గుడ్మార్నింగ్ (138 వ రోజు): - తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'సాధన' అనేది ,నిరంతరం సాగవలసిన విషయం!
ఏదో ఒక కారణంగా ఒకరోజు సాధన ఆగిందో,తిరిగి రెండో రోజు సాధన చెయ్యాలని అనిపించదు! తప్పించుకోవాలని చూస్తాం,సాకులు వెదుకుతాం!
విధిలేక మనల్ని మనం కూడదీసుకుని తిరిగి సాధనలోకి ప్రవేశ పెట్టుకుంటాం- నిత్య సాధన ఉంటేనే,విద్య మన చేతిలో ఉంటుంది! లేకపోతే తెగిపోతుంది! రాట్నం వడికేటప్పుడు దారం తెగుతుంది,తిరిగి అతుకు పెట్టుకుని ఏకును వడకడం వంటిదే జీవితం కూడా!
ఒకరోజు ఉద్యోగానికి వెళ్లలేదా? స్కూల్ ,కాలేజ్ ,ఫ్యాక్టరీ, గని,ఇతర వ్యాపార వ్యవహారాలు వ్యవసాయం పెరటితోట మిద్దెతోట ఏవైనా సరే, లేదా ఏదైనా సంగీత సాహిత్య చిత్రలేఖణ నాట్య సంబంధిత విద్యలైనా సరే,ఒకరోజు ఏదో ఒక కారణంగా సాధన ఆపారనుకోండి-వెళ్లలేదు అనుకోండి- తెల్లవారి కూడా సాధన చెయ్యాలి అనిపించదు- వెళ్లాలి అనిపించదు! నిన్నటి లాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది- ఇక తిరిగి వెళ్లాలంటే మనసు మొండికేస్తుంది!
మనసు'డిరెయిల్మెంటు' జరిగిన ట్రైన్ తీరుగా అవుతుంది!
పని నుండి లేదా సాధన నుండి మనల్ని మనం ఏదో ఒక కారణంగా ట్రాక్ నుండి పక్కకు దింపేస్తే , కొందరు రోజుల తరబడి అలాగే ఉండిపోతారు- రేపు మాపు అనుకుంటూ రోజులను పొడిగిస్తూ, మనసులో క్రైసెస్ ను కూడా పెంచుకుంటూ ,రోజుకు రోజు ఒకరకమైన సిక్ నెస్ కు లోనౌతారు- వారికి మరొకరి సహాయం కూడా అవసరం అయ్యో దుస్ధితి వస్తుంది! వారిని తిరిగి ట్రాక్ ఎక్కించడానికి
సున్నితంగా వ్యవహారం చెయ్యవలసి ఉంటుంది. 
క్లాస్ మెట్లు ,కోలీగ్స్ ,స్నేహితులు, దగ్గరి బంధువులు సాధారణంగా అటువంటి సహాయాలు చేస్తూ ఉంటారు!
అది ఏ రకం పని అయినా, సాధన అయినా ఏదో ఒక విధంగా నిత్య సాధనలో ఉంచుకోవాలి. రెండో ఆలోచన ఉండకూడదు! ఉంటే అది అంతశ్శతృవు లాంటిది అవుతుంది! వెళ్లాలా? వెళ్లాలి! సెకెండ్ థింకింగ్ చెయ్యకూడదు! కళ్లుమూసుకుని గుడ్డెద్దులాగా ముళ్ల కంచెలో కొమ్ములు దూర్చి ,దారి చేసుకుని చేనులోకి ప్రవేశించాలి! లేకపోతే మెంటల్ క్రైసెస్ పోదు! కొందరి విషయంలో తిరిగి ట్రాక్ ఎక్కడం అంత తీవ్రంగా ఉంటుంది!
ట్రాక్ అంటే? జీవన రహదారి! జీవిత ప్రయాణం!
సాధన అయినా, పని అయినా, ఒకసారి ఆగితే, తిరిగి ప్రారంభం చెయ్యడానికి మనసు మొరాయిస్తుంది- మనిషి ఎంత నాగరికత నేర్చినా,ఇంకా ఆదిమ సమాజపు లక్షణాలు కొన్ని పోలేదు! ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని వెదుక్కోవడం ఆ సమాజపు లక్షణం!
అలా నిరామయంగా ఏ పనీ చేయకుండా ఉండాలని అనుకోవడం పురాతన మనిషి లక్షణం!
కనుక ఒకరోజు సాధన తప్పితే, రెండో రోజు తిరిగి మనల్ని మనం సాధనలోకి ప్రవేశ పెట్టుకోవాలి!
'నో సెకెండ్ థింకింగ్' 
లేకపోతే పడిపోతాం- తిరిగి లేవం!
సాధనను విడిచిపెడితే,జీవనాన్ని విడిచిపెట్టినట్టు!
'సాధన చేయుమురా నరుడా' అని ఓ సినిమా కవి అన్నది కూడా ఇందుకే!