గుడ్మార్నింగ్ (142):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 ఇప్పుడు ఇండ్లూ టెలివిజన్ న్యూస్ ఛానెల్లు ఒకలాగే అయ్యాయి! ఒకటే వాదోపవాదాలు!సౌండ్ పొల్యూషన్ గురించి మనం ఎన్నటికి ఆలోచిస్తామో ఏమో?
కొందరు ఇంటా బయటా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు! మాట్లాడటం అనే కంటే వాదిస్తారు అనడం కరెక్ట్! నలుగురు కలిస్తే చాలు- అదెలా అవుద్ది? ఇదెలా అవుద్ది? నువ్వనేది కరెక్ట్ కాదు- అది తప్పు -ఇది తప్పు, ఇదే కరెక్ట్- నీ అభిప్రాయాలు సరైనవి కావు అంటూ, అక్కడికి తమ అభిప్రాయాలే కరెక్ట్ అన్నట్టుగా వాదిస్తూ ఉంటారు!తమ అభిప్రాయాలకు విరుద్ధమైన అభిప్రాయాలు ఎవరి నోట విన్నా,చదివినా కొందరు వెంటనే కాండ్రించి ఉమ్మి వేసినట్టుగా ,తమ అభిప్రాయాలను వాంతి చేసుకుంటూ ఉంటారు! అభిప్రాయ దుర్వాసన అన్నిటికంటే దుర్వాసన వేస్తుంది!
ఇతరుల అభిప్రాయాలను వినగానే, కొందరు రియాక్ట్ అవుతారు! వాటిని ఖండించేదాకా వారికి శాంతించదు!
అవతలి వైపు ఉన్న వారు తిరిగి ఖండిస్తే,బిపి పెంచుకుంటారు! చాలా మంది బ్లడ్ ప్రెషర్లకు అనవసర వాదోపవాదాలు చెయ్యడం కూడా ఓ ముఖ్యమైన కారణం!
ఉదయం లేచింది మొదలు కుటుంబాలలో కూడా వాదోపవాదాలు ప్రారంభం అవుతాయి- టెలివిజన్ చర్చలు కూడా ఇళ్లల్లో జరగడం ఎప్పుడో‌ ప్రారంభం అయింది!ఈ విపరీత చర్చా ధోరణి అటునుండి ఇటు వచ్చిందో- లేక ఇటునుండి అటు వెళ్లిందో ,ఇప్పుడు చెప్పడం కష్టం!
మనం గుర్తించడం లేదు! కొన్ని కుటుంబాలలో ఆ రోజు వంటలు ఏమేమి చెయ్యాలో - ఎలా చెయ్యాలో అనే విషయం మీద బోలెడు చర్చలు- అభిప్రాయ భేదాలు కోపాలు తాపాలు మామూలు అయ్యాయి!
ఒక ఇంట్లో నలుగురు కలిసి ఉండలేనన్ని అభిప్రాయ భేదాలు ఫామ్ అయ్యాయి!
మనకు గత పాతికా ముప్పై సంవత్సరాల నుండి టెలివిజన్ వార్తా ఛానెల్లు‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వాదోపవాదాలు అక్కడ కూడా ప్రారంభం అయ్యాయి- ఉదయాన్నే న్యూస్ ఛానల్స్ చూసి
చాలా మంది తమ పల్స్ రేట్లను పెంచుకుంటున్నారు!ఈ టాపిక్ మీద ఎవరైనా పరిశోధన చేసి ఓ డాక్టరేట్ పొందవచ్చు!
అటువైపు ఇటువైపు పోట్ల గిత్తల్లా వాదోపవాదాలు చేసే 
రాజకీయ పార్టీల స్పోక్స్ మెన్లు ఎవరైనా మారతారా? ఆ చర్చల మూలంగా? 
చిన్నపిల్లలు మినహా, మిగతా జనాలకు ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి! ఎవరి ఖండనల వల్ల ఎవరి అభిప్రాయాలు మారవు! అనవసర వాదోపవాదాలు!
అయిన వారి మధ్య చర్చలు, కానీ వారి మధ్య వాదోపవాదాలు! ఇంతకూ ఎవరు అయిన వారు? ఎవరు కానివారు? ఇదో జీవితమంత పెద్ద ప్రశ్న!
మనం తాత్విక సమస్యల పరిష్కారానికి, మానసిక కోణంలో పరిష్కారాలు వెదుకుతున్నాం!వృథా ప్రయాస!
విరుద్ద భావజాలాల మధ్య ,వాదోపవాదాలు వృథా!
ఎవరూ మారరు- విని ఊరుకోవడం అంత ఉత్తమం, మరేదీ లేదు! 'మౌనమే నీ భాష , ఓ మూగ మనసా ' అని 
మన పూర్వ సినిమా కవి అన్నది ఇందుకే!
ఎవరి అభిప్రాయాల ప్రకటనకైనా వారి వారి పేస్ బుక్ వాల్స్ ఉన్నాయి కద! మళ్ళీ ఇతరుల వాల్స్ మీదికి వెళ్లి బిపి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలి? మెడపట్టి ఎందుకు బయటకు దొబ్బిచ్చుకోవాలి?
ఈ వాదోపవాదాలు అన్నీ 'నీ అభిప్రాయం తప్పు ' అన్నదగ్గర మొదలై 'నువ్వెంతా ?' అంటే' నువ్వెంత? అనే దాకా పోయి ' నీ అంతు చూస్తా' అంటే' నీ అంతు చూస్తా' దగ్గర ముగుస్తాయి.అరుదుగా అలా అంతూ పొంతూ చూసుకునే శాల్తీలు కూడా ఉంటారు!
నక్సలైట్లు ప్రభుత్వం వాదోపవాదాలు చేస్తే తెగుతుందా?
విరుద్ధ భావాలు కలవారి మధ్య వాదోపవాదాలు కూడా అంతే!
మౌనంగా ఉండటం అంత ఉత్తమ భాషణ మరేదీ లేదు!
విన్నారా? ఊరుకోండి!నో కామెంట్!
'ఊకున్నంత ఉత్తమం లేదు' అని ,నా చిన్నప్పుడు మా ఊళ్లో ఎవరో స్త్రీ అనగా విన్నమాట అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది!