చెట్టు దిగులు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురిమొబైల్: 9908554535.


 పూర్వం ఒక చెట్టు భూమిపై మొక్కగా మొలవక ముందు దేవుని గురించి తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చెట్టు తాను భూమిపై మొలిచి మానవులకు ఉపయోగపడాలని ఉన్నట్టు తన కోరికను వెల్లడించింది. దేవుడు 'తథాస్తు 'అని వరమిచ్చాడు.

           భూమిపై జన్మించిన వెంటనే ఆ మొక్క తిరిగి దేవుడి గురించి తపస్సు చేసింది. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగాడు. "నా ఆకులు చిన్నవిగా ఉండాలి స్వామీ!  పెద్ద ఆకులు నాకు ఇష్టం ఉండవు "అని అన్నది  సరేనన్నాడు దేవుడు.

          మరికొన్ని రోజులకు మళ్లీ ఆ మొక్క తిరిగి దేవుని ప్రార్థించింది. " మళ్ళీ ఏం కావాలి" అన్నాడు దేవుడు. " ఏమీ లేదు స్వామీ!  నా కాయలు పులుపుగా ఉండాలి. మానవులకు అవి ఉపయోగ పడాలి. నా నీడ కూడా వారికి హాయిని ఇవ్వాలి "అని వేడుకున్నది ఆ మొక్క. అప్పుడు దేవుడు 'తథాస్తు' అన్నాడు. 

         మళ్ళీ కొన్ని రోజులకు మళ్లీ ఆ మొక్క దేవుడి గురించి తిరిగి తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమై

" మళ్లీ ఏమొచ్చింది" అని అన్నాడు. అప్పుడు ఆ మొక్క నా పండ్లు మానవుని ఆహారంలో ఉపయోగపడాలి. అంతేకాదు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. దాని పిప్పి కూడా ఇత్తడి వస్తువులను శుభ్రం చేసి తళ తళా మెరిసిపోయేటట్టు చేయాలి స్వామీ!" అని వేడుకుంది. అప్పుడు దేవుడు " నీ పళ్లరసం తప్పక  మానవులు ఇష్టంతో త్రాగుతారు.నీ పిప్పి కూడా పాత్రలను శుభ్రం చేస్తుంది "అని వరమిచ్చాడు .

        ఇంకా కొన్ని రోజులకు మొక్క చెట్టుగా మారింది. అది మళ్ళీ దేవుడి గురించి తపస్సు చేసింది. ఈసారి  దేవుడికి కోపం వచ్చింది." మళ్లీ ఎందుకు తపస్సు చేశావు "అని ప్రశ్నించాడు దేవుడు.   " నా చిగురు అందరూ ఇష్టపడి తినాలి స్వామీ!" అని అన్నది ఆ చెట్టు.   దేవుడు ఓపిక వహించి సరేనన్నాడు.

           వెంటనే ఆ చెట్టు "నాకు ఇతరులకు లేని మంచి పేరు పెట్టాలి స్వామి" అని ప్రార్థించింది .దేవుడు కోపించి "నీ ఆశలకు అంతులేకుండా ఉంది. ఇక నేను నీకు ప్రత్యక్షం కాను.  ఇప్పటికే నీకు ఎక్కువ వరాలు  ఇచ్చాను .ఎన్ని వరాలు ఇచ్చిన నీవు ఇంకా దిగులుతో ఉన్నావు .నీవు ఎప్పుడూ ఏదో ఒక చింతతో  ఉంటావు కాబట్టి ఇక నుండి నీ పేరు "చింత చెట్టు"

గా సార్థకమవుతుంది "అని అంటూ అంతర్థాన మయ్యాడు. అప్పుడు చింతకు  దిగులు పట్టుకుంది. అప్పటినుండి దిగులుతో ఉన్న వారిని " చింతతో ఉన్నావు ఏమిటి "అని అడగడం పరిపాటై  పోయింది. అందుకే ఎక్కువ కోరికలు కోరుకోగూడదు.