బాకి;--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి-మొబైల్: 9908554535.

  కనకయ్య ఒకసారి ధర్మాత్ముడు అని పేరు పొందిన ధర్మయ్యకు వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు .అతడు ఎన్ని సార్లు తన బాకీ చెల్లించమని అడిగినా ధర్మయ్య ఉలుకు,పలుకూ లేదు. చివరకు విసిగిపోయిన కనకయ్య గ్రామాధికారికి అతనిపై ఫిర్యాదు చేశాడు.
        గ్రామాధికారి ధర్మయ్యనుఒంటరిగా పిలిపించి అప్పు చెల్లించమని అన్నాడు. అతడు సరేనన్నాడు.అప్పు  త్వరలోనే చెల్లిస్తాడని  కనకయ్య కు గ్రామాధికారి చెప్పాడు. కనకయ్య ఆ మాటలు విని సంతోషించాడు.
          ఇలా కొన్ని నెలలు గడిచాయి. అయినా ధర్మయ్య అప్పు  చెల్లించనే లేదు. మళ్లీ గ్రామాధికారికి కనకయ్య ఫిర్యాదు చేయాలని వెళ్ళాడు. అప్పుడు గ్రామాధికారి కనకయ్యతో" కనకయ్యా! నీవు ధర్మయ్యకు అప్పు ఇవ్వడం చాలా తప్పు" అని అన్నాడు." ఎందుకు? మీరంతా నన్ను ఆడిపోసుకుంటున్నారు తప్ప అతడిని ఏమీ అనడం లేదు" అని అన్నాడు కనకయ్య. " అవును. మళ్ళీ నిన్నే  అంటున్నాను. నీవు అతనికి బాకీ ఇవ్వడమే నీ తప్పు" అని అన్నాడు గ్రామాధికారి . "ఏం !అతడు ఏమన్నా రౌడీషీటరా! నేను ఎన్నిసార్లు అడిగినా సరేనని అంటున్నాడు తప్ప నా బాకీ చెల్లించడం లేదు" అని అన్నాడు కనకయ్య. " నీవు అన్నట్టు అతడు రౌడీషీటర్ కాదు. అధర్మపరుడు అంతకన్నా కాదు. అతడు మతిమరపు మనిషి. పైగా అతడికి బ్రహ్మ చెవుడు కూడాను. ఈ సంగతి నాకు ఇతరుల ద్వారా తెలిసింది. అందువల్ల నీవన్న మాటలు అతడికి వినపడక మరోలా అర్థం చేసుకొని 'సరే ' నని అంటున్నాడు. మతిమరుపు వల్ల అతనికి జ్ఞాపకం వచ్చినప్పుడే నీ అప్పు చెల్లిస్తాడు. అతనికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో చెప్పడం కష్టం" అని అన్నాడు గ్రామాధికారి .అప్పుడు కనకయ్యకు అసలు సంగతి అర్థం అయింది . చివరకు అతని కొడుకులకు చెప్పి తన బాకీ వసూలు చేసుకున్నాడు కనకయ్య.అందుకే మతిమరుపు కలవారికి అప్పు ఇవ్వడం మంచిది కాదు.