వాగుడు కాయ: - సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.--మొబైల్: 9908554535.

నీలగిరి గ్రామంలో ఉన్న ధర్మయ్య ధర్మాత్ముడు. అతనికి దేవకి అను ఒకే ఒక చెల్లెలు ఉండేది .చాలా కాలం క్రితమే ఆమెను బంగారయ్యకు ఇచ్చి అతడు పెళ్లి చేశాడు. ధర్మయ్య కస్తూరి వ్యాపారం చేసేవాడు.
          ఒకసారి బంగారయ్య కస్తూరి అవసరం పడి తన బావ ధర్మయ్య దగ్గరకు వచ్చాడు. అందరికీ ఇచ్చినట్లే ధర్మయ్య కస్తూరిని  బంగారయ్యకు  కూడా అదే ధరకు అమ్మాడు తప్ప ఒక్క పైసా కూడా తగ్గించలేదు. చేసేదిలేక బంగారయ్య అదే ధరకు కస్తూరిని తీసుకొని వెళ్లి తన గ్రామం వెళ్ళిన తర్వాత బావ ధర్మయ్యను నానా దుర్భాష లాడాడు. చెల్లెలు ,బావ అని కూడా చూడకుండా ఇతరుల మాదిరిగానే తనకు కూడా అదే ధరకు కస్తూరిని  ఇచ్చాడని ఉగ్రుడయ్యాడు బంగారయ్య.
         అతని కొడుకు శంకరం  ఈ మాటలు విని అతనినే ఈ విషయం అడుగుదామనుకుని నీలగిరికి బయలుదేరాడు. తల్లి వద్దని వారించినా వినలేదు.
        ధర్మయ్య ఇంటికి చేరుకున్న శంకరం మామయ్యను దూషించడం ప్రారంభించాడు. అందుకు ధర్మయ్య నవ్వి ఊరుకున్నాడు తప్ప పల్లెత్తు మాట కూడా అనలేదు .కొద్దిసేపటికి శంకరం  కోపం చల్లారి పోయింది. అప్పుడు ధర్మయ్య " చూడు శంకరం! మీ నాన్న పెద్ద వాగుడుకాయ అని నీకు తెలియదు. అతని నోట్లో మాట ఆగదు. నేను అతనికి మిగతా వారి కన్నా తక్కువ ధరకు అమ్మితే ఈ సంగతి అతడు ఊరి వారికందరికీ చెబుతాడు. అందువలన నా వ్యాపారం దెబ్బతింటుంది .ప్రజలకు నా మీద ఉన్న  నమ్మకం పోతుంది. వారి ముందే మీ నాన్న నన్ను కస్తూరికి ధర తగ్గించి ఇమ్మని అడగడం ఏమీ బాగా లేదు. ఒకవేళ నేను ధరను తగ్గించి ఇస్తే మిగతా వారికి కూడా అదే ధరకు ఇవ్వాల్సి వస్తుంది . 
          రెండవది ఆడబిడ్డ సొమ్ము తినే స్థాయికి మీ మామయ్య ఇంకా దిగజారలేదు .అందుకే మీ అమ్మకు చాటుమాటుగా ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నాను .ఈ సంగతి మీ నాన్నకు గాని ,నీకు గాని తెలియనే తెలియదు. కావాలంటే వెళ్లి మీ అమ్మను అడుగు .నీకే నిజం తెలుస్తుంది "అని అన్నాడు .
         అప్పుడు శంకరానికి  తన అమ్మ , మామయ్య దగ్గరికి వెళ్ళవద్దని, ఏమీ అడగవద్దని అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. శంకరం మామయ్యను క్షమించమని ప్రాధేయపడి, ఇంటికి వచ్చి తల్లి దగ్గర  నిజం తెలుసుకొని తండ్రిని గట్టిగా మందలించాడు.