తెలుగు ఒడిలో...:-రచన – రాజావాసిరెడ్డి మల్లీశ్వరి-9866583907

 ఈ శీర్షికలో మనం  తెలుగు భాష .
.సాహిత్య పరంగా చెప్పబడిన అనేకాంశాల గురించి  తెలుసుకుందాం.
ముందుగా కొన్ని పూల
గురించి చెప్పుకుందాం.
 అలరులు కుసుమాలు,  ప్రసూనాలు, లతాంతాలు, విరులు, 
సుమాలు...అంటూ ఎన్నెన్నో పేర్లతో పిలువబడే పూలు తమ వర్ణాలతో, సున్నితత్వం తో, సోయగంతో మన
కళ్ళకు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకేనేమో ఇక్బాల్ అనే కవి మనదేశాన్ని పూలతోటతోపోల్చారు.
ఇళ్ళ పెరళ్ళలో, తోటల్లో 
పూయించబడే ఈ పూలు. గుడిలో..గుడిలో...
బడిలో..ముడిలో మొదలైన చోట్ల సింగారానికే కాక ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడే పూలలో కనీసం కొన్నింటి గురించి తెలుసుకుందాం

పేరులో ‘మ’  అనే అక్షరంతో మొదలయ్యే పూలు చాలా ఉన్నాయి. మంకెన పూవు, మందార పూవు, మల్లెపూవు, మాలతి, మొగలిపూవు మొల్లలు – ఇలా ఎన్నో. 
మండు వేసవిలో మనల్ని తమ సువాసనతో మురిపించే, , హాయిని  కలిగించే పూలలో  మల్లెపూల గురించి ముందుగా తెలుసుకుందాం.
పూర్వం చంద్రావతి అనే శివభక్తురాలు  శివుణ్ణి మల్లెపూలతో పూజించినందున శివుడికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందట.  ముక్కంటి కంటి మంటను మసియైన మన్మథుని పంచ బాణాలలో ఈ మల్లిపూవు ఒకటి. పోతన తాను రచించిన ఆంధ్ర మహాభాగవతంలో – గోపికలు కృష్ణుడికోసం వెదుకుతూ – ఓ మల్లియలారా! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే – అంటూ మల్లెలకెంతో విలువనిచ్చాడు. 
ఇలా ఎంతో చరిత్రను తెలిపే.మల్లెపూవుకి.... గంధనిలయ,చంద్రిక,  ప్రియ, మల్లిక, మల్లియ, ముద్గరం, మృగేష్ణం,  శూన్య,  బసంతి, సుభగ, సిత మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. ఇన్ని పేర్లున్న మల్లెపూలలో కంచె మల్లి, కాడమల్లి కొండమల్లి, నాగమల్లి, దొంతరమల్లి, బొడ్డుమల్లి, శంకుమల్లి, సెంటుమల్లి వంటి రకరకాల పూలున్నాయి. మరి ఇన్నిరకాలుగా ఉన్న మల్లెపూలను మరువం, 
దవనం,కనకాంబరాలు, గులాబీలతో జతగలిపి
మాలకట్టినపుడు వాటి
అందం..పరిమళం గురించి మాటలలో చెప్పలేం.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ...అని
తెలుగు భాష పట్ల భక్తిని ,  " మల్లె కన్న తెల్లన " అంటూ స్నేహాన్ని, " మల్లెలు పూచే చల్లని వేళ " అంటూ సమయాన్ని, " నాది మల్లె పూవు వంటి
నాణ్యమైన మేనట.రారా నీ చరణమ్ముల రాలిపోదు నేనిట " అంటూ అర్పణని, " ఉల్లిపూవు
మల్లి పూవు తెల్లనివే "
అంటూ రంగుల్ని" తెలపటానికి మల్లె పూవు వాడబడింది.
అంతే కాదు...
సూర్య స్తుతిలో..
“మధ్యాహ్న భానుడూ మల్లెపూవు ఛాయ
మల్లెపూవు మీద మంకెన్నపూఛాయ” – అంటూ సూర్యవర్ణం అనేది వివిధ సమయాలలో ఎలా ఉంటుందో అని చెప్పేటప్పుడు మల్లెపూవు ఛాయతో పోల్చి   చెప్పబడింది . 
ఇళ్ళ వాకిళ్ళలో చుక్కలతో వేసే ముగ్గుల్లో మల్లెపందిరి అనే ముగ్గు కూడా ఒకటి ఉంది.. 
మనుషులలోని వేరు వేరు వ్యక్తిత్వాలను గురించి చెప్పటానికి – మల్లి మల్లే. ఉల్లి ఉల్లే – అని అంటుంటారు. ఇంకా – మల్లి పట్టిన చేను – వంటి సామెతలే కాక – మాటలకు మల్లి – అనే సామెతలతో పాటు మల్లెల వాన, మల్లెల మాసము, మంచు తడిసిన మల్లి – వంటి అందమైన పద ప్రయోగాలు ఉన్నాయి. 
మల్లి అనే పదాన్ని కూడిన పదము – మల్లికాక్షము – అనే పదం ఉంది (మల్లిలా) తెల్లని  కన్నులు గల 
గుర్రాన్ని  మరియు మలినమైన  ముక్కు, కాళ్ళుగలతెల్ల హింసను
" మల్లికా క్షమం " అని
అంటారు. గడ్డి అనేది
పచ్చగడ్డి, రెల్లు గడ్డి అంటూ ఎన్నో రకాలుగా ఉంటుంది.అలాంటి గడ్డి
విశేషాలతో ...మల్లియక రిపేరు...అనే పేరుగల గడ్డి కూడా ఉంది.
       జనం కాలక్షేప సంభాషణల్లో తమ విజ్ఞానాన్ని, ప్రకృతి పరిశీలనను, భాషా నైపుణ్యాన్ని తెలిపే  పొడుపు కథలను చెప్పి విడుపు చెప్పుమనెను జరుగుతుంటుంది. అలాంటి పొడుపు  కథల్లోను మల్లె మొగ్గలు
లేదా మల్లెపూలు చోటు చేసుకున్నాయి.అలాంటి పొడుపు కథల్లో కొన్ని....ఇంటి ముందు
పోయేటప్పుడు. తవ్వెడు
అంగట్లో కూచుంటే మానెడు...
( తవ్వెడు, మానెడు అనే పదాలు  ఒకనాటి
రోజులలో కొలతకు వాడబడిన. పదాలు.
మొగ్గలుగా ఉన్నపుడు
కొంచె మనిపించే మల్లె
మొగ్గలు. విచ్చుకున్న పుడు   చాలా అనిపిస్తాయి). 
మరొకటి...
 గరకు గరకు బండి
ఘనమైన బండి
పెద్ద రాజుల బండి
పేరైన బండి...
ఇంకోటి...
సంధ్య వేళలో విచ్చుకుంటుంది.గుభాళిస్తుంది.పెండ్లికి పెద్దలు.

మొక్కలకి, తీగలకి పూసే వివిధాలైన ఈ మల్లెపూలు తలనొప్పి నివారణకు వాడబడతాయి.
సువాసన భరితమైన నూనెలు, పరిమళం ద్రవ్యాలలో ను వాడబడతాయి. మత్తు నిచ్చే వాసనల  మల్లికల కాయలను మాదక ద్రవ్యాలలోను
వాడబడతాయి
అంతే కాదు ఆడపిల్లలు
జడలు, పెళ్ళి పందిళ్ళు, దేవతా రథాలు ..ఇలా ఎన్నింటినో సింగారమయే
మల్లె పూలు..మల్లెపూ మాలలు శోభను కలిగిస్తాయి ‘సిరిమల్లె నీవె’ అంటూ పడుచులను వర్ణించటానికి, ‘మరుమల్లి’ అని ముద్దుగా సంబోధించటానికి మూలమైన మల్లిపూవు జీవితం స్వల్పకాలానికే పరిమితమైందే. అయినా మల్లిపూవును ఇష్టపడని వారుండరు కదా. కారణం దాని స్వస్థత, పవిత్రత.
మరి మల్లెలవంటి మంచి మంచి స్నేహితులను సంపాదించుకోవాలి స్నేహమే  కదా మల్లెలా జీవితాన్ని పరిమళింపచేస్తుంది. మరచిపోకండి. 
కామెంట్‌లు