గుడ్మార్నింగ్ (145 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మొన్న అమెరికా వ్యోమ నౌక ఒకటి అంగారక గ్రహంపై దిగింది!
ఇప్పటి వరకు సాగిన అంతరిక్ష ప్రయాణాలలో ఇది అత్యంత ముఖ్యమైన ప్రయాణం! మరో మలుపు!
భూగోళం నుండి సూర్యమండలంలోని ఇతర గ్రహాలకు సాగిన ప్రయాణాలలో ఇదే అత్యంత దూర ప్రయాణం!క్లిష్టమైన ప్రయాణం! సుమారు పది నెలల పాటు సాగి ఉంటుంది ఈ ప్రయాణం- ఏ వేగంతో సాగింది? 
ఆక్కడ ల్యాండ్ రోవర్ దిగాకా మట్టి రాళ్లు వగైరా భూమి మీదకు తేవడం, లేదా అక్కడే విశ్లేణ చెయ్యడం- మట్టిలో తేమ ఉందో లేదో , ఇంకా ఏమైన సూక్ష్మ జీవుల ఉనికి కానీ ఉందా , వగైరా పరిశోధనలు చేస్తుందని వార్తలు! 
అక్కడ రోవర్ దిగగానే నాసా శాస్త్రవేత్తలు చప్పట్లు చరుచుకుంటూ, తమ తమ సంతోషాలను వ్యక్తం చేసుకున్నారు- అందులో ఎవరో మన పొరుగు రాష్ట్రస్ధురాలు , లేదా మన తెలుగావిడేనో- ఉందని ఆమె గురించి కూడా కథనాలు వచ్చాయి!
బాగుంది! మంచిదే!
ఇతర గ్రహాల గురించి పరిశీలన పరిశోధన అనాదిగా సాగుతూ వస్తోంది! రాకెట్ టెక్నాలజీ అభివృద్ధి మూలంగా గ్రహాంతర ప్రయాణాలు వగైరా మనం చూస్తున్న విషయాలు! చంద్రుని మీదికి రష్యన్ వ్యోమగామి వెళ్లి దిగి తిరిగి రావడం గురించి నా చిన్నప్పుడు ఆశ్చర్యకరమైన వార్త!
అక్కడ చంద్రుని మీద జీవం పుట్టడానికి మనగలగడానికి అవకాశాలు లేవని ఎప్పుడో తేలిన విషయం!ఇంకా అటువైపు ఇటువైపు ఉండొచ్చు అని ఊహలు చేస్తూ ఉన్నారు!
చంద్రుని మీద నుండి కొన్ని అగ్ర రాజ్యాల ఆసక్తి అంగారకుడి మీదికి మళ్లింది! అక్కడ జీవం ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అని అంతరిక్ష పరిశోధకుల అభిప్రాయం! అందుకని అంగారకుడిపై ల్యాండ్ రోవర్ దిగిన ఘట్టం అత్యంత ముఖ్యమైన ఘట్టం! శాస్త్రసాంకేతిక అభివృద్ధి వైపు నుండి చూస్తే ఇది అపూర్వమైన విషయం- విజయం కూడా!
కానీ, మరో వైపు నుండి చూస్తూ ఉంటే , తీవ్రమైన విచారం కూడా కలుగుతోంది! అన్వేషణ అవసరమే కానీ దాని ఉద్దేశాలు ఏమిటి అని?
భూగోళాన్ని దాటి - సూర్యమండలంలోని ఇతర గ్రహాల మీదికి వెళ్లి పరిశోధనలు చేస్తున్న అగ్రరాజ్యాలు అనబడే అమెరికా రష్యా చైనా ఇండియా వంటి దేశాలు తాము బ్రతుకుతున్న భూగోళం గురించి అటువంటి పరిశోధన పరిశీలన చేస్తున్నాయా? ఒకవైపు దీన్ని వనరుల వెలికితీత పేరుతో సర్వనాశనం చేస్తూ- ఆ విధ్వంసాన్ని ఆపడానికి చర్చోప చర్చలతోనే కాలాయాపనలు చేస్తూ- అంతకంతకూ పెరుగుతూ పోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు చెయ్యకుండా, అంతరిక్ష పరిశోధన పరిశీలన అందుకు వేల వేల కోట్ల డాలర్లు లేదా రూపాయల వ్యయంతో ప్రయాణాలు వ్యర్థం కద!?ఇక్కడ వాటి అవసరం ఎంతో ఉంది కద!
అంతరిక్ష పరిశోధన- ప్రయాణాల వెనుక అగ్రరాజ్యాల పెత్తందారీ ధోరణి- వాటి వెనుక వాటి పెట్టుబడిదారీ వర్గాల లాభాపేక్షలు ఉన్నాయి!
పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాపేక్ష ప్రధానమైన వ్యవస్థ!
అది అందుకోసం ఏమైనా చేస్తుంది! భూమి మీద జరుగుతున్న యుద్దాలకు అవే కారణం!
పెట్టుబడిదారీ వ్యవస్థ తన లాభాల కోసం ,ప్రజల్లో విపరీతంగా వస్తు వ్యామోహాన్ని పెంచుతుంది! 
ఆ విపరీత వస్తూత్పత్తికి భూగర్భ ఉపరితల ఖనిజాల వెలికితీతకు ప్రపంచవ్యాప్తంగా నిత్యం నిర్విరామంగా ప్రేలుళ్లు జరుపుతున్నారు.భూమి కంపిస్తోంది! 
భూగోళాన్ని ఒకవైపు విధ్వంసం చేస్తూ, ఇతర గ్రహాలను అన్వేషిస్తున్నారు!పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలాగూ అర్థం చేసుకోవడానికి ,ఆపడానికి అంగీకరించదు!
తన లోపలికి తాను చూసుకుని పరిశీలన చేసుకోలేని మనిషి , ఇతర గ్రహాలను పరిశీలన చెయ్యడానికి ప్రయాణాలు చెయ్యడం మానవజాతి విషాదం!
మనిషి స్వార్ధాన్ని ఓడించడానికి, మనిషి విజ్ఞతను మించిన ఆయుధం లేదు! ప్రజలు తమ వస్తువ్యామోహాన్ని వదిలేస్తే చాలు, భూగోళం మరికొంత కాలం మనగలుగుతుంది!
పెట్టుబడిదారీ వ్యవస్థకు ముకుతాడు వెయ్యాలంటే,
ప్రజలు తమలోని వస్తువ్యామోహాన్ని వదిలెయ్యాలి!