గుడ్మార్నింగ్ -(132 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మనలో భయం ఉంటే ఏమవుతుంది? భయం ఎందుకు కలుగుతుంది? కలిగితే ఏమేమి అవుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి?
అసలు భయం అనేది ఎందుకు ఉంటుంది? పుటుకతోనే అది మనతో వస్తుందా? లేదా పెద్దలు మనకు కల్పిస్తారా?
భయం అనేది ప్రాణి సహజాత గుణాలలో ఒకటని కొందరు అంటూ ఉంటారు! కానీ కొందరు భయరహితులను చూస్తూ ఉంటే అది పూర్తిగా నిజం కాదనిపిస్తూ ఉంటుంది!
మనిషి జన్మించినప్పటి నుండి మరణించేదాకా,మధ్య జీవితంలో అనేక దశలు ఉంటాయి కద- అవ్వన్నీ దాటాలి కద? బాల్యం నుండి పడుతూ లేస్తూ నడక నేర్చుకునే దశ నుండి ఎన్నో జాగ్రత్తలను నేర్పుతూ ఉంటారు పెద్దవారు!
జాగ్రత్తలకు భయాలకు మధ్య సన్నని సరిహద్దు రేఖ ఉంటుంది! దాన్ని గుర్తించడంలో ఏమరుపాటుకు లోనైయ్యామా ఇక జీవితం పొడుగునా బ్రతుకు భయం ఒకటి ప్రారంభం అయి మనతో పాటే పెరుగుతూ మనల్ని అనుక్షణం జాగ్రత్తల పేరుతో భయపెడుతూ వస్తూ ఉంటుంది! చదువుల్లో పాస్ అవుతామో లేదో అనే భయం- ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే భయం- వ్యాపారం ప్రారంభించాలంటే నష్టం వస్తుందో ఏమో అనే భయం,కార్యాలయాల్లో అధికారిని చూస్తే భయం, బజారులో ట్రాఫిక్ నియంత్రణ పోలీసును చూస్తే భయం, ఉన్న ఉద్యోగం పోతే ఎలా అనే భయం, ప్రయాణాలు చెయ్యాలంటే ఏదో భయం, బ్రతుకు భయం, చావు భయం, భర్త భయం,భార్య భయం,ఒకే సంతానంతో సరిపెట్టుకుంటే ఎలా అనే భయం - విడాకులు ఇవ్వాలంటే భయం, ఇండిపెండెంటుగా బ్రతకాలంటే భయం- రాజకీయాల్లోని అవినీతిని విమర్శించాలంటే మరీ భయం!
మనలో భయం పెరిగి పెరిగి అది మన పిల్లల్లోకి కూడా బట్వాడా అవుతుంది- వాళ్లను 'అది చెయ్యొద్దు- ఇది చెయ్యొద్దు- ప్రమాదం' అని భయపడుతూ ,భయపెడుతూ ఉంటాం! భయం అనేది చివరకు ఓ చాదస్తం లాగా మారి,
 ఓ మానసిక వ్యాధిలాగా దిగజారుతుంది. చాలా రకాల మానసిక వ్యాధులకు , మనలో అంతర్గతంగా ఉన్న భయమే  కారణం!
నిత్యం అనేక విషయాలకు భయపడేవారు, భయం లేకుండా ముందుకు పోతున్నవారిని వెనక్కు కూడా లాగుతారు- అశుభాలు పలుకుతారు! చుట్టూ భయస్ధులు ఉన్న సమాజంలో ,నిర్భయులు ఒంటరి వారౌతారు!నియంతల పని‌ సులభం అవుతుంది!
సామాజిక మార్పకు అందరూ అవరోధం అవుతారు!
మీరు ఎప్పుడైనా జంతువులను పక్షులను గమనించారా?
వాటిలో భయం ఉండదు,జాగ్రత్త మాత్రమే ఉంటుంది!
పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తే తప్పుకుంటాయి! అది భయం కాదు- జాగ్రత్త అది!
ఆధునిక యుగంలో భయం పెరుగుతోంది!
అదంతా ప్రభుత్వాల చలవ- వాటిని నడిపే రాజకీయ పార్టీల చలవ- వాటి ముఖ్యనాయకుల నియంతృత్వ వైఖరి కారణం! 
ఏ సమాజం అయితే భయంలో ఉంటుందో, అక్కడ నియంతృత్వ పాలన ఉంది అని అర్ధం!
మనలో భయం అనేది ఉంటే, మనం అనేక విషయాలకు భయపడవలసి ఉంటుంది!
భయపడే వారు నిత్యం మరణిస్తే, ధైర్యం కలవారు చివరికి మరణిస్తారు!
భయాన్ని జయించిన వారు, జీవితాన్ని జయిస్తారు!