సమయస్ఫూర్తి: - సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్:9908554535.

  రాము, రంగడు స్నేహితులు. రాము మర్యాదస్తుడు. రంగడు ఆకతాయివాడు. వారిద్దరూ ఒకరోజు రోడ్డు వెంబడి నడుస్తున్నారు . వారికి ఒక జ్యోతిష్కుడు కనిపించాడు .
         వెంటనే రంగడు" ఒరేయ్! వీటితో అబద్ధాలు  చెప్పిస్తానుండు. వాడి జాతకం వాడు చెప్పుకోలేని వాడు ఇతరులకు ఏం చెబుతాడు"? అంటూ హేళన చేశాడు .అప్పుడు రాము "వద్దురా రంగా!పొట్టకూటికై  వారు ఎన్నో వేషాలు వేస్తారు. అంత మాత్రాన వారిని గాని ,వారి  జ్యోతిష్యాన్ని గాని అవహేళన చేయవద్దు" అని అన్నాడు. అతని మాటలు రంగడు ఏమాత్రం వినకుండా రామును చిలక జ్యోతిష్కుడి వద్దకే తీసుకొని వెళ్ళాడు.
        రంగడు జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి" ఏమోయ్ !నేను నిన్ను ఈ స్థలం ఖాళీ చేయిస్తానా! లేదా!" అని ప్రశ్నించాడు? అప్పుడు అతడు" చూడు బాబూ! నేను ఏదో పొట్ట తిప్పలుకు చిలక జ్యోతిష్యం చూసేవాడిని. అంతేగాని మీరు దబాయించి ఈ స్థలం ఖాళీ చేయిస్తే నేను ఎక్కడకు పోవాలి? నా మీద  కనికరించండి "అని అన్నాడు.
        అప్పుడు రంగడు "అదంతా నాకు  అనవసరం. నేను ఇప్పుడు నిన్ను ఈ స్థలాన్ని ఖాళీ చేయిస్తానా! లేదా !వెంటనే ఏదో ఒకటి చెప్పు "అని అన్నాడు. జ్యోతిష్కుడు భయంతో "చేయిస్తారు బాబు" అని అన్నాడు. వెంటనే రంగడు ఎగిరి గంతేసి" నేను నిన్ను ఈ స్థలాన్ని ఖాళీ చేయించను. నీ  జ్యోతిష్యం అబద్ధం" అని గంతులు వేయసాగాడు.వెంటనే రాము రంగడిని అక్కడ నుండి తీసుకొని వెళ్ళాడు.
        ఇదంతా గమనిస్తున్న గోపయ్య అను బాటసారి జ్యోతిష్కుడి దగ్గరకు వచ్చి "ఏమయ్యా!నీ జ్యోతిష్యం అబద్ధం అని ఆ బాబు గంతులు వేస్తున్నాడే! అతనికి  అబద్ధం ఎందుకు చెప్పావయ్యా!"అని ప్రశ్నించాడు?
           అప్పుడు అతడు జరిగినదంతా చెప్పి" చూడు బాబయ్యా! జ్యోతిష్కుడికి  శాస్త్ర జ్ఞానం తో పాటు పాటు తో  సమయస్ఫూర్తి కూడా ఉండాలయ్యా! నేను అతడు స్థలం" ఖాళీ చేయించవు" అని అంటే నిజంగా ఖాళీ చేయిస్తాడు. అప్పుడు నాకు జీవనోపాధి కష్టం అవుతుంది." ఖాళీచేయిస్తావు" అని అంటే ఖాళీ చేయించడు. ఈ సంగతి నాకు ముందే తెలుసు .తెలిసి తెలిసి ఈ ఆపదనుండి రక్షించుకోవడమేనయ్యా నాకు కావలసింది. ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా ఆ ప్రశ్నకు అదే జవాబు చెప్తాడు. అంతేగాని కోరి కోరి ఎన్నో రోజులుగా నమ్ముకున్న ఈ స్థలాన్ని వదలి వెళ్ళి పోరు .
        ఇటువంటి కుర్రకారుకు అబద్ధం చెప్పడంలో నా తప్పేం లేదు .పొట్ట కూటికి ఇటువంటి వృత్తి చేపట్టినా మాకు కొంచెం నిజాయితీ వుంది. ఇతరులకు ధైర్యం చెబుతాం. వారి భావి జీవితాల గురించి శుభశకునాలే చెబుతాం. కానీ వీళ్ళ లాగా మేము దౌర్జన్యం చెయ్యం కదా"  అని అన్నాడు. ఆ మాటలకు గోపయ్య సంతృప్తి చెంది జ్యోతిష్కుడి లోకజ్ఞానాన్ని ,సమయస్ఫూర్తిని మెచ్చుకున్నాడు.