పిసినారి:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554535.


   గోవిందయ్య ఒకసారి పట్టణానికి వెళ్ళాడు. అనుకోకుండా అక్కడ వారం రోజులు ఉండవలసిన అవసరం ఏర్పడింది. కానీ తాను వేసుకున్న దుస్తులు రెండు రోజులకు మించి ధరింప లేడు. అందువల్ల ఇంకొక జత కొత్త దుస్తులు కొని కుట్టించుకుందామని అనుకున్నాడు.

         వెంటనే పట్టణంలోని ఒక బట్టల కొట్టు లోనికి వెళ్ళాడు .అక్కడ దుస్తులకు చాలా ఖరీదు చెప్పారు. వెంటనే మరొక కొట్టు లోనికి వెళ్ళాడు. అక్కడ దుస్తులకు ఉన్న ధర చూచి ఆశ్చర్య పోయి తన  దగ్గర అంత డబ్బు లేదన్నాడు. అయితే ఈ పట్నంలో ఒకే ఒక్క కొట్టులో తక్కువ ధరకు దుస్తులు దొరుకుతాయని తెలుసుకొని ఆ కొట్టు లోకి వెళ్లి రెండు వందల  రూపాయలు పెట్టి ఒక జత దుస్తులు కొన్నాడు.

        వాటిని కుట్టించడానికి ఒక దర్జీ దగ్గరకు వెళ్ళాడు. ఆ దర్జీ వాటిని కుట్టడానికి రెండు వందల యాభై  రూపాయలు  చెప్పాడు ."కొన్న కొత్త దుస్తులకే అంత ధర లేదు. కుట్టడానికి ఇంత ధరనా! అని ఆశ్చర్యపోయాడు గోవిందయ్య. వెంటనే ఆ దర్జీని వంద రూపాయలకు కుట్టి ఇమ్మని అడిగాడు .అతడు గోవిందయ్యను తిట్టి ఎదురుగా ఉన్న దర్జీ కుట్టి పెడతాడని చెప్పాడు . వెంటనే గోవిందయ్య ఆ దర్జీ వద్దకు వెళ్ళాడు. అతడు ఒక వంద యాభై  రూపాయలు చెప్పగా వంద  రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు .రెండు రోజులకు కుట్టి ఇస్తానని చెప్పగా సరేనన్నాడు గోవిందయ్య .

       రెండు రోజుల తర్వాత గోవిందయ్య వెళ్లి తన దుస్తులను తీసుకొని ,వేసుకొని చూచి ఆశ్చర్యపోయాడు .అది పాంట్  కాదు . నెక్కరు కాదు. మోకాళ్ళ వరకు ఉన్నది .అది చొక్కా కాదు.లాల్చీకాదు.మధ్యరకంగా భుజాల వరకే మొండి చేతుల బనియన్ లాగ ఉంది .అది చూసి ఆ దర్జీ దగ్గరకు వెళ్లి అడిగాడు. అప్పుడు అతడు "ఆవునయ్యా! రెండు వందల యాభై రూపాయల కుట్టుకూలికి నీవు ఇచ్చినది ఎంత ?వంద రూపాయలు మాత్రమే. దానికి తగినట్టు నేను కుట్టాను .నేను కొత్తగా పనిని  నేర్చుకుంటున్నాను. నాకు సరిగా పని రాదు .ఏదో నీవు కుట్టమని బ్రతిమాలావు కనుక కుట్టాను "అని అన్నాడు. గోవిందయ్య పిసినారి తనానికి అక్కడివారంతా అతనికి తగిన శాస్తి జరిగిందని నవ్వుకున్నారు. అనవసరంగా మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికిని దుస్తులు పనికి రానందుకు గోవిందయ్య చింతించాడు. అందుకే పిసినారితనం పనికిరాదు.