గుడ్మార్నింగ్ (133 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 పేదరికం అంటే ఏమిటి? ఎవరిని పేదలు అనాలి?
ఎందువల్ల పేదలు అవుతారు? అందుకు కారణాలు ఏమిటి?
ధనికులు అంటే ఏమిటి? ఎవరిని ధనికులు అనాలి?
ఎందువల్ల ధనికులు అవుతారు? అందుకు కారణాలు ఏమిటి?
మన ఇంటికి పునాదులు తవ్వేవారు- మన ఇంటి నిర్మాణానికి ఇటుకలు సిమెంట్ వగైరా మోసేవారు- బండలు పరిచేవారు- రంగులు వగైరా వేసేవారు- ఒక ఆధునిక గృహ నిర్మాణానికి ఎన్ని రకాల పనులు అవసరం అవుతాయో- దాదాపుగా పాతిక రకాల పనివారు అవసరం అవుతారు- అందులో ఇంజనీర్  హెడ్ మేస్త్రీ మినహా తక్కిన వారందరూ మనలాగా మనలాంటి ఇండ్లలో ఎన్నటికీ ఉండలేరు- మనం ఉండనీయం- పేదరికం అంటే అదీ!
ఇంకా ఇలా చాలా రంగాలలో- అనేక వస్తూత్పత్తి పరిశ్రమలలో క్వారీలలో లక్షలాది మంది శ్రామికులు - మన దేశంలో ప్రస్తుతం ఉన్న నూటా ముప్పై కోట్ల మందిలో సుమారు ఓ యాబై కోట్ల మంది అయినా ఇలా ఉండి ఉండవచ్చు- రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ, కనీస అవసరాలు తీరవు- గ్రామాలలో పొలాలలో పనులు చేస్తుంటారు- వారిది పేదరికం!
వారికీ ఖర్చు చెయ్యాలనే ఉంటుంది, కానీ చేతినిండా డబ్బు ఉండదు!మనం ఇవ్వం!
ఎందుకని? ఇంకా వారి శ్రమ చవకగా దొరుకుతోంది కాబట్టి!
కనీస అవసరాలు వేరు,సౌకర్యాలు వేరు- సుఖజీవనం వేరు! బాగా అర్థం చేసుకోవాలి సుమా! మనం పదాలను ఇష్టం వచ్చినట్లు వాడుతుంటాం!
మధ్యతరగతిలో ఉన్న వారిది సౌకర్యవంతమైన జీవనవిధాం! ధనవంతులది సుఖ జీవనశైలి!
ధనవంతులు ఎవరు? ఎలా అవుతారు? 
క్రమంగా పాలక వ్యవస్థలో భాగం అయినవారు,దాని మీద ఒత్తిడి తెచ్చి ఆదాయాలు అవకాశాలు పెంచుకుంటారు- మధ్యతరగతి అంటే ప్రధానంగా ఇదే! మెడిసిన్ ఇంజనీరింగ్ వగైరా ఉన్నత చదువుల అవకాశాల మీద ఈ వర్గానికే గ్రిప్ ఉంటుంది!
ఇష్టం ఉన్నవారల్లా అటువంటి చదువులు చదువుకునే అవకాశం లేకుండా ,తగిన కట్టుదిట్టాలు ప్రధాన పాలకవర్గంతో కలిసి చేస్తూ ఉంటారు!
వ్యవస్థ ద్వారా అవకాశాలు చేజిక్కిచ్చుకుంటారు- తాము టాక్స్ లు కడుతుంటేనే దేశ శ్రామికులకు పూట గడుస్తుందనే వెర్రి భ్రమల్లో ఉంటారు- సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేస్తారు- మార్కెట్ ద్వారా అమ్మకం కొనుగోలు చేసే ప్రతీ రూపాయి మీద ప్రభుత్వానికి పన్నులు వెళతాయి.మార్కెట్ లో వస్తువులు కొనకుండా కనీస అవసరాలు తీర్చుకునే పేదలకు కూడా గడవదు! వారి రెక్కల కష్టం మీద కూడా దాని ఆదాయం మీద కూడా పరోక్షంగా పన్నులు వసూలు చేస్తారు!
పనులు చేసేవారు- వస్తువులను కొనే వారు, అందరూ పన్నులు కడతారు!
ధనికులు అవడానికి కారణం వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం అసలైన కారణం- పొదుపు చెయ్యడం వల్ల అదానీ అంబానీ టాటా బిర్లా దాల్మియా వగైరా ధనవంతులు అవలేదు!
ధనవంతులు అంటే? తమ సౌకర్యవంతమైన జీవితానికి మించి సంపాదించేవారు- వారందరూ ధనికులే!
పొదుపు చేసే వారు మహా అయితే, కాస్తా సౌకర్యంగా బ్రతుకుతారు! ధనవంతులు అవరు!
ఓ మధ్యతరగతి పెళ్ళి విందులో గమనించాలి- ఎంత ఆహారాన్ని తినలేక పారేస్తారో? దుబారా అంటే అదీ!
ఒక్కొక్క ఇంటి బీరువాల్లో ఎన్ని జతల బట్టలు ఉంటాయే?
ఓ తెలుగు సినిమా దర్శకుడు వేసుకున్న డ్రస్ ను , తిరిగి వేసుకోడట- దాన్ని ప్రచారం చేస్తుంటారు- దాన్ని ఆరాధనగా చూస్తుంటారు- అదీ అసలైన దుబారా! డబ్బు ఎక్కువ వస్తోంది కనుక దుబారా ఎక్కువ ఉంటుంది!
ఓ సినిమా నిర్మాణంలో ఓ రెండు వందల మంది రకరకాల పనివారు పాల్గొంటారు! అందులో హీరో హీరోయిన్లకు దర్శకుడికి ఇతర ముగ్గురు నలుగురు పనివారికి మినహా తక్కిన చాలా మందికి ఇచ్చేది దినసరి వ్యవసాయ కూలికి ఇచ్చేదాని కంటే తక్కువ ఇస్తారు- ఎందరు శ్రమ పడితే,డబ్బు ఎవరికి పోతోంది? ఇలాగే మీరు సమాజంలో చాలా రంగాలను గమనించాలి!
పొదుపు చేసో పిసినారి తనం వల్లనో, పెద్దపెద్ద నగల వర్తకులు కాలేరు- పనివారికి తక్కువ ఇచ్చి, కొనుగోలుదార్ల దగ్గర ఎక్కువ తీసుకుని ,పెద్దపెద్ద వర్తకులు అవుతారు!
ఈ దేశంలో అధిక జనాభా ఉంది కనుక, శ్రామిక శక్తి చవక!
ధనికులు అవడానికి, పేదలు అవడానికి అదే కారణం!
దానికి వ్యవస్థ సపోర్ట్ ఉంటుంది!
'సంపన్నులను మించిన దోపిడీ దార్లు లేరు' అని ఒక కొటేషన్ రాస్తే ఓ సంపన్నుడికి చాలా కోపం వచ్చింది!
తక్కువ ఆదాయాల వల్ల పేదలు పొదుపుగా ఉంటారు, 
ఎక్కువ ఆదాయాల వల్ల ధనుకులు దుబారా చేస్తారు!
కాదంటే, ఎప్పుడైనా మీరు ఏ మధ్యతరగతి పెళ్లికైనా వెళ్లినప్పుడు భోజనాల సన్నివేశాలను చూడండి- వెజ్జ నాన్ వెజ్ , ఎన్నెన్ని రకాల తిండి పదార్థాలు ఉంటాయో- ఎలా ఎగబడతారో- ఎన్నెన్ని పదార్థాలను పళ్లాలలో పెట్టుకుంటారో- అందులో ఎంత తింటారో- ఎంత పళ్లెంతో సహా చెత్తబుట్టల్లో వేస్తారో!?
ధనికులు అనగా ఎవరు? ఎట్ల అయ్యెదరు?
పేదలు అనగా ఎవరు? ఎట్లా అవుతారు అట్ల?
ఎందరికో ఇవ్వవలసినంత ఇవ్వక,కొందరు ధనవంతులు అవుతారు!
'సంపదంతా,దొంగిలింతే " అని,  ప్రౌధాన్ అనే తత్వవేత్త ఎన్నడో అనిపొయ్యాడు! ఆయన మన మహాత్మాగాంధీ గారికి ఓ గురువు!