గుడ్మార్నింగ్(144 వ రోజు): -తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 ఈ ఉదయం భర్త్ డే కల్చర్ గురించి రెండు మాటలు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది! కారణం? నిన్న ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత్రి ఈ భర్త్ డే కల్చర్ మీద 'విరుచుకు' పడింది! ఆమె గత అర్ధ శతాబ్ద కాలంగా ,ఇలాగే తనకు నచ్చని విషయాల మీద అలాగే విరుచుకు పడుతూ వస్తోంది! ఆ పడటం మామూలుగా పడదు- మూర్చ రోగి లాగా పడుతుంది! తెలుగు సినిమాల్లో హీరో ఫైటింగులను‌ చప్పట్లు కొడుతూ చూసే ప్రేక్షకుల మాదిరిగానే ,ఆమెకు కొందరు పాఠకులు కూడా ఉన్నారు!
ఆవిడ ఓ రాజకీయ సిద్దాంతాన్ని నెత్తిన పెట్టుకుని పుస్తకాలకు పుస్తకాలనే రాసి పడేస్తోంది! జరుపుకుంటే గింటే ఆ సైద్దాంతిక ఫంక్షన్లు‌ జరుపుకోవాలని‌ ఆమె ఆవేదన! అర్థం చేసుకోవలసిన ఆవేదనే అది కూడా!
సరే! కాసేపు వారిని వారి సైద్దాంతిక ఆవేదనను పక్కకు పెట్టి ,అనుబంధంగా మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం!
భర్త్ డే జరుపుకోవడం ఆధునిక సమాజపు 
ఓ ముఖ్యమైన శుభకార్యం అయి కూర్చుంది! ఒకరిని చూసి ఒకరు- ఒకరిని మించి మరొకరు ,పుట్టిన రోజు ఉత్సవాలు చేసుకుంటున్నారు! తమతమ ఆర్ధిక పరిస్థితులను బట్టి , పుట్టిన రోజు ఫంక్షన్ల ఖర్చులు ఉంటున్నాయి! బాగా డబ్బు సంపాదిస్తున్న వారు తమతమ పుట్టిన రోజులను వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో కూడా జరుపుకుంటున్నారు! అటువంటి వాటిలో వ్యాపార రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి!
'పులి చారలను చూసి ,నక్క వాతలు పెట్టుకున్నట్టు' ధనవంతుల భర్త్ డే ఫంక్షన్లను చూసి ,పేదవారు కూడా తమ ఆర్ధిక సామర్థ్యాన్ని మించి ఖర్చులు పెడుతున్నారు!
టివీలు రాకముందు ఇంతలా భర్త్ డే కల్చర్ లేదు!
నైంటీన్ సెవెంటీ తరువాత తెలుగు సినిమాల్లో ప్రధానంగా ఈ బర్త్ డే కల్చర్ కనపడటం ప్రారంభం అయింది!
అప్పట్లో చాలా సినిమాల్లో ఓ భర్త్ డే సాంగ్ కంపల్సరి!
నాకు బాగా గుర్తుకు ఉన్న భర్త్ డే సాంగ్స్ లో ఒకటి నన్ను టెంత్ క్లాస్ చదువుకునే రోజుల్లో బాగా ఆలోచింపచేసిన సాంగ్ ! "పుట్టిన రోజూ పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ?" అనేది ఆ పాట పల్లవి! 
రాసిన కవి పేరు గుర్తుకు లేదు! క్షమించాలి!
కుటుంబాలలో స్నేహితులలో భర్త్ డే ఫంక్షన్లు జరగడం సర్వసాధారణం అయిపోయింది! వీటిని పాజిటివ్ గా కూడా చూడవచ్చు! మనుషులు కలుసుకోవడానికి అదొక సందర్భం అవుతోంది! పాత సందర్భాలు కనుమరుగు‌ అవుతూ,కొత్త సందర్భాలకు‌ అవకాశం ఇస్తుంటాయి!
దేన్ని జరుపుకున్నా , అర్థవంతంగా ఉంటే సరిపోతుంది!
పైగా అవన్నీ కుటుంబం వ్యవహారాలు! వాటితో సమాజానికి వ్యవస్థకూ సంబంధం లేదు- నష్టం కూడా లేదు! పైగా డబ్బు ఉన్న చోటు నుండి లేని చోటుకు ప్రవహిస్తుంది కద! 
వ్యక్తిగత జీవితాలలో చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి! దిగువ మధ్యతరగతి వారికీ ,పేదవారికి ,పెద్దపెద్ద రాజకీయ వ్యవహారాలు ఏముంటాయి?
ఇలాగే ఏవో కుటుంబం ఫంక్షన్లు జరుపుకుంటారు! కలవ వలసిన వారు కలుసుకుంటారు- మాటా ముచ్చట ,మంచీ చెడూ ,సుఖ దుఃఖాలను షేర్ చేసుకుంటారు! 
అయితే, ఇటువంటి భర్త్ డే ఫంక్షన్లకు ఇంతింత ఖర్చు చెయ్యడం వృథా అనుకునేవారు కొందరు ఉంటారు!
వారు భర్త్ డేలు జరుపుకోవడానికి వ్యతిరేకం కాదు కానీ, ఇలాగా జరుపుకోకూడదు అనుకుంటారు! బయట ఎందరో ఎన్నో లేక ఇబ్బందులు పడుతున్నారు కద!? ఈ సందర్భంగా వారికి సహాయం చెయ్యాలని అనుకుంటారు! అదీ మంచిదే! ఎవరి సంతృప్తి వారికి ముఖ్యం!
అలా కూడా జరుపుకోవచ్చు!
కొందరు తమ పిల్లల పుట్టిన రోజులను అనాధ పిల్లల శరణాలయాలలో జరుపుకుంటారు! ఆ రోజు తమ బిడ్డ పుట్టిన రోజని ,కనుక అనాధ పిల్లలకు‌ ఆ పూట భోజనాలు- కొత్త బట్టలు - వస్తువులు వగైరా వారి బిడ్డలచేత ఇప్పిస్తుంటారు! ఇలా ఇప్పించడం గురించి అటువంటి వారు ఒకసారి మనసుపెట్టి ఆలోచన చెయ్యాలని మనవి!
అనాధ శరణాలయం పిల్లలకు భర్త్ డే ఫంక్షన్లు ఉండవు! వారి వారి భర్త్ డే లే సరిగా ఉండవు! అటువంటి పిల్లల ముందు ,మీ బిడ్డ భర్త్ డే ఫంక్షన్ జరుపుకోవడం వల్ల ,మీరు మీకు తెలియకుండానే వారి మనసుల్లో బాధను కలుగ చేస్తున్నారని గ్రహించాలి!
''అయ్యో ! మాకు భర్త్ డే ఫంక్షన్లు లేవే ?" అని వారు తప్పనిసరిగా మనసులో బాధ పడతారు! మీరు అక్కడికి వెళ్ళి అలా ఫంక్షన్లు జరపడం వలన ,ఆ అనాధ పిల్లలకు లేని బాధను కలిగించిన వారౌతారు! మీరూ ఆలోచించి చూడండి! ఆ పిల్లల మనసు వైపు నుండి!
ఇవ్వగలిగినవి ఇవ్వండి. భర్త్ డే అని చెప్పకండి!
భర్త్ డే ఫంక్షన్లను కూడా, లైఫ్ ఎనాలసిస్ కు‌ ఉపయోగించుకోవచ్చు!జీవితానికి లక్ష్యం ఏమిటి?
అవి ఎలా ఉండాలి? వాటిని ఎలా సాధించాలి?
గత సంవత్సరం లక్ష్యాలను సాధించామా? 
ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఏం సాధించాం? ఏం పోగొట్టుకున్నాం?
ఇలా విశ్లేషణకు వాడుకోవచ్చు!
భర్త్ డే ఫంకన్లను కూడా, లైఫ్ రివ్యూ మీటింగులుగా మార్చుకుని జరుపుకోవచ్చు!