పనికిరాని పథకం: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి--మొబైల్: 9908554635.


  రాము ,సోము మంచి స్నేహితులు .రాము చాలా తెలివిగల వాడు. ఎటువంటి పనినైనా చేయించుకునే స్వభావం కలవాడు.

          ఒకసారి వారిద్దరూ ఒక కార్యాలయానికి వెళ్లారు. అక్కడి ఉద్యోగిని కలిసిన రాము "మీది ఏ ఊరు"? అని ప్రశ్నించాడు? ఆ ఉద్యోగి" ఆరవెల్లి "అని అన్నాడు. " ఓహో మీది ఆరవెల్లా! అక్కడి ములక్కాడల గోవిందం మీకు తెలుసునా "!అని ప్రశ్నించాడు ? "అవును తెలుసు. అతడు మీకు ఏమి అవుతాడు" అని అతడు తిరిగి ప్రశ్నించాడు?. "నా మిత్రుడు "అని జవాబు ఇచ్చాడు రాము. వెంటనే ఆ ఉద్యోగి రాము పనిని చేసి పెట్టాడు.

          ఇది కళ్ళారా చూసిన సోము రాము నేర్పును గమనించి తాను మరో కార్యాలయానికి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడి ఉద్యోగిని రాము అడిగినట్లే "మీది ఏ ఊరు "అని ప్రశ్నించాడు? అతడు" గుమ్మడి పురం" అని జవాబు ఇచ్చాడు. వెంటనే సోము" అక్కడి పోక వక్కల ముకుందం మీకు తెలుసా "!అని  ప్రశ్నించాడు? " అవును తెలుసు "అని జవాబు ఇచ్చాడు  ఆ ఉద్యోగి . "అతడు  నా ప్రాణ మిత్రుడు" అని అన్నాడు సోము. " ఓహో! నీ మిత్రుడా" అని ఆశ్చర్యపోయాడు ఆ ఉద్యోగి .

           కానీ అతడు సోము పనిని చెయ్యకుండా వారం రోజులకు రమ్మన్నాడు .సోము వారం రోజులకు తిరిగి వెళ్లితే మళ్లీ నాలుగు రోజులకు రమ్మన్నాడు. తన పని అవుతుందన్న ఆశతో సోము మరలా వెళ్లితే తిరిగి మరో రెండు రోజులకు రమ్మన్నాడు. సోముకు అనుమానం వచ్చి తన పని ఎందుకు చేయడం లేదని విచారించాడు .

        ఇంతలో గుమ్మడి పురానికి చెందిన వెంకటేశంను కలిసి తన సందేహం వెలిబుచ్చాడు . "అయ్యో! ఎంతపని చేశావు?  ఆ ఉద్యోగికి, ముకుందానికి బద్ధ వైరం. అందువల్లనే అతడు నీ పని చేయకుండా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. నీ పని అతడు  చేయనే చేయడు" అని చెప్పాడు వెంకటేశం.

           తను అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి అయినందున సోము ఎంతో చింతించాడు .అందుకే ఒక్కోసారి  మనం తలచినది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.