బంటుమిల్లి .2:- వసుధా రాణి

 బంటుమిల్లిలో సాయంత్రాలు ఎంత బాగుండేవి అంటే మా ఇంటి ఎదురుగా బందరు వెళ్లే రోడ్డు, రోడ్డుకు ఆవలి వైపు ఓ పెద్ద అందమైన రెల్లుపాక,ఆవెనుక మళ్ళీ పొలాలు ,తాటిచెట్లు ఉండేవి.ఇంటివెనుక ఉదయిస్తూ కనువిందు చేసిన సూర్యుడు, సాయంత్రానికి ఆ పాక వెనుక తాటిచెట్లలో తెల్లని,పచ్చని రంగులు మార్చుకుంటూ ఎర్రగా అస్తమించటం ఒక చెయ్యితిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండేది.వెలిగేటప్పుడు,తొలిగేటప్పుడు కూడా అంతులేని రాజసం,అందం ఆ సప్తాశ్వసమారూఢునికే సాధ్యం.
మా గోపాల్ బడికి వెళ్లక ముందు పగలు నిద్రపోవడం వల్ల రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయేవాడు .నాకు వచ్చిన లాలిపాటలన్ని వీలైనంత శ్రావ్యంగా పాడినా (పిల్లాడు భయపడి వచ్చేనిద్ర పోకుండా) వళ్ళో వేసుకుని జో కొట్టినా,కధలు చెప్పినా ఏమి చేసినా సరే 11 గంటలదాకా పడుకునే వాడు కాదు.ఇక్కడికి వచ్చాక బడికి వెళ్లటం వల్ల 7 గంటలకే పడుకోవడం మొదలు పెట్టాడు.గూట్లో దీపం నోట్లో ముద్ద లాగా అచ్చమైన పల్లెటూరి అలవాటులా అందరం 8 గంటలకి పడక ఎక్కేయటమే.
నేనేదో ఇలా జీవితాన్ని ఖుషీగా  పిల్లల ఆటపాటలతో గడుపుతూ ఉంటే.ఓ రోజు మా ఇంటి ఓనర్ ఆంటీ బడి పిల్లలు తీసుకెళ్లే హిండాలియం స్కూల్ బాక్స్ లాంటిది ఒక చేతిలో, మరో చేతిలో హారతి పళ్లెం సరంజామాతో వెనుక తలుపు నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది  ఉదయం 10 గంటల అప్పుడు.
అమ్మా అంటూ నన్ను పిలిచి బాక్స్ తెరిస్తే కళ్ళు జిగేల్ , బాక్స్ నిండా నగలు నాకు ఏమీ అర్ధం కాలేదు,నన్ను కూర్చోమని చెయ్యిపట్టి డైనింగ్ చైర్ లో కూర్చోపెట్టి , ఒక్కో నగా తీసి  నాకు పెడుతూ కళ్ళ నీరు కార్చుకుంటూ అమ్మా నాకు నీలాంటి కూతురు ఉంది.నీలవేణి దానిపేరు కాన్పు కష్టమై పిల్లాణ్డి కని చనిపోయింది.
నీ చెల్లి అమ్మా,అంటూ ఓ ఫోటో చూపింది.నావయసే ఉంటుంది చక్కగా ఉంది. చెల్లికి నగలు ఎంత ఇష్టమో నమ్మా ఇవన్నీ దానివే అంటూ ,ఒక్క కిరీటం తక్కువ అంతే మొత్తం కెంపులు,పచ్చలు వజ్రాలు పొదిగి ఉన్న నగలు అన్నీ నాకు పేట్టేసి ,అద్దం తెచ్చి చూపించింది ,అచ్చం అమ్మోరు తల్లిలా పెద్ద బొట్టుపెట్టి,హారతి ఇచ్జి ,ఓ మైసూర్ పాక్ ముక్క నానోట్లో కుక్కి ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోయింది.
నాకు విషయం అర్ధం కావటానికి కొంచెం  టైమ్ పట్టింది.
ఆ నగలు చూసి బాధ కలిగింది.మెల్లగా ఒక్కొక్క నగా తీస్తూ ఆలోచించ సాగాను.మొదటి నుంచి నాకు కొంచెం నగలు ఈ అలంకారాలు అంటే ఆసక్తి తక్కువే , ఆరోజుతో పూర్తి వ్యామోహం నశించింది.ఎందుకు అంటే అంత ఇష్టం అని అన్నినగలు కొనుక్కున్న ఆ నీలవేణే లేదు కదా .వాళ్ళమ్మ దుఃఖం ఈ నగలు తీరుస్తాయా అని.మొత్తం పెట్టెలో పెట్టి పైకి తీసుకువెళ్లి ఇచ్చి వచ్చాను.
ఆవిడ పాపం కూతురు గుర్థుకు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని అర్ధం అయింది.ఇది వరలా కాక కనపడ్డప్పుడు కొంచెం ప్రేమగా ఆంటీ అని పలకరించేదాన్ని.
ఐతే నా వయసు ,అనుభవం ఆవిడ దుఃఖం పట్టుకోగలిగే స్థాయిలో లేవు. కొంచెం బాధ కలిగేది పాపం అనుకునేదాన్ని .
పెద్దక్కయ్యకి సీరియస్ అని ఒక ఉదయం పద్మక్క ఫోన్ హైద్రాబాద్ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళాం .వెళ్ళేసరికి అంతా అయిపోయింది.మొత్తం అన్నీ ,అమ్మని ఆపదిరోజులూ నిలబడి చూసుకోవాల్సి వచ్చింది.ఏడవటానికో,బాధపడటానికో కూడా నాకు వీలులేదు పని పని .బంధువులు,వచ్జిపోయేవాళ్ళు ,కార్యక్రమాలు జరగటానికి కావలసిన పనులతోనే సరిపోయింది.
అన్ని ముగించుకుని 15 రోజుల తర్వాత బంటుమిల్లికి ప్రయాణం. ఇంటి ముందు గేటు తీసి లోపలికి వెళ్లి పోర్టికోలో బ్యాగ్ పెడుతుండగా అమ్మా అంటూ ఓనర్ ఆంటీ వచ్చారు ,అంతే  ముందు పదిహేనురోజుల దుఃఖం అంతా పొంగిపొరలింది  అమ్మని ,అక్కయ్యలని,పెద్దక్కయ్య పిల్లల్ని,బావగారిని ఇలా అందరినీ సంబాళించిన నేను ఆంటీ అంటూ ఆవిడని పట్టుకుని ఎంత ఏడ్చానో ఆరోజు.
అప్పటి నుంచి ఆంటీ ,నేను బయట మెట్ల మీద కూర్చుని నీలవేణి కబుర్లు ఆవిడ,మా పెద్దక్కయ్య కబుర్లు నేనూ చెప్పుకునే వాళ్ళం.ఆవిడ అప్పటి  నుంచి నన్ను వాళ్ళ కూతురి ముద్దు పేరు అయిన "మబ్బమ్మా"  పేరుతో పిలిచేది.