్రామీణ సమాపు ప్రజల మొహాల్లో కనిపించే సంక్లిష్టత పారిశ్రామిక ప్రాంత ప్రజల మొహాల్లో కనిపించే పరమ సంక్లిష్టత , ట్రైబల్ పీపుల్ మొహాల్లో కనపడదు! ఉన్నదేదే ఉన్నట్టు కనపడతారు వారు! సరళంగా కనపడతారు!
ఆధునిక మానవులు కావాలని తెచ్చిపెట్టుకున్న జీవనవిధానపు సంక్లిష్టత ,ఆధునిక మానవుల మొహాల్లో ద్యోతకం అవుతుంది! ఓ నలబై సంవత్సరాల వయసు దాటిన ప్రతీ మనిషి మొహం స్పష్టంగా ఆ మనిషి ప్రధాన మనస్తత్వాన్ని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది! అదే భావంతో మొహం గిడసబారుతుంది!
గిరిజన ప్రజల మొహాల్లో అటువంటి 'గిడస' తక్కువ!
ఓ వెయ్యి సంవత్సరాల పాటు మన సమాజంలో విపరీతంగా మతాల ప్రచారం జరిగింది! విపరీతమైన భావాలను కలిగించడం అన్నమాట!
గత డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఎన్నికలలో గెలవడానికి రాజకీయ పార్టీలు అంతే విపరీతంగా తమతమ రాజకీయ సిద్దాంతాలను ప్రజల్లో విపరీతంగా ప్రవేశ పెడుతున్నారు!
తెలుగు సినిమా సాహిత్యం వగైరా కూడా అలాగే ఆయా భావజాలాలను మోస్తూ ఉన్నాయి!
ఆదిమ సమాజపు మనుషుల్లో ఇన్ని భావాలు లేవు- వారి మొహాల్లో ఇంత సంక్లిష్టత లేదు- ఆ జంతువుల వలె 
ఈ పక్షుల వలె నిదానంగా ప్రశాంతంగా ప్రసన్నంగా సరళంగా సుందరంగా దృఢంగా ఉండేవి!
మనం ఎందుకు అలా ఉండటం లేదు? ఎవరు మనల్ని అలా చేస్తున్నారు? అయితే మన విజ్ఞత ఏమవుతోంది?
ఎక్కడో దూర దేశం నుండి మీ మనవడు లేదా మనవరాలు వచ్చిందా? కూల్ కూల్ - ఎగిరి గంతులు వెయ్యకండి.మామూలుగా ఉండండి. ఒకసారి వెనక్కి తిరిగి మీ అమ్మమ్మనో తాతమ్మనో గుర్తుకు తెచ్చుకోండి.వారి పట్ల మీరు ఏ ప్రేమలను వడ్డించారు?
మీ మనవడి చేతనో మనవరాలి చేతనో ఆ దీనంగా ఆకలితో చూస్తున్న ఆ వీధికుక్కకు పిడికెడు అన్నము పెట్టించండి- అది చాలు! 
సదాచరణ లేనివారిలో ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి!
మనకు వన్ సైడ్ ప్రేమలను అలవాటు చేసారు- సినిమాలు సాహిత్యం వగైరా- వాళ్ల వాళ్ల వర్గాల మతాల రాజకీయాల ప్రయోజనాల కోసం ఆయా భావాలను మనకు నూరిపోసారు- మనలో లేని అనవసర ఉద్వేగాలను నింపారు- తెలుగు సినిమాలు రాకముందు ప్రేమలు లేవు! ఉన్నవి 'అవసరాలు' మాత్రమే!
మామూలుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి!
మామూలుగా ఉండటం గురించి చర్చలు చెయ్యాలి!
అన్ని జీవుల్లో మనల్ని మనమే దర్శించాలి!
మనవాళ్ల మొహాలను ,జీవుల మొహాల్లో చూడగలగాలి!
మామూలుగా ఉండటం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి! అర్ధాంతర మరణాలు ఆగడానికి, మనం మామూలుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి!
అటువంటి శాంతమూర్తులను గుర్తించాలి- వారిని అనుసరించాలి! అటువంటి వారు మన మధ్య కూడా అక్కడక్కడ కనపడతారు! వారిని గుర్తించగలగాలి- ఉద్వేగాల విషయంలో మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యాలి!
ప్రాకృతిక జీవితం అంటే ,బ్యాలెన్స్డ్ గా  ఉండటం!